వికుంఠ స్థితి కోసం...

దేవతల సంఖ్య మూడు కోట్లు అని, ముప్ఫై మూడు కోట్లు అని లోకంలో రెండు విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి కోటి అనేది సంఖ్యాశాస్త్ర సంకేతం కాదు. అదొక ప్రతీక. విరాట్‌ స్వరూపుణ్ని వేయి తలలున్నవాడని వేదం అభివర్ణించింది.

Published : 13 Jan 2022 00:39 IST

దేవతల సంఖ్య మూడు కోట్లు అని, ముప్ఫై మూడు కోట్లు అని లోకంలో రెండు విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి కోటి అనేది సంఖ్యాశాస్త్ర సంకేతం కాదు. అదొక ప్రతీక. విరాట్‌ స్వరూపుణ్ని వేయి తలలున్నవాడని వేదం అభివర్ణించింది. అప్పుడు కళ్లు రెండు వేలు ఉండాలి. కాని పురుషసూక్తం ఆయనను సహస్రాక్షుడనే అంది. శతం కాని, సహస్రం కానీ, కోటి గానీ... అనంతానికి ప్రతీకలు. అంతేగాని అన్నిచోట్లా అవి అంకెలు కావు. ‘ముక్కోటి దేవతలు’ అలాంటిదే.

నిజానికి దేవతల సంఖ్య ముప్ఫై మూడని వేదం చెప్పింది. సృష్టి అనే కుటుంబానికి విష్ణువు యజమాని. సృష్టి నిర్వహణకు ఆ దేవతలు బాధ్యులు. ఏకాదశ రుద్రులు (11), ద్వాదశ ఆదిత్యులు (12), అష్ట వసువులు (8), ఇద్దరు అశ్వినీ దేవతలు. వీరంతా సృష్టి కుటుంబ సభ్యులు. సృష్టి క్రమానికి వీరే సూత్రధారులు. పురాణాలు వీరినే ముక్కోటి దేవతలుగా సంకేతించాయి. వీరంతా ఒక్కటై కుటుంబ యజమాని శ్రీమహావిష్ణువును సేవించడానికై భూలోకానికి తరలివచ్చే తిథి- ధనుర్మాసంలోని ఏకాదశి. మాసం మార్గశిరం కావచ్చు. పుష్యం కావచ్చు... ముక్కోటి దేవతలు కదలివచ్చే తిథి కాబట్టి దాన్ని ‘ముక్కోటి ఏకాదశి’గా సంభావిస్తారు. ఏటా అధిక మాసాలతో కలిసి వచ్చే మొత్తం ఇరవై ఆరు ఏకాదశుల్లోనూ ముక్కోటి ఏకాదశి ఎన్నో రకాలుగా ప్రత్యేకమైనది.
దుష్ట శిక్షణ నిమిత్తం విష్ణువు అవతారాలు ధరించడం, భువికి దిగి రావడం పరిపాటి. కాని ఆయన నేరుగా వైకుంఠం నుంచి వచ్చి దుష్టసంహారం చేసిన సందర్భాలు ముఖ్యంగా రెండే రెండు. గజేంద్రుడి మొర ఆలకించి, సిరికిం జెప్పక శంఖ చక్రయుగమున్‌ చేదోయి సంధింపక... వైకుంఠం నుంచి సరాసరి తరలివచ్చి మొసలిని మట్టుపెట్టిన సందర్భం ఒకటి. కృతయుగంలో దేవతలకు కంటకుడిగా తయారైన మురాసురుణ్ని తుదముట్టించిన సందర్భం మరొకటి. వైకుంఠుడి చేతిలో మురాసుర సంహారం జరిగింది- ముక్కోటి ఏకాదశినాడు. కాబట్టి ముక్కోటి ఏకాదశికి ‘వైకుంఠ ఏకాదశి’ అనే పేరు లోకంలో స్థిరపడింది. మరింత పవిత్రతను సంతరించుకొంది.

ఇంద్రియాలు అరిషడ్వర్గాలు ఆలోచనలు అదుపు తప్పిపోవడాన్ని ‘కుంఠం’ అంటారు. ‘కుంఠుడు’ అనే మాటకు మూర్ఖుడనే అర్థం చెప్పాయి నిఘంటువులు. చెడుకు లొంగిపోవడం మూర్ఖత్వమని దాని తాత్పర్యం. అలా లోబడకుండా, మూర్ఖత్వానికి దూరంగా ఉండే స్థితికి ‘వికుంఠం’ అని పేరు. అది స్థితప్రజ్ఞకు చిహ్నం. వికుంఠ స్థితిమంతులు కొలువుతీరే ప్రాంగణమే ‘వైకుంఠం’. ఒక మన్వంతరంలో ‘వికుంఠ’ అనే పుణ్యస్త్రీకి జన్మించాడు కనుక శ్రీహరిని వైకుంఠుడు అన్నారు.

పురాణాలు వర్ణించే వైకుంఠం సప్తప్రాకారాల మధ్య నెలకొన్నదని ప్రతీతి. దక్షిణ భారతంలో రంగనాథస్వామి కొలువున్న శ్రీరంగపట్నం సైతం కావేరీ నది రెండు పాయల మధ్య ఒక దీవిపై ఏడు ప్రాకారాల మధ్యలోనే ఉంది. అందుకే శ్రీరంగానికి ‘భూలోక వైకుంఠం’ అని ప్రశస్తి. వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు శ్రీరంగం కోవెల ఉత్తర ద్వారంలోంచి శ్రీరంగనాథుడి దర్శనం కోరి వస్తారని అక్కడి స్థల పురాణ కథనం. ‘శ్రీరంగ ద్వారస్థ భగవదాలోకన’ మహోత్సవాలను నిర్వహించేది అందుకే!

- ఎర్రాప్రగడ రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని