నా సినిమా హిట్టు... నాకేమో తిట్లు..!

సినిమా రంగంలో అత్యంత ముఖ్యమైన రోజు శుక్రవారం. ఆ రోజు విడుదలయ్యే చిత్రానికి మంచి టాక్‌ వస్తే ఎన్నో ఏళ్ల కష్టానికి ఫలితం దక్కినట్లే. ఆ కుర్రాడి జీవితంలో అలాంటి శుక్రవారమే వచ్చి... తొలి చిత్రం విడుదలై విజయవంతమూ అయింది.

Updated : 30 Jul 2023 10:38 IST

సినిమా రంగంలో అత్యంత ముఖ్యమైన రోజు శుక్రవారం. ఆ రోజు విడుదలయ్యే చిత్రానికి మంచి టాక్‌ వస్తే ఎన్నో ఏళ్ల కష్టానికి ఫలితం దక్కినట్లే. ఆ కుర్రాడి జీవితంలో అలాంటి శుక్రవారమే వచ్చి... తొలి చిత్రం విడుదలై విజయవంతమూ అయింది. కానీ అంతటితో తన కష్టాలు తీరకపోగా... ఇంకా పెరిగాయి. తిట్లే కాదు దెబ్బలూ కాయాల్సి వచ్చింది. అలాంటి స్థితి నుంచీ ఇండస్ట్రీ తన వైపు చూసేలా చేసిన ‘బేబీ’ వరకూ యువ దర్శకుడు సాయిరాజేష్‌ది ఒక సినిమాను తలపించే ప్రయాణం. అది అతని మాటల్లోనే...

మాది నెల్లూరు. నాన్న ప్రభుత్వోద్యోగి... అమ్మ గృహిణి. నాకో తమ్ముడు. సినిమా చూస్తే పిల్లలు పాడైపోతారు అని బలంగా నమ్మే కుటుంబం మాది. నాకేమో చిన్నప్పట్నుంచే సినిమా పిచ్చి. ఆ పిచ్చి ఏ స్థాయికి చేరిందంటే... ఇంటర్‌కి వచ్చేసరికల్లా ఒకే రోజు ఒకే సినిమా నాలుగు షోలూ చూసేవాడిని. అప్పట్లో చూసిన ప్రతి సినిమా టికెట్‌నూ ఒక పుస్తకంలో పిన్‌ చేసి పెట్టేవాడిని. 1999లో అనుకుంటా... ఏడాది మొత్తంలో 85 తెలుగు సినిమాలు రిలీజైతే... అన్నీ కలిపి 293 షోలకు థియేటర్లలో ఉన్నానని ఆ బుక్‌ చూసుకుంటే తెలిసింది! అలా డిగ్రీ కూడా చేయకుండానే 2004లో హైదరాబాద్‌ వచ్చేశా. బతకడానికి ఏదో ఒక పని చేయాలి కాబట్టి స్నేహితులు పెట్టిన ఒక వెబ్‌సైట్లో వార్తలు రాయడం మొదలుపెట్టా. మరోవైపు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ అవకాశం కోసం వెతుకుతుండేవాణ్ణి. మధ్యలో ప్రేమించి పెళ్ళీచేసుకున్నా. ఇద్దరు పిల్లలు. కుటుంబ పోషణ కష్టమయ్యేది. కోచింగ్‌ సెంటర్లకు స్టడీ మెటీరియల్స్‌ టైప్‌ చేసీ ఇస్తుండేవాణ్ణి. ఆరేళ్ళ పోరాటం తర్వాత దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య దగ్గర పని చేసే అవకాశం వచ్చింది. ‘తూనీగ తూనీగ’ సినిమా కోసం ఏడాదిన్నర పాటు రచనా విభాగంలో పని చేశాను. ఏవో కారణాలతో ఆదిత్య ఆ ప్రాజెక్టు నుంచి బయటికి రావడంతో... నా కథ మళ్లీ మొదటికి వచ్చింది!

నేనే దర్శకుణ్ణయిపోదామనుకున్నా...

అప్పటికి నేను హైదరాబాద్‌ వచ్చి ఎనిమిదేళ్ళు... సాధించిందేమీ కనిపించలేదు. ఆ పరిస్థితుల్లో సహాయ దర్శకుడిగా వెళ్ళడానికి ప్రయత్నించడం వృథా అని నేనే సినిమా తీద్దామనుకున్నా. కథలు పట్టుకుని తిరగడం మొదలుపెట్టా. నలుగురైదుగురు హీరోలకి కథలు చెప్పినా ఫలితం కనిపించలేదు. అప్పుడే ఏదైనా కొత్తగా చేద్దామని- తెలుగు సినిమాల్లో హీరోయిజం మీద వ్యంగ్యంగా ఓ సినిమా తీద్దామనుకున్నాను. అదే ‘హృదయ కాలేయం’. కానీ కథ చెబితే ఏ హీరో కూడా ఒప్పుకోలేదు. ఓసారి ప్రసాద్‌ ల్యాబ్‌కి వెళితే ఓ వ్యక్తి రంగు రంగుల దుస్తులేసుకుని నా దృష్టిని ఆకర్షించాడు. తన వాలకం వింతగా అనిపించి... ‘నా సినిమాలో హీరోగా చేస్తావా’ అని అడిగా. అతను ‘అందుకు నేను డబ్బులెంత ఇవ్వాలి’ అనడిగితే నవ్వొచ్చింది. ‘నేనే నీకు డబ్బులిస్తా’ అని చెప్పి అతణ్ణి హీరోగా ఖాయం చేసుకున్నా. తన పేరు నరసింహాచారి అయితే... ‘బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు’గా మార్చాను. నా పేరు కూడా స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, శంకర్‌ల పేర్లు కలిసొచ్చేలా ‘స్టీవెన్‌ శంకర్‌’ అని పోస్టర్లు విడుదలచేశాను! ఆ పోస్టర్లు తననెంతో నవ్వించాయని ఎస్‌ఎస్‌ రాజమౌళి ట్వీట్‌ చేయడంతో మా సినిమా అందరి దృష్టిలో పడింది. దర్శకుడు మారుతి సహా కొందరు మిత్రుల సాయంతో రూ.80 లక్షలు పెట్టి సినిమా పూర్తి చేశాం. రూ.90 లక్షలకు అమ్మగలిగాం. తొలి రోజు హౌస్‌ ఫుల్స్‌ పడ్డాయి!  అనూహ్యంగా పెట్టుబడి మీద దాదాపు రెట్టింపు వసూళ్లు రాబట్టింది! సినిమాను అమ్మిన డబ్బులతో ఎవరికివ్వాల్సింది వాళ్లకు ఇచ్చేశాను. అప్పులు కట్టాను. సినిమాను కొన్నవాళ్లకు మంచి లాభాలు వచ్చినా నా చేతిలో ఒక్క రూపాయీ మిగల్లేదు. పోనీలే సినిమా సక్సెస్‌ అయింది... అదే చాలు అనుకున్నా. కానీ ‘హృదయ కాలేయం’ టీవీలో ప్రసారమైన రోజు రాత్రి నుంచి నాకు నరకం మొదలైంది. మా సినిమా తమ అభిమాన హీరోల్ని కించపరుస్తోందని అనుకున్న కొందరు ఫోన్‌ చేసి మరీ ‘ఇదేం సినిమా.. నువ్వేం డైరెక్టర్‌వి’ అని మొదలు పెట్టి బూతులు తిట్టేవాళ్లు. ఒక రోజు నేనూ, సంపూర్ణేష్‌ బాబూ ఓ హోటల్‌కి వెళితే అక్కడున్న యువకులు కొందరు మమ్మల్ని కొట్టారు! దర్శకుణ్ణి కావడానికి పదేళ్లు పడ్డ కష్టం ఒకెత్తయితే... ఈ అవమానాలు మరో ఎత్తు. కానీ ఓ దశలో అవన్నీ నాలో కసిని రాజేశాయి. ‘హృదయ కాలేయం’ తరహాలోనే రొనాల్డ్‌ దర్శకత్వంలో ‘కొబ్బరిమట్ట’ సినిమాను నిర్మించాను. రెండున్నర కోట్ల బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ విజయం తరువాత ఇక సీరియస్‌ సినిమాలు తీయాలనుకున్నా...

జాతీయ అవార్డు అందుకున్నా...

నేను రాసిన కథతోనే నిర్మాతగా ‘కలర్‌ ఫోటో’ మొదలుపెట్టా. నల్లగా ఉన్నందుకు నేను ఒకప్పుడు ఆత్మన్యూనతా భావంతో బాధపడేవాడిని. నా భార్య నా రంగు కాకుండా మనసు చూసి ప్రేమించింది. అదే ‘కలర్‌ఫొటో’కి మూలం. ఓటీటీలో విడుదలైన ఆ సినిమాకి మంచి స్పందన వచ్చింది. దాన్ని మించి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డూ దక్కింది. అంత సాధించినా అప్పటికి ‘హృదయ కాలేయం’ దర్శకుడిగానే చూస్తుండేవారు. ఏదైనా కార్యక్రమాల్లో వేదికలపైకి నన్ను పిలవాలంటే... ఆ సినిమా పేరు పలకడానికీ ఇష్టపడేవారు కాదు! ఆ ముద్ర పోవాలనే ‘బేబి’ మొదలుపెట్టాను.ఈ సినిమా హిట్టవు తుందనుకున్నాను కానీ ఇంతటి సంచలనం రేపుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు!

తిమ్మాపురం చంద్రశేఖర్‌రెడ్డి, ఈనాడు, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..