సిసింద్రీ

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు కథలన్నా, ఆటలన్నా చాలా ఇష్టం కదూ. కథ వింటూ ఆడుకుంటుంటే భలే ఉంటుంది కదా! అసలు కథ, ఆట రెండూ కలిసే ఉంటే... ఇంకా బాగుంటుంది కదూ! సరిగ్గా దీనికోసమే ‘టాక్టో కోడింగ్‌’ అనే ఆటవస్తువు దొరుకుతోంది.

Published : 22 May 2022 00:25 IST

సిసింద్రీ

కథ వింటూ.. ఆడుకుందామా!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు కథలన్నా, ఆటలన్నా చాలా ఇష్టం కదూ. కథ వింటూ ఆడుకుంటుంటే భలే ఉంటుంది కదా! అసలు కథ, ఆట రెండూ కలిసే ఉంటే... ఇంకా బాగుంటుంది కదూ! సరిగ్గా దీనికోసమే ‘టాక్టో కోడింగ్‌’ అనే ఆటవస్తువు దొరుకుతోంది. మన దగ్గర ట్యాబ్‌ ఉంటే చాలు. దానిలో టాక్టో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని, టాక్టో కోడింగ్‌ కిట్‌ను జత చేస్తే సరిపోతుంది. ఎంచక్కా కథలు వింటూ ఆడుకోవచ్చు. విశేషం ఏంటంటే.. ఈ టాక్టో యాప్‌ ఇంటర్నెట్‌ లేకున్నా పనిచేస్తుంది. యాప్‌ను ఓపెన్‌ చేసి అందులో ఉన్న స్టోరీల్లో మనకు నచ్చిన దాన్ని ఎంచుకుని ప్లే చేయాలి. దానిలో వచ్చే సూచనల ప్రకారం కిట్‌లో ఉన్న వస్తువుల సాయంతో ట్యాబ్‌ స్క్రీన్‌పై టచ్‌ చేస్తే సరిపోతుంది. ట్యాబ్‌లో వీడియో, ఆడియో ప్లే అవుతుంది. కళ్లముందే కార్టూన్ల ప్రపంచం కనువిందు చేస్తుంది. ఏదో ఒక కథ విన్నామా ఆడుకున్నామా అన్నట్లు కాకుండా.. ఇది చాలా సరదాగా ఉంటుంది. ఈ టాక్టో కోడింగ్‌ కిట్‌ ఆన్‌లైన్‌లో లభిస్తుంది. యాప్‌ కూడా గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది.



న్యాయ గంట!

అనగనగా కోశలాపురం అనే రాజ్యం ఉండేది. దాన్ని రాజశేఖరుడు పరిపాలిస్తుండేవాడు. రాజు మంచి వాడే కానీ.. కాస్త మూర్ఖుడు. తాతల కాలం నుంచే కోట ముందు న్యాయగంట ఉండేది. సమస్యల్లో ఉన్న ప్రజలు వచ్చి దాన్ని మోగిస్తే... రాజు వారి కష్టాలను తీర్చేవాడు. రాజశేఖరుడి హయాంలోనూ ఆ ఏర్పాటు అలాగే కొనసాగింది. ఓసారి రాజ్యంలో విపరీతమైన గాలిదుమ్ము వీచింది. కోటముందు గాలి సుడులు తిరుగుతూ పైకి లేచింది. అప్పుడు ఆ గాలి తీవ్రతకు అనుకోకుండా న్యాయగంట మోగింది. అది రాజు చెవిన పడింది. భటులు వచ్చి చూస్తే.. అక్కడెవరూ కనిపించలేదు. దాంతో గాలి వల్ల ఆ గంట మోగినట్లు అర్థమైంది. వెంటనే సభను కొలువుదీర్చాడు రాజు. తన పరివారానికి విషయం చెప్పాడు మంత్రి. ‘గాలికి ఏదో సమస్య వచ్చింది. అందుకే అది వచ్చి న్యాయగంట కొట్టింది. కానీ దాని ఇబ్బంది ఏంటో చెప్పకుండానే వెళ్లిపోయింది. మీ అందరికీ రెండు రోజులు గడువు ఇస్తున్నా.. అదేంటో కనిపెట్టండి. లేకుంటే మీకు శిక్ష తప్పదు’ ఆదేశించాడు రాజు. అందరూ తలలు పట్టుకున్నారు. చూస్తుండగానే ఆ గడువు పూర్తైంది. మళ్లీ సభ సమావేశమైంది. రాజు ఒక్కొక్కరినీ పిలిచి ‘గాలికొచ్చిన సమస్య ఏంటో తెలుసుకున్నారా?’ అని అడిగాడు. ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేకపోయారు. చివరికి మంత్రి వంతు వచ్చింది. ‘మహారాజా! నేను గాలిని అడిగాను. నిజానికి దానికి ఇబ్బందులేమీ లేవట. కానీ.. ప్రజలు గతంలో చెప్పుకొన్న సమస్యల్లో కొన్ని ఆ గంటకు వేలాడుతున్నాయట. మీ అద్భుత పరిపాలనలో సమస్యలు అలా గంటకు వేలాడటం గాలికి నచ్చలేదట. అందుకే అది ఆ సమస్యలను తనతోపాటు తీసుకెళ్లిం దట. ఈ విషయం మీకు అప్పుడే చెప్పిందట. మహాజ్ఞానులైన మీకు విషయం తెలిసినా... మాకు పరీక్ష పెట్టారని గాలి నాకు చెప్పింది’ వివరించాడు మంత్రి. ఈ సమాధానంతో రాజశేఖరుడు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. నిజానికి ఇందులో అసలు వాస్తవమే లేదు. అంతా అబద్ధమే.. మూర్ఖుడైన రాజు వల్ల ఏ ఇబ్బంది వస్తుందోనని మంత్రి ఇలా చెప్పాల్సి వచ్చింది. సభలోని వారంతా హాయిగా ఊపిరి పీల్చుకుని మంత్రికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..