హైటెక్‌ మ్యారేజీబ్యూరో

‘ఏవండీ, మా బావగారు చెప్పిన ఆ హైటెక్‌ మ్యారేజీబ్యూరోలో మనబ్బాయి బయోడేటా ఇచ్చి రండీ’ అంటూ మా ఆవిడ వారం రోజులుగా నా చెవిలో జోరీగలాగా రొదపెడుతుంటే ఇంక తప్పదని ఈ ఆదివారం వీలు చేసుకుని బయల్దేరాను.

Updated : 11 Dec 2022 14:23 IST

హైటెక్‌ మ్యారేజీబ్యూరో

- అప్పరాజు నాగజ్యోతి

‘ఏవండీ, మా బావగారు చెప్పిన ఆ హైటెక్‌ మ్యారేజీబ్యూరోలో మనబ్బాయి బయోడేటా ఇచ్చి రండీ’ అంటూ మా ఆవిడ వారం రోజులుగా నా చెవిలో జోరీగలాగా రొదపెడుతుంటే ఇంక తప్పదని ఈ ఆదివారం వీలు చేసుకుని బయల్దేరాను.

కారణమేమిటో తెలీదుగానీ మా అబ్బాయికి ఏడాది నుండీ పెళ్ళి సంబంధాలు చూస్తున్నా ఇంతదాకా ఒక్కటీ కుదరలేదు. మ్యారేజీ వెబ్‌సైటుల్లోనే కాకుండా ఊళ్ళో చెప్పుకోదగ్గ పేరున్న మ్యారేజీబ్యూరోలన్నింట్లోనూ వీడి పేరు రిజిస్టర్‌ చేశాం. చెప్పుకుంటే సిగ్గుచేటు, వీడు కాదన్న సంబంధాలకంటే వీడిని వద్దన్న అమ్మాయిలే ఎక్కువ. ఏమైనా కాలం చాలా మారిపోయింది. ప్రస్తుతం అమ్మాయిలకే డిమాండ్‌ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఎంతమందిని రిజెక్ట్‌ చేసినా చెల్లిపోతోంది. కలికాలం!

అలా ఆలోచిస్తూనే గూగుల్‌ మ్యాప్‌ ప్రకారంగా మ్యారేజీబ్యూరోని వెతుక్కుంటూ వెళ్తుంటే దారిలో ఒకచోట ‘ప్రీ వెడ్డింగ్‌ కోచింగ్‌’ అన్న బోర్డు కనిపించింది.

‘ఫ్రీ వెడ్డింగ్‌ ఫొటో షూట్‌- అని రాయబోయి పొరపాటున అలా రాసుంటారు’ అనుకుని నవ్వుకున్నాను. అయితే ఆ తర్వాత కూడా చాలాచోట్ల అటువంటి బోర్డులు కనిపించడంతో కొంచెం పజిలయ్యాను.

హైటెక్‌ మ్యారేజీ బ్యూరోకి చేరుకున్నాక, లోపలికి అడుగు పెడుతుంటే పిల్లతెమ్మెరలా వీచిన చల్లని గాలితోపాటే వీనులవిందుగా వినిపించిన సన్నని ఫ్లూటు స్వరానికి నా మనసంతా ఆహ్లాదమయింది.

ఎదురుగా రిసెప్షన్‌ డెస్క్‌ ముందున్న నలుగురు అమ్మాయిలని చూసి అటువైపుకి నడవబోతుంటే ‘‘సార్‌, ఇటు రండి’’ అంటూ ఒక వ్యక్తి నన్ను అక్కడే ఉన్న ఒక మెషీన్‌ వద్దకి తీసుకెళ్ళి, నా చేత ఆ మెషీన్‌ స్క్రీన్‌ పైన నా వివరాల్ని టైపు చేయించగానే ఆ మెషీన్‌ నుండి ఒక టోకెన్‌ బైటకి వచ్చింది. దాన్ని తీసుకుని చదువుతూ ‘‘మీ టోకెన్‌ నంబర్‌ పన్నెండు. మిమ్మల్ని పిలిచేదాకా అలా కూర్చోండి’’ అని చెప్పి వెళ్ళాడతను.

ఇంక చేసేదేముంది, అక్కడే ఒక సోఫాలో సెటిలైపోయి చుట్టూ నిశితంగా పరికిస్తే, గోడలకి అందమైన ఆయిల్‌ పెయింటింగులూ కుండీల్లో చక్కటి బోన్సాయ్‌ చెట్లూ అక్వేరియంలో రంగురంగుల చేపపిల్లలతో కనువిందుగా తోచింది ఆ హాలు. లేత గులాబీ రంగు, ఊదా రంగు యూనిఫామ్‌ ధరించిన స్టాఫ్‌ బిజీగా అటూ ఇటూ తిరుగుతుంటే అసలు నేనొచ్చింది ‘మ్యారేజ్‌ బ్యూరోకేనా లేదా ఏదైనా స్టార్‌ హోటల్‌కా’ అన్న సందేహం కలిగింది.

అక్కడే ఎదురుగా గోడకి బిగించిన స్క్రీన్‌ పైన మ్యారేజ్‌బ్యూరోకి సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్‌లూ టెస్టిమోనియల్స్‌ చూస్తుంటే సమయం ఎలా గడిచిపోయిందో తెలీలేదు.

‘టోకెన్‌ నంబర్‌ పన్నెండు’ అని మైక్‌లో వినిపించగానే గబగబా వెళ్ళి రిసెప్షన్‌ డెస్క్‌కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని మా అబ్బాయి బయోడేటానీ ఫొటోలనీ అక్కడ కూర్చున్న అమ్మాయి చేతికందించాను.

వెంటనే ఒక చేత్తో ఆ డేటాని కంప్యూటర్లోకి ఎక్కిస్తూనే, మరోచేత్తో ఒక పేపర్‌ తీసి నా చేతిలో పెట్టి ‘‘సార్‌, ఇందులో మా సర్వీసెస్‌, వాటి ఫీజులూ, ఇంకా మా బ్యూరో షరతులన్నీ వివరంగా ఉన్నాయి. ఒకసారి చదువుకోండి. అలాగే మరో విషయం... ఇక్కడ మేము పెళ్ళి సంబంధాలతో పాటు ప్రీ వెడ్డింగ్‌ కోచింగ్‌ కూడా ఇస్తాం. మీరు రెండింటికీ ఒకేసారి రిజిస్టర్‌ చేశారంటే ఫీజులో థర్టీ పర్సెంట్‌ డిస్కౌంట్‌ ఇస్తాం’’ అని చెప్పిందామె.

ఆ చివరిమాటలకి ఇందాక దారంతా కనిపించిన బోర్డులు చప్పున గుర్తుకురాగా ‘‘ఆ కోచింగ్‌ వివరాలేమిటో కొద్దిగా చెబుతారా అమ్మ్డా’’ అన్నాను.

దానికామె ‘‘ముందుగా మీరు లోనికి వెళ్ళి మా ఫెసిలిటీస్‌, మా కోచింగ్‌ క్లాసెస్‌ అన్నీ చూసి రండి. కోచింగ్‌ గురించిన వివరాలన్నీ మా ఏజెంట్‌ మీకు డీటైల్డ్‌గా చెబుతారు’’ అని చెప్పి ఒక ఏజెంట్‌కి నన్నప్పగించింది.

*               *                *

ఏజెంట్‌తో కలిసి లోనికి వెళ్ళగానే అక్కడ వరుసగా పది పన్నెండు దాకా ఏసీ గదులు కనిపించాయి. మొదటి గది ముందు ఆగి ‘‘ఇది అబ్బాయిల ప్రీ వెడ్డింగ్‌ కోచింగ్‌ క్లాస్‌’’ అని చెప్పాడు ఏజెంట్‌.

ఆ గదికి బైటవైపునున్న టీవీ స్క్రీన్‌పైన లోపల జరుగుతున్నదంతా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంటే శ్రద్ధగా చూడసాగాను.

‘‘చూడండి కిరణ్‌ గారూ, మీరు చేసుకోబోయే అమ్మాయి వర్కింగ్‌ ఉమన్‌ అయి ఉండాలని ఆశిస్తున్నారు కదా. మరి మీరు పెళ్ళిచూపులకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ‘ఉద్యోగినినే ఎందుకు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు’ అని ప్రశ్నిస్తే- దానికి మీరేమని చెబుతారు?’’ అంటూ ఆ క్లాసులో ఒకతన్ని ప్రశ్నిస్తోంది టీచర్‌.

ఆ ప్రశ్నకి అతను ఏం సమాధానం చెబుతాడా అని ఆసక్తిగా చూస్తున్నాను.

‘‘నేనూ నా భార్యా ఇద్దరం ఉద్యోగస్తులమైతే సొసైటీలో మా స్టేటస్‌ పెరుగుతుంది. రెండు శాలరీలతో త్వరగా అన్ని హంగులూ... అంటే- కారు, ఇళ్ళు, స్థలాల్లాంటివన్నీ అమర్చుకోవచ్చు. ఇంకా మాకు పుట్టబోయే పిల్లల్ని మంచి స్కూల్స్‌లో చదివించవచ్చు.’’

‘‘గుడ్‌, మీకేం కావాలో చక్కటి క్లారిటీ ఉంది. కాకపోతే మీరు చెప్పిన ఈ సమాధానం విన్నాక ఆ అమ్మాయి మిమ్మల్ని మనీ మైండెడ్‌ మనిషిగా అపోహపడే ప్రమాదం ఉంది. కాబట్టి మీ సమాధానాన్నే నేను కొద్దిగా మార్చి చెప్తాను. వినండి’’ అంటూ టీచర్‌ ఇలా చెప్పడం మొదలెట్టింది.

‘‘మా ఇంట్లో అంతా జెండర్‌ ఈక్వాలిటీని- అంటే- స్త్రీ పురుష సమానత్వాన్ని నమ్ముతాం. మా అమ్మానాన్నలు నన్నూ మా చెల్లినీ అన్ని విషయాల్లో సమానంగా చూస్తారు. అలాంటి వాతావరణంలో పెరిగాను కాబట్టి, నా భార్యా నాతో సమంగా చదువుకుని చదువుకు తగ్గ ఉద్యోగాన్ని చేయాలని ఆశిస్తున్నాను.’’

ఈ సమాధానం నాకు తెగ నచ్చేసింది.

నిజమే, పెళ్ళి చూపుల్లో ఇలా చెబితేనేగా ఏ అమ్మాయైనా ఇంప్రెస్‌ అయ్యేది!

‘‘మీరు చెప్పింది బాగుంది మేడం. నోట్‌ చేసుకుంటాను’’ అన్న ఆ అబ్బాయితో-

‘‘కేవలం దీన్ని పేపర్‌పైన నోట్‌ చేసుకుంటే సరిపోదు. ఈ మాటల్ని పదేపదే మనసులో మననం చేసుకోవాలి. అప్పుడే అవి మీ ప్రవర్తన పైన గాఢమైన ముద్రని వేసి - మనసా వాచా కర్మణా - మీరు మీ భార్యని మీతో సమానంగా చూసేట్టుగా చేస్తాయి.’’

‘ఓహో, అంటే ఒక రకంగా సెల్ఫ్‌ హిప్నాసిస్‌ చేసుకోవడమన్నమాట! పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోర్సుల్లో చెప్పినట్టుగా ఇలా పాజిటివ్‌ థాట్స్‌తో మనసుని నింపుకోవడం మంచిదేలే’ అనుకుంటూ తిరిగి స్క్రీన్‌కి చెవులూ కళ్ళూ అప్పగించేశాను.

‘‘ఇప్పుడు నేను చెప్పినదంతా పెళ్ళిచూపులకి ముందు ఉపయోగపడే పాఠం. ఇక లెసన్‌ నంబర్‌ టు కి వెళ్తే, మీరు ఆశించినట్లుగానే ఉద్యోగస్తురాలైన అమ్మాయితో మీ వివాహం జరిగిందనుకోండి. మీ కాపురంలో ఒకరోజు మీరు ఎప్పటిలాగే ఆరు గంటలకల్లా ఆఫీసు నుండి ఇంటికి వచ్చేశారు. మీ ఆవిడకి మాత్రం ఆ వేళ ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వలన తను ఇంటికి రావడం ఆలస్యమవుతుందని ఆవిడ మీకు ఫోన్‌ చేసి చెప్పారనుకోండి... అప్పుడు మీ రియాక్షన్‌ ఏమిటి?’’

‘‘ఏముంది మేడమ్‌... ఉద్యోగమన్నాక ఇటువంటివన్నీ మామూలేగా! తను ఇంటికి వచ్చేదాకా హాల్లో టీవీలో ఏ ప్రోగ్రామో చూస్తూ కూర్చుంటాను లేదంటే ఏ వాట్సాప్‌లోనో ఫేస్‌బుక్‌లోనో లేదా డైరెక్ట్‌గా ఫోన్లోనో నా ఫ్రెండ్స్‌తో చాటింగ్‌ చేస్తాను.’’

‘‘బావుంది, ఆమె ఇంటికి వచ్చేదాకా మీరు ఏ విధంగా టైమ్‌పాస్‌ చేస్తారో చెప్పారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఒకటుంది... ఆఫీసులో ఎక్కువసేపు పనిచేసి ఆలస్యంగా ఇంటికొచ్చే మీ భార్య- రాగానే మళ్ళీ వంట చేయడం కష్టం. కాబట్టి స్త్రీ పురుష సమానత్వాన్ని నమ్మే మీరు నిజానికి ఆ రోజున చేయవలసింది ఏమిటంటే... టీ లేదా కాఫీ చేసుకుని మీరు తాగడంతో పాటు ఆమె కోసం కూడా ఫ్లాస్క్‌లో పోసి తను ఇంటికి రాగానే కప్పులో పోసి చేతికందించడం. దాంతో ఆమె చాలా రిలాక్సవుతారు. అలాగే, తను ఇంటికి చేరుకునేలోపే సింపుల్‌గా డిన్నర్‌ని ప్రిపేర్‌ చేయడంగానీ లేదా బయటనుండి ఆర్డర్‌ చేసి తెప్పించడంగానీ చేయడం మరింత శ్రేష్టం. లేదా మీ ఇంట్లో ఈ పనులకి వేరే మనిషి ఉంటే ఆమెతో చెప్పి దగ్గరుండి చేయించొచ్చు. నిజానికి ఆ ఒక్కరోజే కాకుండా ప్రతీరోజూ ఇంట్లో వంటతో సహా అన్ని పనుల్లో మీరు సమాన భాగం తీసుకుంటే మీ అన్యోన్య దాంపత్యానికి నూరేళ్ళ గ్యారెంటీ ఉంటుంది.’’

ఆ చివరి మాటలకి ఆలోచనలోపడ్డాను.

మా ఆవిడ ఉద్యోగం చేయదు కాబట్టి ఈ సందర్భం నాకు వర్తించదు కానీ, తనకి ఒంట్లో బాగోలేని రోజుల్లో కూడా నేను పొరపాటునైనా వంటింట్లోకి వెళ్ళింది లేదు, పిసరంత సాయం చేసిందీ లేదు. పాపం, తనే ముక్కుతూ మూలుగుతూ పనులన్నీ చేసుకుంటుంది. నాకు చాలా గిల్టీగా అనిపించింది.

‘‘సార్‌, మిగతా క్లాస్‌ రూములు కూడా చూస్తే మీకు మా సర్వీసెస్‌ పైన పూర్తి ఐడియా వస్తుంది’’ అన్న ఏజెంట్‌ మాటలకి ఆలోచనల నుండీ బైటకొచ్చి అతని వెనక నడిచాను. రెండో గదిలో పాఠం మరో కోణంలో నడుస్తోంది.
‘‘మీరు చేసుకోబోయే అమ్మాయి ఇంటిపట్టునే ఉండాలనీ ఉద్యోగం చేయకూడదనీ చెబుతు న్నారు. దానికి కారణం తెలుసుకోవచ్చా’’ అన్న టీచర్‌ ప్రశ్నకి ఆ యువకుడు ‘‘నేను చేస్తున్నది చాలా బాధ్యతతో కూడిన పెద్ద ఉద్యోగం.
ఈ ఉద్యోగంలో చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. దానికి తగ్గట్టే జీతం కూడా భారీగానే ఉంటుంది.

నా సంపాదనే అంత ఉన్నప్పుడు ఇంక నా భార్య కూడా ఒళ్ళు హూనం చేసుకుని సంపాదించవలసిన అవసరమేమిటి? పైగా నా ఉద్యోగంలో పనిగంటలు ఎక్కువ కాబట్టి ఇంట్లో నా నుండి నా భార్యకి అందే సాయమూ సమయమూ రెండూ తక్కువే. కనుక ఇంటినీ మాకు పుట్టబోయే పిల్లల్నీ నాకంటే తనే ఎక్కువ బాధ్యతగా చూసుకోవలసి ఉంటుంది. అందుకే తను ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టునే ఉంటే బాగుంటుందని నా ఆలోచన’’ అని చెప్పాడు.
‘‘చాలా బాగా చెప్పారు పునీత్‌ గారూ.

ఈ విషయంలో నేను మీకు చెప్పవలసిన పాఠాలు ఏమీ లేవు. అలాగే మీ ఆలోచనా ధోరణిని పెద్దగా సరిదిద్దవలసిన అవసరమూ లేదు. కాకపోతే మరింత క్లారిటీ కోసం ఒక చిన్న రోల్‌ ప్లే చేద్దాం. కొంచెంసేపూ నన్ను మీ భార్యగా అనుకోండి. ఉదయం మీకోసం మీకిష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌ని నేను వేడివేడిగా వడ్డించాను. దానికి మీరు ఎలా ప్రతిస్పందిస్తారు.’’

చాలా ఆసక్తిగా అనిపించింది నాకీ సంభాషణ.

‘‘ముందే చెప్పానుగా మేడమ్‌... నేను చాలా బిజీ అని. అందులోనూ ఉదయం పూట ఆఫీసుకి వెళ్ళే హడావిడిలో ఉంటాను కాబట్టి గబగబా తినేసి ఆఫీసుకి బయలుదేరుతాను.’’

నిజమే, అంత పెద్ద ఉద్యోగం చేస్తున్న మనిషికి ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ని ఆస్వాదించే తీరికా సమయమూ ఎక్కడుంటాయిలే, పాపం!

కానీ నా ఆలోచనలకి భిన్నంగా ఉన్నాయి ఆ తర్వాత మాట్లాడిన ఆ టీచర్‌ మాటలు.

‘‘మీరలా సైలెంట్‌గా తినేసి వెళ్ళిపోతే మీ భార్య చాలా బాధపడతారు. మీరిందాక చెప్పిన మాటల్ని తిరిగి మీకే చెబుతున్నాను. మీ నుండి మీ భార్యకి తగినంత సాయమూ సమయమూ దొరకవన్నారు. అలాంటప్పుడు తనతో ఉన్న అతి కొద్ది సమయాన్ని మీరు మీ తెలివితేటలతో చాలా క్వాలిటీగా గడపాల్సిన అవసరం ఉంది. అదెలాగంటే, ఆ టిఫిన్‌ తింటున్న సమయంలోనే ఒక్క మాట ‘చాలా శ్రద్ధ పెట్టి చేసినట్టున్నావు డార్లింగ్‌, టిఫిన్‌ ఎంతో రుచిగా ఉంది, అదరగొట్టేశావు హనీ’ అని మీరంటే- ఆమె మొహం వెలిగిపోతుంది. మీరన్న ఆ ఒక్కమాటనే పదేపదే తలుచుకుంటూ ఆ రోజంతా ఆనందపడిపోతుంది. మీతో ఎక్కువ సమయం గడపలేని లోటుని ఆ ఒక్కమాట తీర్చేస్తుంది. ఇదే సూత్రం భోజనానికీ పడకకీ అన్నింటికీ వర్తిస్తుంది పునీత్‌.’’

ఉదయం నాలుగింటికే లేచేసి ఇంటెడు పనినీ ఒంటిచేత్తో చేసుకుంటూ, నేను ఉదయం ఆఫీసుకెళ్లేలోగా రెండుమార్లు ఫిల్టర్‌ కాఫీని ఎంతో రుచికరంగా చేసిపెట్టే మా ఆవిడని నేనేనాడూ ప్రశంసించింది లేదు. రోజంతా పనులతో అలసిపోయినా, రాత్రికి చక్కగా స్నానం చేసి ఫ్రెష్‌గా బెడ్‌రూమ్‌లోకి వచ్చే ఆమెని మాటలతో కాదు కదా... కనీసం కళ్ళల్లోనైనా ఒక చిన్న మెచ్చుకోలుని ప్రదర్శించలేదు నేను. భార్యగా అవన్నీ ఆమె డ్యూటీలనే అనుకున్నాను తప్ప మరోలా ఆలోచించలేకపోయిన నాపై నాకే ఆ క్షణాన చిరాకొచ్చేసింది.

ఇటువంటి కోచింగ్‌ సెంటర్లు అప్పట్లో కూడా ఉండి ఉంటే ఎంత బావుండేది.

‘‘నెక్స్ట్‌ క్లాస్‌రూమ్‌కి వెళ్దామా సార్‌’’ అన్న ఏజెంట్‌ హెచ్చరికతో ఆ తర్వాతి గదికి వెళ్ళాం. ఆ గదిలో అంతా ఆడపిల్లలున్నారు.

‘‘మీరు చేసుకోబోయే వ్యక్తి పెద్ద బ్యాంక్‌ ఆఫీసర్‌, డాక్టర్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయుండాలని ఆశిస్తున్నారు. అలా ఎందుకనీ అంటే... వాళ్ళకి మంచి సంపాదనా సమాజంలో మంచి పేరూ ప్రతిష్ఠలుంటాయి అన్నదేగా మీ సమాధానం?’’ అన్న టీచర్‌ ప్రశ్నకి అవునన్నట్టుగా ఆ అమ్మాయిలంతా తలాడించారు.

‘‘సరే, ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్‌ని అనలైజ్‌ చేద్దాం. ఒకరోజు మీవారితో కలిసి మీరు డిన్నర్‌కి బైటకి వెళ్ళే ప్రోగ్రామ్‌ పెట్టుకున్నారు. సాయంత్రం ఆరుగంటలకల్లా చక్కగా తయారై ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రాత్రి తొమ్మిది దాటినా ఆయన జాడలేదు. ఫోన్‌ చేస్తే, నో రెస్పాన్స్‌. తీరిగ్గా రాత్రి పదిగంటలు దాటాక ఇంటికి చేరుకున్న ఆయన మీకు కనీసం సారీ చెప్పలేదు సరికదా... అసలు మిమ్మల్ని బయటకు తీసుకెళ్తానన్న సంగతే మర్చిపోయి ‘చాలా అలసిపోయాను. ఆకలిగా లేదు, వెళ్ళి పడుకుంటాను’ అని చెప్పి బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోయారు. అప్పుడు మీ రియాక్షన్‌ ఏంటి?’’

‘‘నాపట్ల అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించే వ్యక్తిని నేను ఒక్క క్షణం కూడా భరించలేను. వెంటనే విడాకులకు అప్లై చేస్తాను’’ అని ఒకరూ... ‘‘వెంటనే సూట్‌కేస్‌ సర్దుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా. తను వచ్చి నా కాళ్ళు పట్టుకుంటేగానీ తిరిగి తనతో వెళ్ళను’’ అని మరొకరూ... ‘‘కనీసం వారం రోజులైనా తనతో మాట్లాడను, నన్ను తాకనివ్వను’’ అంటూ అక్కడున్న అమ్మాయిలంతా తలోరకంగా సమాధానమిచ్చారు.

అవన్నీ ఓపిగ్గా విన్నాక- ‘‘చూడండమ్మా, మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే అంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి చాలా బిజీగా ఉంటారు కాబట్టి అతను ఫ్యామిలీతో ఎక్కువ టైమ్‌ గడపలేడు. ఆ విషయం మీరు అతన్ని పెళ్ళి చేసుకునేందుకు ముందే తెలుసుకుంటే మంచిది. అతనికి మీపైన బోలెడంత ప్రేమ ఉంటుంది, కానీ దాన్ని ప్రదర్శించేందుకు అతనికి చాలినంత సమయం దొరకడంలేదన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరే చొరవ తీసుకుని అతను భోజనం చేస్తున్నప్పుడు పక్కనే కూర్చుని మాట్లాడటం లేదా ఉదయాన్నే అతనికి జాగింగ్‌ లేదా రాత్రిపూట వాకింగ్‌ చేసే అలవాటు ఉంటే అతనితోపాటు మీరు కూడా వీలు చేసుకుని వెళ్ళడంలాంటివి చేస్తూ మీరిద్దరూ కలిసి గడిపే సమయాన్ని కొద్దికొద్దిగా పెంచుకుంటూ రావాలి. అలాగే, అతను ఇంట్లో లేని సమయాల్లో మీరు మీ ఫ్రెండ్స్‌తోనో, మీ పిల్లలతోనో ఆహ్లాదంగా గడపడాన్ని అలవాటు చేసుకోవాలి, లేదా ఏవైనా చక్కటి హాబీలను డెవలప్‌ చేసుకోవాలి’’ అన్న టీచర్‌ మాటలు చాలా అర్థవంతంగా తోచాయి.

‘‘సార్‌ ఇంతదాకా థియరీ క్లాస్‌రూమ్‌లని చూశారు కదా, ఇప్పుడు ప్రాక్టికల్‌ క్లాసెస్‌ చూద్దాం’’ అంటూ ఏజెంట్‌ తీసుకెళ్ళిన మరో గదిలోకి తొంగి చూసి ఆశ్చర్యపోయాను. ఆ గదిలో అబ్బాయిలూ అమ్మాయిలూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తలో పనీ చేస్తున్నారు. కొంతమంది బట్టలు ఉతుకుతున్నారు. కొంతమంది గిన్నెలు కడుగుతున్నారు, మరికొంతమంది ఆరిన బట్టలను దొంతర్లుగా మడతలు పెడుతున్నారు. ఇంకొంతమంది డైనింగ్‌ టేబుల్‌ను శుభ్రంగా తుడుస్తున్నారు. ఆ గదికి అటాచ్డ్‌గా ఉన్న కిచెన్‌లో కుస్తీ పడుతున్న వాళ్ళు కొందరు!

అది చూసి నాకు ఏమీ అర్థంకాక ‘‘ఇదంతా ఏమిటి? వీళ్ళంతా ఎవరు? ఇక్కడ ఏదైనా హాస్టల్‌ నడుపుతున్నారా’’ అంటూ ఏజెంట్‌ని అడిగాను. దానికతను ఫెళ్ళున నవ్వేసి ‘‘భలేవారే, ఇది హాస్టల్‌ కాదు, వాళ్ళంతా పనివాళ్ళు కారు. ఇది కూడా ఈ కోచింగ్‌లో ఒక భాగమే. భార్యాభర్తల మధ్యన వచ్చే గొడవల్లో సింహభాగం ఇంటిపనుల విషయాలే కదండీ! అందులోనూ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే ఇంట్లో ఎవరు ఏ పనులు చేయాలన్న దానిపైన చిన్న సైజు ప్రపంచ యుద్ధాలే జరుగుతుంటాయి. సాధారణంగా ఇంట్లో పనులు ఎక్కువగా ఆడవాళ్ళపైనే పడుతుంటాయి, దాంతో వాళ్ళల్లో అసహనం పెరిగిపోయి చిరాకులెక్కువైపోయి మెల్లిమెల్లిగా అవే పెద్ద గొడవలకి దారితీస్తాయి. అలా జరక్కుండా ఉండేందుకే అబ్బాయిలకి ఇలా పనులు నేర్పిస్తున్నాం.

నిజానికి ఈ కాలం అమ్మాయిలు కూడా ఇంటిపనులు చేయడాన్ని నామోషీగా భావిస్తున్నారులెండి. డబ్బులు పడేస్తే పనివాళ్ళు దొరుకుతారనేది వాళ్ళ ధీమా! కానీ ఇంట్లో ఎంతమంది పనివాళ్ళున్నా కూడా కొన్ని పనుల్ని ఇంటి యజమానులే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తోడు అడపాదడపా పనివాళ్ళు పనికి నాగా పెడుతుంటారు. అలాంటప్పుడు పనిచేయాల్సింది ‘నువ్వా నేనా’ అంటూ భార్యాభర్తలు తగువులు పెట్టుకోకుండా సరిసమానంగా పంచుకుంటేనే సంసారం సవ్యంగా సాగుతుంది. పాతకాలంలో అయితే తల్లుల వెనకాలే ఉంటూ ఆడపిల్లలు పెళ్ళికి ముందే ఇంటిపనులన్నీ నేర్చేసుకునేవాళ్ళు. ఈ కాలం ఆడపిల్లలు చదువులు బాగా చదువుతున్నారు గానీ పనుల విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అలాగే మగపిల్లల విషయానికొస్తే, అప్పట్లో ఆడపిల్లలు ఉద్యోగాలు చేయకుండా ఇంటిపట్టునే ఉండేవాళ్ళు కాబట్టి, మగపిల్లలకి ఇంటిపనులు చేసే అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పటి పరిస్థితి అది కాదు కదా! ఇది అర్థం చేసుకున్న ఈ కాలం తల్లులు తమ కొడుకులకి కొద్దో గొప్పో ఇంటిపనుల్ని నేర్పించే ప్రయత్నాల్ని చేస్తున్నారు. కాకపోతే ఇంకా పాతభావాలు పోని తండ్రులు మాత్రం దానికీ అడ్డుపుల్లలు వేస్తున్నారు. అందుకే, ఇక్కడ ఇలా వాళ్ళందరికీ ఇంటిపనుల్లో ప్రత్యేకంగా ట్రైనింగ్‌ ఇవ్వాల్సి వస్తోంది.’’

నిజమే, మా ఆవిడ కూడా ఇలాగే ఎప్పుడైనా మా అబ్బాయికి ఇంట్లో పని చెప్పబోతే ‘మగపిల్లాడికి ఆడంగిపనులు చెప్తావేంటి బుద్ధిలేకుండా’ అంటూ నేను కసిరేవాడిని. మనసులో అనుకోబోయి ఆ మాటలని పైకే అనేశాను.

‘‘పనులకి లింగభేదం ఏమిటండీ! అయినా మీరింకా నయమేలెండి. నాకు తెలిసిన చాలామంది తండ్రులైతే కొడుకులకే కాదు, కూతుర్లకు పని చెప్పినా ఇష్టపడరు. కూతుర్ని యువరాణిలా చూసుకుంటారు. ఇంట్లో పనులన్నీ భార్యే చేసుకుపోవాలనుకుంటారు. భార్య కూడా ఒకప్పుడు పుట్టింట్లో యువరాణిలాగే పెరిగొచ్చిందన్న విషయాన్నే తలచుకోరు. అలాగే రేపు వివాహమై మరో ఇంటికి వెళ్ళిపోయాక తన కూతురు కూడా తన భార్యలాగే అక్కడ పనులన్నీ చేసుకోవాలన్న సంగతి తోచదు వాళ్ళకి. అయినా స్త్రీ పురుష తారతమ్యాలు లేకుండా వంటతో సహా అన్ని పనుల్నీ అందరూ నేర్చుకుంటే అవసరానికి పనికొస్తుంది కదండీ. ఫర్‌ ఎగ్జాంపుల్‌, భార్య జ్వరంతో మంచమెక్కిందనుకోండి... స్విగ్గీ, జొమాటోలపై ఆధారపడి ఆరోగ్యాన్ని మరింత పాడుచేసుకోకుండా ఇంట్లోనే చక్కగా నాలుగు ఇడ్లీలు చేసిపెడితే ఆవిడ సంతోషిస్తుంది, త్వరగా కోలుకుంటుంది, ఆ అనుబంధం మరింత బలపడుతుంది కదండీ’’ అన్న ఏజెంట్‌ మాటలకి అవునన్నట్టుగా తల ఆడించాను. అప్పటికే ఈ కోచింగ్‌ సెంటర్‌తో చాలా ఇంప్రెస్‌ అయిన నేను ఇంకేమీ ఆలోచించలేదు. వెంటనే రిజిస్ట్రేషన్‌ ఫారమ్‌ని నింపేసి మావాడికి పెళ్ళి సంబంధంతో పాటుగా కోచింగ్‌ క్లాసెస్‌కి కూడా డబ్బులు కట్టేశాను.

ఇంటికి వెళ్తూవెళ్తూ దారిలో వెజిటబుల్‌ మార్కెట్‌లో కనిపించిన పెద్ద మిరపకాయలను కొనేసి ఆ పైన యూట్యూబ్‌లో మా ఆవిడకిష్టమైన మిర్చిబజ్జి ఎలా తయారు చేయాలి అన్న వీడియోని సేవ్‌ చేసి పెట్టుకున్నాక, మొట్టమొదటిసారిగా నా చేతి మిర్చిబజ్జీలు తింటుంటే మా ఆవిడ కళ్ళల్లో మెరిసే కాంతిలో నన్ను నేను చూసుకోవాలన్న కోరిక నన్ను తొందరచేస్తుంటే వడివడిగా ఇంటికి బయలుదేరాను.

*               *                *

‘‘ఏవండీ, ఎన్నడూ లేనిది అసురసంధ్య వేళ పడుకున్నారేమిటీ... లేవండీ, ఆ హైటెక్‌ మ్యారేజీబ్యూరోలో మనబ్బాయి పేరు రిజిస్టర్‌ చేసి రావాలన్న సంగతి మీకసలు గుర్తుందా, లేదా’’ అన్న మా ఆవిడ మాటలకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను.

ఓహో అయితే ఇదంతా కలేనా! ఏమైతేనేం, బూజుపట్టిన నా పురుషాహంకార భావాలని కూకటివేళ్ళతో పెకిలించేసి నా ఆలోచనల్లో చక్కటి మార్పుని కలిగించిన ఆ సుస్వప్నానికి మనసులోనే జోహార్లర్పిస్తూ హైటెక్‌ మ్యారేజీ బ్యూరోకి బయల్దేరాను... వచ్చేప్పుడు బజ్జీల కోసం మిరపకాయలూ తీసుకొస్తాను..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..