ఆదివాసీలు... రూ.5 కోట్లతో ఆలయం కట్టారు..!

వాళ్లందరూ ఆదివాసీలే. నాగేంద్రుడిని భక్తిశ్రద్ధలతో కొలిచేవాళ్లే. ఏడాదికోసారి నాగోబా జాతర పేరుతో సుమారు వంద కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి స్వామిని పూజించుకునేవాళ్లే.

Updated : 11 Dec 2022 13:44 IST

ఆదివాసీలు... రూ.5 కోట్లతో ఆలయం కట్టారు..!

వాళ్లందరూ ఆదివాసీలే. నాగేంద్రుడిని భక్తిశ్రద్ధలతో కొలిచేవాళ్లే. ఏడాదికోసారి నాగోబా జాతర పేరుతో సుమారు వంద కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి స్వామిని పూజించుకునేవాళ్లే. ఇప్పుడు ఆ భక్తులు మరో అడుగు ముందుకేసి తమ ఇష్టదైవానికి సొంత డబ్బుతో ప్రత్యేక ఆలయాన్ని నిర్మించి... స్వామి పట్ల తమకు ఉన్న భక్తిని చాటుకున్నారు.

ఆ దివాసీలకు నాగేంద్రుడే ఇష్టదైవం. ఏడాదికోసారి నాగోబా జాతర పేరుతో స్వామి పట్ల తమ భక్తిని చాటుకుంటారు. స్వామిని పూజిస్తే సకల శుభాలూ కలుగుతాయని నమ్ముతారు. నాగేంద్రుడిని అంతగా పూజించే ఆ అడవిబిడ్డలు ఇప్పుడు తమ దేవుడికి ఓ పెద్ద ఆలయాన్ని కట్టించేందుకు చేయీచేయీ కలిపి అయిదుకోట్ల రూపాయల్ని సేకరించారు. ఇప్పుడు వాళ్ల కష్టం ఫలించడంతో ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో విశాలమైన ప్రాంగణంలో ఆకట్టుకునే నిర్మాణంతో నాగోబా ఆలయం రూపుదిద్దుకుంది. అసలు నాగేంద్రుడికి నాగోబా అనే పేరు రావడానికీ ఆ స్వామిని ఆదివాసీలు ఎక్కువగా పూజించడానికీ సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.

స్థలపురాణం

ఆదివాసీ గోండులలో మెస్రం వంశస్థుల ఇలవేల్పు నాగోబా. పూర్వం మెస్రం కుటుంబానికి చెందిన నాగాయి మోతి అనే రాణికి ఓసారి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడట. స్వామి చెప్పినట్లుగానే ఆమెకు సర్పం జన్మించడంతో తన సంతానంగా భావించి సాకేదట. కొన్నాళ్లకు రాణి ఆ సర్పానికి తన తమ్ముడి కూతురు గౌరితో వివాహం జరిపించింది. ఓసారి గౌరి తన భర్తను బుట్టలో పెట్టుకొని తీర్థయాత్రలకు వెళ్లింది. ఆ క్రమంలో ధర్మపురి వద్ద ఉన్న గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా సర్పం మనిషి రూపంలోకి మారిందట. అయితే... కొంత సమయానికే ఆ మనిషి పాముగా మారిపోయి తన భార్య గౌరి కోసం వెతుకుతూ కేస్లాపూర్‌లోని ఓ పుట్టలోకి వెళ్లిపోయిందని కథనం. ఆ పుట్ట దగ్గరే నాగోబా ఆలయాన్ని నిర్మించారు. అదేవిధంగా నాగేంద్రుడు తన భార్య గౌరికి ఓ ఎద్దును ఇచ్చాడనీ.. క్రమంగా అదీ రాయిగా మారిందనీ ఆ శిలే ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లాలోని శ్యాంపూర్‌లో పూజలు అందుకుంటోందనీ చెబుతారు. అలా వెలసిన నాగోబానే మెస్రం వంశస్థులు పూజిస్తున్నారిప్పుడు. ఏటా పుష్య మాసంలో వచ్చే అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని నమ్మే మెస్రం వంశస్థులు ఆ సమయంలో జాతరను నిర్వహిస్తారు. జాతరలో స్వామిని పూజిస్తే తమ కోర్కెలు నెరవేరతాయని నమ్ముతారు.

నిధులు సేకరించారిలా...

కేస్లాపూర్‌ గ్రామ శివారులోని అడవి ప్రాంతంలో స్వామి ఉన్న పుట్ట వద్ద 1942లో గుడిసెను వేసి క్రమంగా చిన్న ఆలయాన్ని నిర్మించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లో మెస్రం వంశస్థులు పెరిగి సుమారు అయిదువేల కుటుంబాలు కావడంతో అంతా కలిసి ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఇందుకోసం ప్రతి ఇంటి నుంచి రూ.5 వేల చొప్పున అయిదేళ్లపాటు చందాలు సేకరించి... 2017లో నిర్మాణం ప్రారంభించారు. ఆలయ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ నుంచి ప్రత్యేకమైన రాళ్లను తెప్పించారు. తమిళనాడు రామేశ్వరంలో దొరికే ప్రత్యేక శిలతో నాగోబా విగ్రహాన్ని తయారుచేయించారు. తమ సంకల్పం నెరవేరడంతో డిసెంబరు 12 నుంచి 18 వరకూ నాగోబా ఆలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.

ఎలా చేరుకోవచ్చు

ఈ ఆలయానికి రైల్లో రావాలనుకునేవారు మంచిర్యాలలో దిగి అక్కడినుంచి ముత్నూరుకు చేరుకోవాలి. అదే బస్సులో అయితే... ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి ముత్నూరు వరకూ బస్సులు ఉంటాయి. అక్కడినుంచి కేస్లాపూర్‌లోని ఆలయం నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. నిర్మల్‌ మీదుగా రావాలనుకునేవారు గుడిహత్నూరుకు వచ్చి.. అక్కడి నుంచి ముత్నూరుకు వెళ్లొచ్చు.

బండారి లక్ష్మీనర్సయ్య, న్యూస్‌టుడే ఇంద్రవెల్లి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..