Updated : 03 Jul 2022 00:33 IST

చనిపోయిన నాన్న... పెళ్లికొచ్చాడు!

నాన్న లేకుండానే పెళ్లిపీటలెక్కాల్సి వచ్చిందని కుమిలిపోతున్న కూతురు హఠాత్తుగా పెళ్లిపందిట్లో ప్రత్యక్షమైన తండ్రిని చూసి పరుగున వెళ్లి వాటేసుకుంది. అమ్మ రాకుండా కొత్తింట్లో గృహప్రవేశమేంటని బాధపడుతున్న కూతుళ్లు సోఫాలో నవ్వుతూ కూర్చున్న తల్లిని చూసి కళ్లనీళ్లతో ఒడిలో వాలిపోయారు. ఎవరు వీళ్లూ అసలేం జరిగిందీ అంటే...

మొన్నీమధ్య హైదరాబాద్‌లో... ఓ వేదిక మీద పెళ్లి వేడుక జరుగుతోంది. మండపంలో అతిథులంతా ఆసీనులై ఉన్నారు. అంతలో పెళ్లికూతురు తండ్రి లోపలికి వచ్చారు. ఆయన్ను చూసిన కుటుంబ సభ్యులు సంభ్రమాశ్చర్యాలతో నిశ్చేష్టులయ్యారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన్ని గుండెలకు హత్తుకున్నారు. చుట్టూ ఉన్న బంధుమిత్రులు ఆశ్చర్యంతో అలా చూస్తూనే ఉండిపోయారు. కూతురు పెళ్లికి తండ్రి వస్తే - అంత ఆనందమూ, ఆశ్చర్యమూ ఏమిటనుకుంటున్నారా? ఏడాదిన్నర క్రితం కరోనాతో కనుమూసిన వ్యక్తి- పట్టుపంచె కట్టుకుని మరీ కూతురి పెళ్లికి వస్తే ఆశ్చర్యమే కదా. ఇంతకీ ఇదంతా ఎలా సాధ్యమైందీ అంటే... అందుకు కారణం సిలికాన్‌ శిల్పుల కళే. చేసింది బొమ్మే అయినా అచ్చుగుద్దినట్టు ‘పోయిన మనిషే తిరిగి వచ్చాడా’ అన్నంత భ్రమను కలిగించేలా ఉంది కాబట్టే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు అంతలా ఆనందపడిపోయారు. చూసినవాళ్లందరూ రెప్పలు వాల్చకుండా అలా చూస్తుండిపోయారు. ఇదొక్కటే కాదు... విజయవాడకు చెందిన ఓ కూతురు- అమ్మ జ్ఞాపకాల్ని తలచుకుంటూ కుమిలిపోతున్న నాన్న కోసం అమ్మను నట్టింట్లో నిలబెట్టింది. తమిళనాడులో ఓ చెల్లి... ప్రమాదంలో చనిపోయిన అన్న ఒడిలోనే తన బిడ్డ చెవులు కుట్టించి ముచ్చటపడిపోయింది. ఇలా ఈమధ్య చాలామంది బొమ్మలకే జీవకళ తీసుకొస్తూ -దూరమైన ఆత్మీయులను తయారు చేయించుకుంటున్నారు.

మనల్ని వదిలివెళ్లిపోయిన ఆత్మీయులకు గుర్తుగా ఇదివరకు వాళ్ల ఫొటోల్ని మాత్రమే పెట్టుకునేవాళ్లం. కానీ ఇప్పుడు రూపమే కాదు... వాళ్లు నిజంగా ఉన్నట్టే అనిపించే అనుభూతినీ పొందడానికి ఈ సిలికాన్‌ విగ్రహాల్ని చేయించుకుంటున్నారు.

ఎలా చేస్తారంటే...

సెలబ్రిటీ బొమ్మల్ని అచ్చమైన పోలికలతో చేసిన మైనపు బొమ్మల గురించి వినుంటారు కదా. ఈ సిలికాన్‌ బొమ్మలూ అలాంటివే. కానీ వీటిల్లో రబ్బరులా ఉండే సిలికాన్‌ పదార్థాన్ని వాడతారు. ఈ సిలికాన్‌... బొమ్మకు సహజమైన రూపాన్ని తేవడంతో పాటు జీవమున్న మనిషిని స్పృశించిన అనుభూతినీ ఇస్తుంది. అందుకే దీన్ని వాడుతూ మామూలు ఫొటోను ప్రాణం ఉన్న బొమ్మగా మార్చి చనిపోయిన వారిని తిరిగి కళ్లముందుకు రప్పిస్తున్నారు. ఇందుకోసం ఎవరి విగ్రహం చేయాలో వారికి సంబంధించిన ఫొటోల్ని -రకరకాల యాంగిల్స్‌లో ఉన్నవి- తీసుకుంటారు. తర్వాత ఆ పోలికలతో ముందుగా మట్టివిగ్రహాన్ని చేసి- సిలికాన్‌, ఫైబర్‌ వాడుతూ ఫొటోలోని వ్యక్తి అచ్చుల్ని తయారుచేస్తారు. అలా పూర్తి రూపం తీసుకొచ్చాక రంగుల్ని అద్దుతారు. ఆ తర్వాత రియలిస్టిక్‌గా ఉండటానికి జుట్టూ... దుస్తులూ... ఇతర అలంకరణ వస్తువులన్నీ నిజమైనవే వాడతారు. మొత్తంగా సిద్ధమైన ఈ సిలికాన్‌ బొమ్మను చూసినవాళ్లెవరైనా... ‘అరె ఇది బొమ్మా... మనిషా...’ అనకుండా ఉండలేరు. అంత సహజంగా ఉంటుందా బొమ్మరూపం మరి. ఈ సిలికాన్‌ విగ్రహాల్ని తయారుచేసే కళాకారులు బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా, విశాఖపట్నం... వంటి అన్ని ప్రముఖ నగరాల్లోనూ ఉన్నారు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని