ధోనీ.. ఆవాల్నీ వదల్లేదు!

అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ... ఓ పక్క ఐపీఎల్‌కు ఆడుతూనే మరో పక్క బహుళ వ్యాపారాల్లో తనదైన ముద్రవేశాడు. ఈ మధ్యనే నిర్మాతగా కొత్త ‘అవతార్‌’ ఎత్తిన ధోనీ ఏడాదికి దాదాపు 140 కోట్ల రూపాయల సంపాదనతో దూసుకెళుతున్నాడు. ఇంతకీ ధోనీ చేసే ఆ వ్యాపారాలేంటో ఓ లుక్కేద్దామా!

Updated : 27 Feb 2022 00:59 IST

ధోనీ.. ఆవాల్నీ వదల్లేదు!

అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ... ఓ పక్క ఐపీఎల్‌కు ఆడుతూనే మరో పక్క బహుళ వ్యాపారాల్లో తనదైన ముద్రవేశాడు. ఈ మధ్యనే నిర్మాతగా కొత్త ‘అవతార్‌’ ఎత్తిన ధోనీ ఏడాదికి దాదాపు 140 కోట్ల రూపాయల సంపాదనతో దూసుకెళుతున్నాడు. ఇంతకీ ధోనీ చేసే ఆ వ్యాపారాలేంటో ఓ లుక్కేద్దామా!


సెవెన్‌

ఇది నంబరు కాదు.ఈ పేరుతో దుస్తులూ పాదరక్షల బ్రాండ్‌ ఒకటి ఉంది. దానికి ప్రచారకర్తగా ఉండమని ఆ సంస్థ యజమానులు ధోనీని సంప్రదించారు. వారికి ప్రచారకర్తగా ఉంటూనే క్రమంగా సెవెన్‌ ఫుట్‌వేర్‌ విభాగాన్ని కొనుగోలు చేసి దానికి యజమాని అయ్యాడు.


ఆతిథ్యానికి సై

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదువుకున్న భార్య సాక్షి కోసం ధోనీ జార్ఖండ్‌లో మాహి రెసిడెన్సీ పేరుతో ఓ విలాసవంతమైన హోటల్‌ ఏర్పాటు చేశాడు. దీనికి మరెక్కడా బ్రాంచీలు లేవు.


ఫుట్‌బాల్‌పై ప్రేమ

హాకీ క్రీడని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తన సొంత రాష్ట్రంలో రాంచీ రేస్‌ పేరుతో హాకీ టీమ్‌ను ఏరాటు చేశాడు. అలానే చెన్నయిన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌లో కొంత భాగం షేర్లు కూడా తీసుకున్నాడు. సూపర్‌ స్పోర్ట్స్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగమైన ఓ రేసింగ్‌ టీమ్‌ కూడా ఉంది. ఆ టీమ్‌కి ధోనీతోపాటు నాగార్జున కూడా సహ యజమాని.


దుక్కి దున్నుతూ...

రాంచీలో దాదాపు 50 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ నిర్మించిన ధోనీ అందులో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. ట్రాక్టర్‌ ఎక్కి దుక్కి దున్నడానికి ఇష్టపడే ధోనీ తన ఖాళీ సమయాన్నంతా పంటపొలంలోనే గడుపుతుంటాడు. ప్రస్తుతం ఆవాలు, క్యాబేజీ, అల్లం, టొమాటో వంటి అనేక రకాల కూరగాయలూ, స్ట్రాబెర్రీలనూ పండిస్తున్నాడు. దేశీ ఆవులతో డెయిరీనీ, కడక్‌నాథ్‌ కోళ్లతో ఫామ్‌నూ నిర్వహిస్తున్నాడు. ధోనీ పండించే కొన్ని రకాల పండ్లూ, కాయగూరల్ని విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నాడు.


200 పైగా జిమ్‌లు

వ్యాయామానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే ధోనీ క్రికెటర్‌గా ఉన్నప్పుడే స్పోర్ట్స్‌ ఫిట్‌ వరల్డ్‌ పేరుతో జిమ్‌లను ఏర్పాటు చేశాడు. దేశవ్యాప్తంగా దిల్లీ, ముంబయి, హరియాణా, కోల్‌కతా వంటి చోట్ల దాదాపు 200లకు పైగా జిమ్‌లున్నాయి.


మార్కెటింగ్‌ ఊతం

క్రీడాకారులకు మార్కెటింగ్‌, మేనేజ్‌మెంట్‌ పనులు చేసిపెట్టడానికి రితి పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. పలువురు క్రీడాకారుల ప్రచార బాధ్యతల్ని ఆ సంస్థ చూస్తోందిప్పుడు.


ప్రచారాలు

బెంగళూరుకి చెందిన ఖాతాబుక్‌తోపాటు మరికొన్ని సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టిన ధోనీ కొన్ని బ్రాండ్లకు ప్రచారకర్తగానూ వ్యవహరిస్తున్నాడు. బూస్ట్‌, భారత్‌మ్యాట్రిమోని, మాస్టర్‌కార్డ్‌, ఓరియో, రీబక్‌, పెప్సీ, ఒప్పో, టీవీఎస్‌, సొనాటా వంటి సంస్థలకు ప్రచారకర్తగా ఉన్నాడు.ఒక్కో ఎండార్స్‌మెంట్‌కి దాదాపు ఆరుకోట్లకుపైనే తీసుకుంటాడు ధోనీ.


కొత్త అవతారం...

ఎమ్‌.ఎస్‌.ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో రెండేళ్ల క్రితమే సొంత నిర్మాణ సంస్థను మొదలుపెట్టాడు. దాని ద్వారానే పూర్తి గ్రాఫిక్స్‌తో అధర్వ పేరిట మైథలాజికల్‌ సైంటిఫిక్‌ వెబ్‌సిరీస్‌ రూపొందించాడు. అందులో ధోని అవతార్‌ యానిమేటెడ్‌ రూపంలో అలరించనున్నాడు. భవిష్యత్‌లో ఈ నిర్మాణ సంస్థ ద్వారా మరిన్ని సినిమాలూ, వెబ్‌సీరిస్‌లూ ప్రొడ్యూస్‌ చేసే ఆలోచనలో ఉన్నాడు.


ఎలక్ట్రానిక్స్‌ ధర తగ్గుతుందా?

ప్రస్తుతం వస్తోన్న మొబైల్‌, ట్యాబ్‌, ల్యాప్‌ట్యాప్‌... ఏవయినా టచ్‌ స్క్రీన్‌తోనే వస్తున్నాయనేది అందరికీ తెలిసిందే. అయితే ఆ స్క్రీన్‌ని ఇండియం లోహంతో చేస్తారని తెలియకపోవచ్చు. ఇండియం టిన్‌ ఆక్సైడ్‌ అనేది విద్యుద్వాహకంగానే కాదు, కాంతిని చక్కగా ప్రతిఫలింపజేస్తుంది. అందుకే ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ, ఇ-ఇంక్‌, టచ్‌ స్క్రీన్‌, ఎల్‌ఈడీ లైట్లు, గ్లాస్‌ కోటింగ్స్‌, సోలార్‌ సెల్స్‌... వంటి వాటెన్నింటికో ఈ లోహాన్నే వాడుతుంటారు. కానీ నేలలో ఈ లోహం చాలా అరుదుగా లభిస్తుంది. అదీ నేరుగా కాకుండా ఇతర లోహాల కోసం- ముఖ్యంగా జింక్‌ను తవ్వినప్పుడు దాంతోపాటుగా లభిస్తుంది. అందుకే దీనికి ప్రత్యామ్నాయం కోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా క్వీన్‌ మేరీ యూనివర్సిటీకి చెందిన నిపుణులు- ఇండియంకి బదులుగా  గ్రాఫీన్‌ను ఉపయోగించవచ్చు అంటున్నారు. పైగా ఈ గ్రాఫీన్‌ను ఎలక్ట్రానిక్స్‌లోనూ ఎన్నో రకాలుగా వాడుకోగలగడమే కాదు, భారీయెత్తున తక్కువ ధరలోనూ ఉత్పత్తి చేయవచ్చు అంటున్నారు. అప్పుడు ఎలక్ట్రానిక్స్‌ మరింత చౌక కావచ్చన్నమాట.


ఎనామిల్‌ దెబ్బతింటే...

మనిషి శరీరంలోకెల్లా దృఢమైన కణజాలం ఏదైనా ఉందీ అంటే దంతాలమీద ఉన్న ఎనామిల్‌ మాత్రమే. మనం పళ్లను కోపంతో పటపటలాడించినా ఎంత గట్టిగా ఉన్నదాన్ని కొరికినా కూడా అది తట్టుకుంటుంది. నిజానికి ఈ పొర చాలా పలుచగానే ఉంటుంది కానీ ఎంతో దృఢంగా ఉంటుంది. అయితే, ఒకసారి ఇది దెబ్బతింటే మళ్లీ దీన్ని ఏర్పరచడం కష్టం. అందుకే దంత నిపుణులు చాలా కాలంగా దానికి ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల మిచిగన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ సరికొత్త కృత్రిమ ఎనామిల్‌ను రూపొందించారు. ఇది దంతాలమీద సహజంగా ఉండేదానికన్నా అన్ని రకాలుగానూ ఎంతో దృఢంగా ఉందట. కాబట్టి దీన్నిగానీ దంతాలమీద వేయగలిగితే ఎన్నో దంత సమస్యల్ని నివారించవచ్చు అంటున్నారు.


గాయానికి కీటకం మందు!

శ్చిమ ఆఫ్రికాలోని గాబన్‌లో ఉన్న ఒజొగా చింపాంజీ ప్రాజెక్టు అది... ఓసారి అక్కడ నివసిస్తోన్న సియా అనే చింపాంజీ, తన సంతానంలోని మగ చింపాంజీ కాలుమీద ఉన్న పుండుని గుర్తించింది. వెంటనే అది గాల్లోని ఓ కీటకాన్ని ఒడిసి పట్టుకుని నోట్లో వేసుకుని ఆ తరవాత దాన్ని పుండుమీద అద్దిందట. పుండుని తగ్గించేందుకు సియా చేసిన చర్య అక్కడి పరిశోధకుల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో ఆ బృందం మరో 15 నెలలపాటు చింపాంజీల్నీ వాటికి అయిన గాయాల్నీ పుండ్లనీ నిశితంగా పరిశీలించిందట. అందులో సుమారు 80 చింపాంజీలు తమ గాయాలనే కాదు, ఇతర చింపాంజీలకి పుండు పడినప్పుడు కూడా ఇలాగే చేశాయట. పుండుని తగ్గించేందుకు అవి పాటించిన ఈ ప్రవర్తనను బట్టి కేవలం మనుషుల్లోనే కాదు, సామాజిక జీవనం అనేది కోతులూ ఇతర జంతువుల్లో కూడా ఉందనీ, అదే పరిణామ క్రమంలో మనిషికి సంక్రమించిందనీ భావిస్తున్నారు. పైగా మానవాళిలో కూడా రోగనివారణకోసం కీటకాల్ని వాడే పద్ధతి వాడుకలో ఉంది. ఎందుకంటే కీటకాలు యాంటీబయోటిక్‌, యాంటీవైరల్‌గా పనిచేస్తాయనీ నొప్పిని నివారించే గుణం వాటికి ఉందనీ పేర్కొంటున్నారు. అంటే- ఈ రకమైన ప్రవర్తనతో కూడిన విజ్ఞానం జంతువుల నుంచే మనిషికి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.


నానోటెక్నాలజీలో మొక్కజొన్న..

నానోటెక్నాలజీని ఇప్పటికే అనేక వైద్య చికిత్సల్లో- ముఖ్యంగా క్యాన్సర్‌ నివారణలో వాడుతున్నారు. అయితే బయో నానోపార్టికల్స్‌ ద్వారా క్యాన్సర్‌ కంతుల్నీ నివారించవచ్చు అంటున్నారు టోక్యో యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన పరిశోధకులు. అదెలా అంటే- మొక్కజొన్నను నీటితో చర్య పొందించడం ద్వారా రూపొందించిన నానో పార్టికల్స్‌ను క్యాన్సర్‌ నివారణలో వాడొచ్చట. కృత్రిమ పద్ధతిలో నానో పార్టికల్స్‌ తయారీ క్లిష్టతరమైనదే కాదు, ఖర్చుతో కూడుకున్నది కూడా. కానీ, దెబ్బతిన్న అవయవాలూ కణజాలాల్లోకి ఔషధాన్ని నేరుగా పంపించేందుకు నానోటెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. అయితే కృత్రిమ నానో పార్టికల్స్‌ శరీరంలోని కణాలతో చర్య పొందకుండా ఉండేందుకు ఎంతగానే శ్రమించాల్సి వస్తోంది. అందుకే ఆ నానో రేణువుల్ని మొక్కలనుంచే తయారుచేస్తేనో అని ఆలోచించారు సదరు పరిశోధకులు. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పండించే మొక్కజొన్నలోని సుక్రోజ్‌ అణువుల్నీ నీటినీ కలిపిన మిశ్రమాన్ని నానో రేణువులుగా తయారుచేశారు. ఆపై వాటిని ఎలుకల్లోని కంతుల్లోకి పంపించినప్పుడు అవి తగ్గుముఖం పట్టాయట. దీన్నిబట్టి మొక్కజొన్న నానోపార్టికల్స్‌కు యాంటీక్యాన్సర్‌ మందుల్ని జోడించడం ద్వారా అనేక క్యాన్సర్‌ వ్యాధుల్ని నివారించవచ్చు అని భావిస్తున్నారు.


ఫస్ట్‌... ఫస్ట్‌..!

1965లో లండన్‌కు చెందిన జాన్‌ షెపర్డ్‌ బారన్‌ అనే వ్యక్తి సెల్ఫ్‌ సర్వీస్‌ క్యాష్‌ డిస్పెన్సర్‌ని కనిపెట్టాడు. ఇదే తర్వాతి కాలంలో ఆటోమెటిక్‌ టెల్లర్‌ మెషీన్‌(ఏటీఎమ్‌)గా వాడుకలోకి వచ్చింది. దీన్ని 1967 జూన్‌ 27న బార్క్లెస్‌ బ్యాంక్‌ ఆవరణలో ఏర్పాటు చేయగా...రెగ్‌ వార్నే అనే బ్రిటిష్‌ నటుడు మొదటిసారి దీన్నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు