అమ్మ ఎంతో మీరూ అంతే

‘‘సుహా! ఇంటికి వచ్చేటప్పుడు ఇరవైవేలు డ్రా చేసి తీసుకురా’’ భర్త శ్రీహర్ష మాటలకు కళ్ళెత్తి చూసింది సుహాసిని విషయమేమిటన్నట్లు. కళ్ళతోనే మాట్లాడుతుందంటారందరూ సుహాసినిని చూసి.

Updated : 06 Aug 2023 02:55 IST

- డా।। మజ్జి భారతి

‘‘సుహా! ఇంటికి వచ్చేటప్పుడు ఇరవైవేలు డ్రా చేసి తీసుకురా’’ భర్త శ్రీహర్ష మాటలకు కళ్ళెత్తి చూసింది సుహాసిని విషయమేమిటన్నట్లు. కళ్ళతోనే మాట్లాడుతుందంటారందరూ సుహాసినిని చూసి.

‘‘అదే, ఈ నెల నీ ఖర్చులు... వదినకు ఇవ్వాలి’’ అన్నాడు మాటలకు తడుముకుంటూ. అర్థంకానట్లు చూస్తున్న సుహాసినితో ‘‘పెళ్ళికి ముందు ఒక్కడినే కదా, ఇరవైవేలు ఇచ్చేవాడిని ఖర్చులకు. ఇప్పుడు నువ్వున్నావు కదా! పెళ్ళికి నా జీతమంతా ఖర్చయిపోయింది. వచ్చే నెల నిన్నడగను. నా జీతంలో అడ్జస్ట్‌ చేసుకుంటాను’’ సుహాసిని అడగకుండానే సంజాయిషీ ఇచ్చుకున్నాడు శ్రీహర్ష.

అప్పటికి ఊరుకుంది సుహాసిని. కానీ, ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. పెళ్ళయి ఇంకా నెల రోజులు కాలేదు. ఉమ్మడి కుటుంబం. పెద్దాయన- బావగారు- శ్రీకాంత్‌. ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఇద్దరు ఆడపిల్లలు. రెండు మూడేళ్ళక్రితం కొత్తగా కట్టుకున్న మూడు పడక గదుల ఇల్లు. పెళ్ళికి ముందు అది ఉమ్మడి ఆస్తి అన్నట్లుగా ఉన్న మాటలు... మొన్న తోటికోడలు పద్మ ఎవరితోనో మాట్లాడుతుంటే తెలిసింది- అది వాళ్ళ సొంతమనీ, ఉమ్మడి ఇల్లు వాళ్ళ ఊరిలో ఉందనీ. హర్షకన్నా చిన్నదైన ఆడపడుచు, శ్రీలత పెళ్ళయి భర్తతో బెంగుళూరులో ఉంటోంది. పెళ్ళికొచ్చిన ఆమె, వారం రోజుల క్రితమే తన ఇంటికి వెళ్ళింది. అరవై అయిదేళ్ళ అత్తగారు, యశోదమ్మగారే ఇంకా వంటగదిలో! పెత్తనం పోతుందన్న భయమా... ఆమెను చూస్తుంటే అలా అనిపించడంలేదు. తోటికోడలు అత్తగారి మేనకోడలే. ‘అత్తా, ఈరోజు ఇది చేసుకుందాం. నీ వంట రుచి ఎవరికీ రాదు’ అంటూ తియ్యగా మాటలు చెప్తూ ఆ రోజు వంట ఏం చెయ్యాలో అత్తగారికి పురమాయిస్తుంది.

పిల్లలు కూడా స్కూలు నుండి రాగానే ‘నాన్నమ్మా, అది కావాలి, ఇది కావాలి’ అని వాళ్ళ నాన్నమ్మనే అడుగుతుండటం కూడా చూస్తోంది. హర్ష కూడా ఏం అవసరమైనా వాళ్ళమ్మనే అడుగుతున్నాడు. నెల రోజులలోనే అర్థమయింది- పెత్తనం తోటికోడలిదనీ, పని అత్తగారిదనీ. ఈ వయసులో ఆమె కష్టపడుతుంటే చూడడానికి కష్టంగా ఉంది. పోనీ ఇంట్లో ఉన్నప్పుడు తానేమైనా సాయం చెయ్యబోతే ‘నీకెందుకులేమ్మా’ అనేస్తున్నారు. చొరబడి చెయ్యడం తనకు ఇంకా అలవాటు కాలేదు. చూచాయగా హర్షతో అంటే, ‘నువ్వు మరీ భూతద్దంలో నుండి చూస్తున్నావు. వదిన అమ్మను సొంత తల్లిలా చూసుకుంటుంది. లేకపోతే గొడవలు లేకుండా ఇన్నాళ్ళు కలిసి ఉండగలరా? నువ్వూ వదినలాగే అమ్మనలా చూడొచ్చు కదా!’ అని తిరిగి తనకే చెప్పాడు. అంతేకానీ, వాళ్ళమ్మ మంచితనాన్ని వదిన వాడుకుంటుందన్న విషయం చెప్పినా అర్థం చేసుకోవడం లేదు.

పెళ్ళయిననాటి నుండి తాను గమనించిన ఇంకొక విషయమేమిటంటే... ఇంట్లో ఏ ఖర్చు కనిపించినా ‘హర్షా, పాలవాడు వచ్చాడు చూడు. పనిమనిషి జీతం అడుగుతుంది చూడు’ అని తన భర్తకే పురమాయిస్తోంది తోటికోడలు పద్మ. ఆఖరికి పిల్లల ఫీజులు కూడా. ఈ నెల తన ఖర్చులు అదనం. అంటే... తామిద్దరి కోసం చెరో ఇరవైవేలు. ఇంటి ఖర్చులకు పెడుతున్న డబ్బు కాక, నెలకు నలభై వేలు.

అత్తగారికి పెన్షన్‌ వస్తుందని తెలుసు. కానీ, అదేమవుతుందో ఇంకా తెలియదు. ఇప్పటి నుండే తాను ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే తర్వాత విచారించి లాభం లేదు. ఆలోచిస్తూ అటు తిరిగి పడుకున్న సుహాసిని మీద చెయ్యి వేయడానికి జంకాడు శ్రీహర్ష. పెళ్ళయిన తర్వాత తొలిసారి భార్యాభర్తలు దూరంగా పడుకున్నారు.

*         *       *

‘‘ఏమిటీ, ట్రాన్స్‌ఫరా! మీకు ట్రాన్స్‌ఫర్‌లు ఉండవేమో!’’ బావగారు.

‘‘పెళ్ళయి రెండు నెలలు కాలేదు. అప్పుడే ఎడబాటా?’’ తోటికోడలు.

గదిలో తనకు చెప్పకుండా ఇప్పుడు భోజనాల దగ్గర చెబుతున్నందుకు చిన్నబుచ్చుకున్న ముఖంతో భర్త.

‘‘ఆపించుకోవచ్చేమో, కనుక్కోకూడదా’’ అత్తగారి ఆదుర్దా.

‘‘అయితే మేము సెలవులకు బాబాయి వాళ్ళింటికి వెళ్ళొచ్చు’’ పిల్లల ముఖంలో ఆనందం. వాళ్ళను దగ్గరకు తీసుకుంటూ ‘‘తప్పకుండా’’ అని, ‘‘మంచి ఆఫర్‌ వచ్చింది బావగారూ. ఆఫీసులో అందరూ ఈ ఛాన్స్‌ వదులుకోవద్దని చెప్తున్నారు. అదీకాక, ఈయనకు వర్క్‌ ఫ్రం హోమే కదా! ఈయన నాతోపాటు వస్తారు. ఇంక ఎడబాటు ఏముంటుంది?’’ తోటికోడలిని చూస్తూ చెప్పింది సుహాసిని.

ఆ రాత్రి గదిలో ‘‘సుహా, ఇక్కడే ఉంటే బాగుంటుందేమో. అలవాటైన ఊరు. అందరం కలిసి ఉండవచ్చు. ఇక్కడ నీకు వంటపనీ ఇంటిపనీ లేదు. అన్నీ అమ్మా వదినా కలిసి చేసుకుంటారు. బయటకు వెళితే మనం కష్టపడాల్సి వస్తుంది. ఆలోచించు. అదీకాక, అమ్మను వదిలి నేనుండలేను’’ చెప్పాడు శ్రీహర్ష.

‘ఈయన వీళ్ళ అమ్మను వదిలి ఉండలేరు. మరి, నేను మా అమ్మను వదిలి ఇక్కడకు రాలేదా!’ మనసు చిన్నబుచ్చుకుని అటు పక్కకు తిరిగింది సుహాసిని. అప్పటికి తానన్న మాటలో తప్పు తెలిసింది శ్రీహర్షకు. రెండోసారి భార్యాభర్తలు దూరం దూరంగా...

*         *       *

‘‘ఈయన అత్తయ్యను వదిలి ఉండలేరట. అత్తయ్యని మాతో తీసుకువెళ్తాం’’ భోజనాల దగ్గర సుహాసిని మాటలకు పిడుగుపడింది ఆ ఇంట్లో.

‘‘అమ్మ లేకపోతే ఎలా?’’ బావగారు.

‘‘హర్షే కాదు, అత్తను వదిలి నేనూ ఉండలేను, కదత్తా’’ తోటికోడలు.

తనతో మాట మాత్రంగా కూడా చెప్పకుండా అందరి ముందూ చెబుతున్నందుకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ హర్ష.

‘‘నాన్నమ్మ లేకపోతే మాకు నచ్చినవి ఎవరు చేస్తారు?’’ పెద్ద మనవరాలు. ‘‘నాన్నమ్మ లేకపోతే మేము స్కూలు నుండి వచ్చేసరికి ఇంట్లో ఎవరుంటారు?’’ చిన్న మనవరాలు.

‘‘ఏమే, నేనింట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాను? నాన్నమ్మ ఉంది కదా అని ఎప్పుడైనా అలా...’’ అంటూ చిన్నదాని నెత్తిన మొట్టి ‘‘అత్త ఎక్కడికి రాదు. మొదటి నుండీ అలవాటైన ఊరు, పరిసరాలు. ఇప్పుడు తననెక్కడికీ పంపించలేను’’ ప్రేమగా అత్త భుజాల మీద చేతులు వేస్తూ అంది తోటికోడలు.

‘‘సరే అక్కా, మీ ఇష్టం. కానీ, ఏ విషయమైనా క్లియర్‌గా మాట్లాడటం నాకలవాటు. ఆ తర్వాత గొడవలు పడటం ఇష్టముండదు. ముందే చెప్తున్నాను... ముందు ముందు... ‘అత్తను మేమిన్ని సంవత్సరాలు చూసుకున్నాం. ఇంకా మేమెన్నాళ్ళు చూస్తాం? మీరు చూడండి’ అని ఎప్పుడూ అనకూడదు. ఇప్పుడు పంపించకపోతే అత్తయ్యగారిని చివరి వరకూ మీరే చూసుకోవాలి’’ కుండ బద్దలుకొట్టింది సుహాసిని. సుహాసిని తెగువకు నలుగురూ నిశ్చేష్టులైపోయారు. అదేమీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది సుహాసిని.

మెత్తగా కనిపించే భార్యలో, తనకు చెప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేంత తెంపరితనమా? పెళ్ళయి పదేళ్ళయినా, ఏ విషయానికైనా

‘మీ అన్నయ్యను అడగాలి హర్షా... అమ్మో ఆయనకు చెప్పకుండానే..?’ అనే వదిన మాటలు గుర్తుకొస్తున్నాయి హర్షకు. మరి తన భార్య... నిర్ణయం ఆమె తీసుకున్నాక అందరితోపాటు తనకు చెబుతుంది. వదిన లాంటి అమ్మాయిని కాకుండా, ఇటువంటి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నందుకు తప్పు చేశానని మొదటిసారి బాధపడ్డాడు హర్ష. మూడోసారి భార్యాభర్తలు దూరం దూరంగా...

*         *       *

ఇన్నాళ్ళూ ప్రశాంతంగా ఉండే ఆ ఇంట్లో శాంతి లోపించింది. ఎవరి ముఖంలోనూ నవ్వులేదు. ఎవరికివారే దూరం దూరంగా ఉంటున్నారు. భోజనాలవేళ ఏదో మొక్కుబడికి కూర్చున్నట్లు... గబగబా తిని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు.

నోరు నొక్కుకుంటూ ఇరుగుపొరుగు వారికి తన తోటికోడలి గండ్రాయితనం చేరవేస్తోంది పద్మ. ‘‘మేనత్తే అయినా, ఏ రోజైనా అత్త ముందు నోరు విప్పానా నేను? పెద్దవారు బావగారున్నారని కూడా లెక్కలేకుండా మాట్లాడుతుందా? ఇప్పుడు అత్తను పంపించకపోతే తర్వాత నాకు బాధ్యత లేదని చెబుతుందా? ఉద్యోగం చేస్తున్నానన్న పొగరు. పెళ్ళయి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే వేరు కాపురం పెట్టిస్తోంది. ఇన్నాళ్ళూ అందరం కలిసి హాయిగా ఉన్నాం. హర్షను ఏనాడైనా మరిదిలా చూశానా... సొంత తమ్ముడులాగే చూసుకున్నాను. అత్తను అత్తలాగా చూశానా... అమ్మలాగే చూసుకున్నాను. ఇప్పుడు ఈవిడొచ్చి ఇంట్లో చిచ్చు పెడుతోంది. అయినా హర్షకైనా బుద్ధుండాలి కదా? ‘నోరు ముయ్యి’ అని పెళ్ళానికి చెప్పుకోలేడా? ‘నువ్వు పోతే పో, నేను రా’నని గట్టిగా చెప్పలేడా?’’ అంటూ అడగనివారికీ అడిగినవారికీ చెబుతోంది పద్మ.
హర్ష చెవిలో పడుతూనే ఉన్నాయా మాటలు. అసలు హర్ష వినాలనే పద్మ అందరితో చెబుతోందా మాటలు. ఆ మాటలు హర్షలో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. వదిన అంటున్నట్లు ‘నేను రానని చెబితే..? ఈ రోజు ఈ విషయం అటో ఇటో తేల్చేయాలి...’’ గట్టిగా అనుకున్నాడు.

సుహాసిని ఆఫీసు నుండి రాగానే ‘‘ఇంటికి సంబంధించిన విషయాలలో కూడా కనీసం నాతో సంప్రదించకుండా నువ్వే నిర్ణయాలు తీసుకోవడం నాకు నచ్చలేదు. నేను రానంటే ఏం చేస్తావ్‌? పెళ్ళయి ఇన్నేళ్ళయినా అన్నయ్యను అడగకుండా వదిన ఒక్క పనీ చెయ్యదు తెలుసా?’’ గట్టిగా అడిగాననుకున్నాడు హర్ష.

‘‘ఈ ఇంట్లో ఉండటానికి డబ్బులిమ్మని, మీ అన్నయ్యగారు కూడా ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా మీ వదినను అడిగి ఉండరు తెలుసా?’’ అంతే గట్టిగా సమాధానం వచ్చింది. ‘డబ్బులడిగి చాలా పెద్ద తప్పు చేశావు’ అంతరాత్మ హెచ్చరించింది హర్షను.

*              *

‘అత్తను వాళ్ళతో పంపిస్తే ఉపయోగమేమిటి? పంపించకపోతే ఏమిటి?’ అన్న విషయం గదిలో తీవ్రంగా ఆలోచిస్తోంది పద్మ. హర్షలాగా కాదు సుహాసిని. ఏ విషయమైనా తెగేదాకా లాగుతుందన్న సత్యం అర్థమవుతోంది. ఇప్పుడు పంపించకపోతే, రేపెప్పుడో అత్త మంచానపడితే మాది బాధ్యత కాదని ఇప్పుడే చెప్పేసింది. పోనీ అత్తను పంపించేద్దామంటే... ‘అమ్మో, అన్ని పనులూ తానే చేసుకోవాలి. పంపించకపోతే... ఎల్లకాలమూ అత్త ఇలాగే ఉంటుందన్న గ్యారెంటీ లేదు. మీదపడే వయసు... ఏ రోజు ఎలా ఉంటుందో? ముసలితనంలో ఏ జబ్బులొస్తాయో? వాటికెంత ఖర్చవుతుందో? ఖర్చు విషయం పక్కన పెడితే చాకిరీ ఎవరు చేస్తారు? అమ్మో, వద్దులే, ఆవిడను ఉంచుకోవడమెందుకు? కాలూ చెయ్యీ పడిపోయాక ఆవిడ కింద చాకిరీ చెయ్యడమెందుకు? పంపించేస్తాను, ‘చివరివరకూ ఆవిడ బాధ్యత మీదే’ అని గట్టిగా చెప్పి మరీ పంపిస్తాను, నిర్ణయించుకుంది పద్మ.

*         *       *

యశోదమ్మ చిన్న కోడలితో వెళ్ళాలన్న నిర్ణయం జరిగిపోయింది. ‘నీ నిర్ణయం ఏమిటీ, ఎక్కడుంటావు?’ అని ఏ ఒక్కరూ కూడా ఆవిడను అడగలేదు. ఆవిడ మనసులో ఏముందో ఎవరూ పట్టించుకోలేదు. రేపే ప్రయాణం.

‘‘ప్రయాణం ఒకరోజు వాయిదా వేసుకుంటే బాగుంటుందేమో..!’’ అడగలేక, అడగలేక చిన్న కోడల్ని అడిగింది యశోదమ్మ.

‘‘ట్రాన్స్‌పోర్టు వాళ్ళతో మాట్లాడేశాను. ఇంకోరోజు తర్వాతంటే కుదరదు. మీకు కావలసిన వస్తువులన్నీ ఆ గదిలో పెడితే, పనివాళ్ళు వచ్చి ప్యాక్‌ చేస్తారు. డాక్టరు ప్రిస్క్రిప్షన్లూ మందులూ మాత్రం మర్చిపోకండి. అన్నట్టు మర్చిపోయాను... మీ పెన్షన్‌ కాగితాలూ పాస్‌బుక్‌ కూడా మర్చిపోకండి’’ అందరూ వింటుండగానే యశోదమ్మతో చెప్పింది సుహాసిని.

ఆ మాట వినగానే కోపంతో ఊగిపోతూ ‘ఎంత ధైర్యం! అమ్మ పాస్‌బుక్‌ తెచ్చుకోమంటావా?’ అనబోయి సుహాసినిని చూసి ఆగిపోయాడు శ్రీకాంత్‌. ఏదో అనబోయిన పద్మను కళ్ళతోనే హెచ్చరించాడు వద్దని.

‘ఛీ... ఆఖరికి ఈ స్థితికి దిగజారిపోయావా?’ అన్నట్లు తిరస్కారంగా చూసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు హర్ష. ఆ రాత్రి వాళ్ళ గదిలోకే రాలేదతను.

తన దుఃఖం ఎవరికీ తెలియకూడదని తులసికోట దగ్గర వెక్కివెక్కి ఏడ్చింది యశోదమ్మ ఆ రాత్రి.

ప్రయాణం ఒక్క రోజు వాయిదా వేసుకుంటే ఎల్లుండి ఉదయం పూజ చేసుకుని, బయలుదేరవచ్చు. రేపే ప్రయాణమంటే... ప్రయాణం చేసి, తీసుకెళ్ళిన సామాన్ల ప్యాకెట్లు కాలికడ్డం తగులుతుంటే, వంటసామాన్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ, సర్దుకుంటూ వీళ్ళ అవసరాలే తీరుస్తుందా? తన పూజే చేసుకుంటుందా? ‘ఆ ఒక్క రోజు’ తనకు ఏమీ లేకపోయినా, ఎవరూ పట్టించుకోకపోయినా కనీసం దేవుడికి పూజ చేసుకుంటేనైనా మనసు ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు, ఆ అద్దె ఇంట్లో తులసికోటా పూజగదీ లేకపోయినా కనీసం దేవుడి పటమైనా ఉంటుందో లేదో? పూజ చేసుకునే పరిస్థితైనా తనకుందో, లేదో? అడిగితే కోడలేమని సమాధానం చెప్తుందో? తన పిల్లలే తనను పట్టించుకోకపోతే కోడలికేం అవసరం తనను పట్టించుకోవడానికి?

పెద్దకొడుకు శ్రీకాంత్‌, తండ్రిలాగే తనకు ఏ విషయమూ చెప్పడు. నెలకొకసారి సంతకం పెట్టడానికి చెక్కు పుస్తకం తెస్తాడు. మాట్లాడకుండా సంతకం పెడుతుంది తను. పొరపాటున ఏదైనా అడగబోయినా ‘నీకెందుకమ్మా అవన్నీ’ అని మాట కొట్టిపడేస్తాడు.

పెద్దకోడలు పద్మ, ఆడపడుచు కూతురు. ‘అత్తా, అత్తా’ అంటూ కూర్చున్న చోటు నుండి కదలకుండా లౌక్యంగా అన్ని పనులూ తనచేతే చేయిస్తుంది. ‘అత్త నన్ను ఏ పనీ ముట్టుకోనివ్వదు. పెళ్ళయి ఇన్నేళ్ళయినా ఆమె మాట తోసెయ్యలేను’ అంటూ తీయగా కబుర్లు చెబుతుంది. అది ఆమె తప్పుకాదు, తన తప్పే. మొదటి నుండీ ఎవరేమన్నా, ఏ పని చెప్పినా నోరు మెదపకుండా చెయ్యడం అలవాటైపోయింది. భర్తా అత్తగారూ తననలా చేసేశారు.

‘పోనీ ఏదో గడిచిపోతుంది, అందాక ఒంట్లో ఓపిక ఉంది’ అని సమాధానపడుతుంటే, ఇప్పుడు చిన్న కోడలు... తననే రకంగా చూడబోతోందో. భర్తా, బావగారూ, తనకన్నా పెద్దది తోటికోడలూ ఉన్నది కూడా చూడకుండా చెక్కు పుస్తకం తీసుకురమ్మని తనకు ధైర్యంగా చెప్పింది. అరవైఅయిదేళ్ళు వచ్చినా ఇప్పటికీ తనకెంత పెన్షన్‌ వస్తుందో అడగలేని తన చేతకానితనానికి బాధపడాలో... ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలో... తనకన్నా చెక్కు పుస్తకానికే విలువ కడుతున్నందుకు దిగులుపడాలో... ఇన్ని జరుగుతున్నా నోరెత్తని చిన్న కొడుకుని చూసి జాలిపడాలో కోపగించుకోవాలో... చిన్నకోడలి దగ్గర ఇంకెన్ని కష్టాలుపడాలో... అర్థంకాని అయోమయ స్థితిలో రాత్రంతా ఏడుస్తూనే ఉంది యశోదమ్మ. ఆ మర్నాడే ప్రయాణం.

*               *

యశోదమ్మ భయపడినట్లు అక్కడ ఏమీ జరగలేదు. ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా సామాన్లు సర్దేసి ఉన్నాయి. ఇంట్లో ఒక మూలగా... చిన్నదైనా, దేవుడిగది. చాలా ఆనందపడిపోయింది యశోదమ్మ. స్నానం చేసి పూజ చేసుకునేటప్పటికి, పరమాన్నం చేసి పట్టుకొచ్చింది కోడలు ‘దేవుడికి నైవేద్యం పెట్టం’డంటూ. దానికే చాలా సంతోషపడిపోయింది యశోదమ్మ.

‘‘నాకొచ్చినట్లు వంట చేశాను. రాత్రి డిన్నరుకు బయటకు వెళ్దాం. రెడీగా ఉండండి’’ భర్త వింటుండగా అత్తగారితోనే చెప్పి ఆఫీసుకు వెళ్ళింది సుహాసిని. మొన్నటి నుండీ భార్యాభర్తల మధ్య మాటలు లేవు మరి.

        *       *

వెయిటర్‌ కేక్‌ తెస్తుంటే ‘ఎవరో ఆ అదృష్టవంతులు? అందరిమధ్యా పుట్టినరోజు జరుపుకోగలుగుతున్నారు’ అనుకుంటూ చిన్ననాటి సంగతులు గుర్తుకొచ్చి తనకా అదృష్టం లేనందుకు యశోదమ్మ మనసు బాధపడింది. నాన్నగారు ఉన్నప్పుడు తన పుట్టినరోజు కూడా ఎంతో వైభవంగా చేసేవారు. లేకలేక పుట్టిన ఒక్కతే కూతురు. లక్షల ఆస్తి. వైభవంగా చెయ్యకేమి? ఊరందరికీ భోజనాలు పెట్టించేవారు. ఆయన వెళ్ళిపోయారు. అంతే, తన జీవితంలో సంతోషమే మాయమైపోయింది.

నాన్నకు క్యాన్సర్‌ అని తెలియడం... ఆయన పోయేలోగా తన పెళ్ళి చూడాలని... ఇదిగో, ఈయనకు కట్టబెట్టారు. నాన్న పోయిన దిగులుతో అమ్మ ఎక్కువ కాలం బతకలేదు. లక్షల ఆస్తికి వారసురాలైనా తనకంటూ ఎవరూ లేరు. ఆస్తి ఉన్న తనకు అహం ఎక్కడ అంటుకుంటుందోనని, అడుగడుగునా ఆంక్షలు పెట్టే అత్తగారు... భార్య అంటే భర్త బాగోగులు చూసుకునేది మాత్రమే అనుకునే భర్త... అంతేగానీ, భార్య బాగోగులు తనూ పట్టించుకోవాలని ఏ రోజూ అనుకోలేదాయన. తనకూ ఒక పుట్టినరోజు ఉంటుందని అత్తవారింట్లో ఎవరికీ పట్టలేదు.

పోనీ పిల్లలు పెద్దవాళ్ళయ్యాకైనా ‘నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా?’ అని అడుగుతారేమోనని ఆశగా ఎదురుచూసేది కొన్నాళ్ళు. కొడుకులదేముంది? పోనీ కూతురైనా... పెళ్ళి అయ్యాకైనా తన బాధ అర్థం చేసుకుంటుందేమోనని ఎదురుచూసేది. ఎంతసేపూ తనెన్ని కష్టాలు పడుతుందో చెప్పేదే కానీ, ఒక్క రోజు కూడా ‘నువ్వెలా ఉన్నావమ్మా? ఇన్నాళ్ళూ మాకెలా చేశావమ్మా’ అని అడగలేదు. ఆఖరికి తనకూ ఒక పుట్టినరోజు ఉందని ఏనాడో మర్చిపోయింది. ఇదిగో ఎవరిదో ఈ పుట్టినరోజు... మరలా తనలో ఆలోచనల తుట్టెను కదిపింది... బయటికి రాబోయిన కన్నీళ్ళను, కళ్ళు మూసుకుని లోపలే అదిమేసింది.

కళ్ళు తెరిచేసరికి తమ టేబుల్‌ దగ్గరికే వచ్చింది కేకు. ఆశ్చర్యపోయింది యశోదమ్మ. ‘కోడలు సుహాసిని పుట్టినరోజా? అందుకేనా డిన్నరుకి తీసుకొచ్చింది.’

తనలాగే కొడుకు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు తమ టేబుల్‌ దగ్గరకు వచ్చిన కేకు వైపు.

‘‘అరవయ్యారవ జన్మదిన శుభాకాంక్షలు అత్తయ్యా’’ యశోదమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది కోడలు సుహాసిని.

ఎన్నో సంవత్సరాల నుండి వినాలనుకున్న ఈ మాట... తొలిసారి వింటుంటే యశోదమ్మ కళ్ళమ్మట గంగ ప్రవహించింది.

‘‘ఏమిటత్తయ్యా ఇది. మీరెంతో సరదా పడతారనుకుంటే, ఏమిటిది?’’ కోప్పడింది సుహాసిని.

‘‘లేదమ్మా! మా నాన్న గుర్తుకు వచ్చారు. ఆయన ఉన్నప్పుడు నా పుట్టినరోజు ఎంతో వైభవంగా చేసేవారు. ఇప్పుడు మరలా నువ్వు... పెళ్ళయిన ఇన్ని సంవత్సరాలకు. ఈ మాట మొదటిసారి వింటుంటే... నా పిల్లలు కూడా ఏ రోజూ చెప్పలేదు. ఇప్పుడు నువ్వు... నా కోడలివి చెప్తుంటే, కళ్ళమ్మట ఆ నీళ్ళు వాటంతట అవే వస్తున్నాయి. నా ప్రమేయం లేదు’’ గొంతు బొంగురుపోతుంటే కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది యశోదమ్మ.

కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు చూస్తున్నాడు సుహాసినిని హర్ష. ఇన్నాళ్ళూ తామెవ్వరూ చెయ్యనిది... ఇందుకేనా, ప్రయాణం వాయిదా వెయ్యమని అమ్మ అడిగినా ఒప్పుకోలేదు.

‘‘మీకు కోడలినైనా, కూతురిననే అనుకోండి. నాకు మా అమ్మ అయినా, మీరైనా ఒకటే. ఇక నుండి మీరెలా ఉండాలనుకుంటే అలానే ఉండండి. మీకేది ఇష్టమైతే అదే చెయ్యండి’’ యశోదమ్మను హత్తుకుంటూ అంది సుహాసిని.

‘‘నా పుట్టినరోజు ఈ రోజని నీకెలా తెలిసింది’’ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది యశోదమ్మ.

నెల్లాళ్ళక్రితం ఇంట్లో జరిగిన విషయం గుర్తుకొచ్చింది సుహాసినికి. ‘అత్తా, స్టోరు రూములో స్థలం సరిపోవడంలేదు. అట్టపెట్టెల్లో ఉన్న ఆ పుస్తకాలు బయటపడేశాను. పనమ్మాయిని పట్టుకు పొమ్మన్నాను’ అని తోటికోడలంటే కళ్ళమ్మట నీళ్ళు కుక్కుకున్న అత్తయ్యను చూసి, అంతగా ఆవిడ బాధపడటానికి ఆ అట్టపెట్టెలలో ఏముందోనని చూస్తే- అన్నీ డైరీలు, అత్తగారి డైరీలు. ఆవిడ మనసును దాచుకుంది ఆ డైరీలలో. వాటిని పనికిరాని చెత్తలా పెరట్లో...

అప్పుడొచ్చింది తోటికోడలి మీద కోపం. అత్తగారి మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఈ వయసులో కూడా ఆవిడ చేత పనులు చేయించడం, ఆఖరికి ఆవిడ డైరీలను కూడా బయటపడెయ్యడం... బావగారు గమనించనట్లు ఊరుకోవడం, ఇంట్లోనే ఉన్న హర్ష కూడా పట్టించుకోకపోవడం... సహించలేకపోయింది సుహాసిని. ‘ఇన్నాళ్ళూ ఆవిడకెవరూ ఎదురుచెప్పలేదు. ఆవిడ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. ఇక ఊరుకుంటే లాభం లేదు. ఇంకో నెలరోజుల్లో అత్తయ్య పుట్టినరోజు. ఆ పుట్టినరోజుకి... అత్తయ్యకు విశ్రాంతినివ్వాలి, పనిచేసే బాధ లేకుండా చెయ్యాలి... ఎలా?’ అని ఆలోచించి, ఈ ఇంటికి దూరంగా అత్తయ్యను తీసుకువెళ్తేగానీ, ఆమెకు ఈ వయసులో విశ్రాంతి దొరకదని నిర్ణయించుకున్నాక, అంతవరకూ వద్దనుకున్న ప్రమోషన్‌ కోసం అప్లై చేయడం, ప్రమోషన్‌ రావడం అన్నీ గబగబా జరిగిపోయాయి. అంతే, నెల రోజుల్లో ఇక్కడున్నారు.

ఆలోచనలలో మునిగిపోయిన సుహాసినిని చూసి ‘‘ఎలా తెలుసుకున్నావమ్మా?’’ మృదువుగా అడిగింది యశోదమ్మ. బదులుగా హ్యాండ్‌బ్యాగులో నుండి తీసిన పుస్తకం ఆవిడ చేతిలో పెట్టింది సుహాసిని.

‘‘ఇది... ఇది... నాడైరీ. నీకెలా వచ్చింది?’’ కన్నీళ్ళు కట్టలు తెంచుకున్నాయి. వణుకుతున్న కంఠంతో అడిగిందామె.

‘‘అమ్మకు డైరీ రాసే అలవాటుందా?’’ మొదటిసారి వింటున్నాడు హర్ష.

‘‘ఇదేకాదు, అన్నీ ఉన్నాయి. మీ రూములో సర్దించాను.’’

సుహాసినిని గట్టిగా హత్తుకుని ‘‘ఇన్నాళ్ళకు మా అమ్మానాన్నల తర్వాత నన్ను పట్టించుకునే వ్యక్తి నా కోడలి రూపంలో వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. పెద్దకోడలిలాగే నువ్వూ నన్ను వాడుకోవాలనుకుంటున్నావు అనుకున్నాను. నిన్ను అర్థం చేసుకోలేనందుకు నన్ను క్షమించమ్మా’’ అంది యశోదమ్మ.

‘‘మా అమ్మనైతే అలాగే వదిలేస్తానా? నాకు మా అమ్మెంతో, మీరూ అంతే అత్తయ్యా’’ అన్న సుహాసిని మాటలు హర్షలో ఆలోచనలను రేకెత్తించాయి.

‘‘వదినను చూడు, అమ్మనెంత బాగా చూసుకుంటుందో. ‘అత్తా’ అని వెనకెనకే తిరుగుతూ, చనువుగా ‘అది చేసిపెట్టు, ఇది చేసిపెట్టు’ అని అమ్మకే వంటగది పెత్తనం అప్పచెబుతుంది’’ అని ఒకసారి అంటే ‘‘మీ వదినలాగా, మీ అమ్మను నేను చూసుకోలేనులెండి’’ అన్న సుహాసిని మాటలకు చాలా కోపం వచ్చిందప్పుడు. ‘చదువుకుందన్న గర్వం’ అనుకున్నాడు. ఇప్పుడు తెలిసింది ఆ మాటలకర్థం- ‘అమ్మలా’ చూసుకోవడమంటే... తీయగా మాటలు చెప్పడంకాదు, మనసును అర్థం చేసుకోవాలనీ, చెప్పకుండానే వాళ్ళ అవసరాలు ఏమిటో గ్రహించుకోవాలనీ.

మొదటిసారి తనమీద తనకే చాలా కోపం వచ్చింది హర్షకు.

తల్లి చేతులు పట్టుకున్నాడు ‘‘క్షమించమ్మా’’ అంటూ. ఆప్యాయంగా అతణ్ణి హత్తుకుంది యశోదమ్మ.

‘‘మా అమ్మైనా మీరైనా ఒకటే, అన్నావు మా అమ్మతో. కానీ మేమెవ్వరమూ మా అమ్మను అమ్మలా చూసుకోలేకపోయాం. అమ్మని ఎలా చూసుకోవాలో ఇకనుండి నీ దగ్గర నేర్చుకుంటాను సుహా’’ సుహాసిని వైపు తిరిగి చెప్పాడు హర్ష.

‘‘ఓకే, ఓకే. ఎగ్రీడ్‌. ఇప్పుడు మన అమ్మ పుట్టినరోజు పండగ చేద్దాం రండి’’ నవ్వుతూ అన్న సుహాని అనుసరించాడు హర్ష.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..