ముగ్గురూ గురువులే

మనం నిత్యం స్మరించుకోవలసిన వారు ముఖ్యంగా ముగ్గురు. వారు- తల్లి, తండ్రి, గురువు. వీరి ప్రభావం మన జీవితాలపై ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి వీరే ప్రత్యక్ష దైవాలు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ  అన్నారు

Published : 18 May 2022 00:13 IST

మనం నిత్యం స్మరించుకోవలసిన వారు ముఖ్యంగా ముగ్గురు. వారు- తల్లి, తండ్రి, గురువు. వీరి ప్రభావం మన జీవితాలపై ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి వీరే ప్రత్యక్ష దైవాలు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ  అన్నారు. వీరు చిరస్మరణీయులు. అంటే... చాలా (జీవిత)కాలం గుర్తుంచుకోవలసిన పూజనీయులు.
భూమికి ఎంత సహనం ఉందో తల్లికి అంతే సహనం ఉంటుందని ఆ విషయంలో తల్లిని భూదేవితో పోలుస్తారు. బిడ్డ ఆమె గర్భంలో రూపుదిద్దుకోవడం మొదలైన సమయం నుంచి బయటపడేవరకు ఒక రకమైన జాగ్రత్త. బిడ్డ పుట్టిన తరవాత ప్రాథమిక అవసరాలైన నవ్వు, నడక, మాట, చూపు, ఎదుగుదల లాంటి ఎన్నో విషయాలను శ్రధ్ధగా గమనిస్తూ అవి సక్రమంగా ఏర్పడేలా తగిన చర్యలు తీసుకుంటుంది. ఆపై అతడు ఎదిగి యోగ్యుడయ్యేంత వరకు అనుక్షణం కాపాడుతూనే ధర్మాన్ని, సంస్కారాన్ని, సత్ప్రవర్తనను నేర్పే ధన్యురాలు. ఇలా బిడ్డ ప్రతి చర్యలోనూ  తల్లి గురువులా బోధనలు చేస్తూ ఉంటుంది. ఆమె హస్తం దివ్యమైనది. మనసు అమృతోపమానం. ఆమె దీవెన పరమాత్ముడి దీవెన. ప్రతి విషయంలోనూ సంతానానికి మాన్యతనొసగేది తల్లి. ఆమె గురువై విద్య నేర్పుతుంది. సత్యం చెప్పడం, ధైర్యం, కరుణ మొదలైన సద్గుణాలు అలవడేటట్లు నేర్పుతో  శిక్షణనిస్తుంది. బిడ్డలను గుణవంతులుగా, ధర్మ పరాయణులుగా తీర్చిదిద్దుతుంది. వేదాలు, శాస్త్రాలు, ధార్మిక గ్రంథాలు, కావ్యాలు, పురాణాలు,  రామాయణ మహాభారతాది గ్రంథాలు లాంటివన్నీ మాతృమూర్తి గౌరవాన్ని విశేషంగా వర్ణించాయి. అంత గొప్పదైన తల్లిని సంతోషపరచడమే సంతానం ప్రథమ ధర్మమని అధర్వణ వేదం చెబుతోంది. అలాంటి తల్లిని బాధించే సంతానం జన్మ నిష్ప్రయోజకమని వేదాలు ఘోషిస్తున్నాయి.  
శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే, గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. నడక నుంచి నడవడిక, నాగరికత, సమాజంలో మనగలిగే ఒడుపు లాంటివి నేర్పే గురువు- తండ్రి. లౌకిక వ్యవహారాల నుంచి, సమాజంలో మెలగే తీరు, ఒడుపు నేర్పే గురువు- తండ్రి. శ్రీరాముడు తండ్రికి శుశ్రూషలు చేస్తూ ఆయన ఆదేశాలు పాటించడాన్నే ధర్మంగా భావించాడు. మహాభారతంలో శాంతి పర్వం తండ్రిని సేవించడమే ధర్మమని, తండ్రిని అన్ని విధాలా సుఖింపజేయడం ధర్మవర్తనుడైన తండ్రి ఆదేశాలను అనుసరించడమే సర్వ శ్రేష్ఠమైన తపస్సు అని చెబుతోంది. తండ్రిని ప్రసన్నం చేసుకుంటే సకల దేవతలూ ప్రసన్నులవుతారని బోధించింది.
ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. కుమ్మరి మట్టి ముద్దను అందమైన శిల్పంగా, అన్ని అవసరాలకు ఉపయోగపడే పాత్రగా మలచినట్టు, గురువు శిష్యుణ్ని అంధకారం నుంచి వెలుగులోకి నడిపిస్తాడు. అతడికి విద్యాబుద్ధులు నేర్పి, విజ్ఞానవంతుడిగా తీర్చిదిద్దుతాడు. మనిషి జన్మించిన మొదలు కడదాకా నేర్చుకుంటూనే ఉండాలి. దానికి గురుత్వం అవసరం.
ఆ గురుత్వాన్ని ప్రసాదించే తల్లిదండ్రులు గురువులు ఉత్తమ శిక్షకులైతే- ఆ సంతానం, శిష్యులు ధన్యులు, భాగ్యవంతులుగా విలసిల్లుతారు. వారు ఉత్తమ పౌరులుగా, సంపూర్ణ మానవులుగా తయారవుతారు.

- వి.ఎస్‌.రాజమౌళి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని