ఒంటరి మనిషి

మనిషి లోకంలోకి పుట్టుకతో ఒక్కడిగా వస్తాడు. పోయేటప్పుడూ ఒక్కడిగానే పోతాడు. ఈ నడుమ గడిపే జీవితమంతా పదిమందితో ముడివడి ఉంటుంది. అనేక విధాలైన బంధాలు, అనుబంధాలు, సంబంధాలు

Published : 27 Jun 2022 00:17 IST

మనిషి లోకంలోకి పుట్టుకతో ఒక్కడిగా వస్తాడు. పోయేటప్పుడూ ఒక్కడిగానే పోతాడు. ఈ నడుమ గడిపే జీవితమంతా పదిమందితో ముడివడి ఉంటుంది. అనేక విధాలైన బంధాలు, అనుబంధాలు, సంబంధాలు అతడి చుట్టూ అల్లుకుని ఉంటాయి.
సమాజంలోకి వచ్చాక మనిషికి ఎందరి అవసరమో, సహకారమో కావాల్సి ఉంటుంది. అమ్మ, నాన్న, తోబుట్టువులు, బంధువర్గం, స్నేహితులు, సేవకులు... ఇలా ఎంతోమందితో ఆత్మీయంగా మెలగవలసి ఉంటుంది. వెలుగు-నీడల్లా, మిట్టపల్లాల దారిలా, ఆటుపోట్ల సముద్రంలా కష్టసుఖాలను అనుభవించాల్సి వస్తుంది. ఐశ్వర్యంలో, సుఖంలో, ఆనందంలో మనిషి అన్నీ మరచిపోతాడు. బాధ్యతలను విస్మరిస్తాడు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మాత్రం అంతా గుర్తుకొస్తారు. ఎవరూ తన మొర వినడంలేదని బెంబేలెత్తిపోతాడు. అందరినీ నిందిస్తాడు. ఒంటరినైపోయానే అంటూ కుంగిపోతాడు. ఆలోచనా శూన్యుడైపోతాడు. వివేకం, విజ్ఞత పనిచేయవు. ఈ దుస్థితికి కారణమేమిటో విశ్లేషించుకోడు. నిజానికి మనిషి నిరాశా నిస్పృహల్లో చిక్కుకుపోయాడంటే, అందుకు కారకులు ఇతరులెవ్వరూ కారు. అది స్వయంకృతాపరాధమే!

సాటివారిని ప్రేమించలేకపోవడం, ఆత్మీయత పంచకపోవడం, వాళ్లకు సహకరించకపోవడం, తరచూ పలకరించి, వాళ్ల యోగక్షేమాలు తెలుసుకోకపోవడం, వాళ్ల అవసరాల్లో ఆదుకోకపోవడం... ఇలాంటివి ఎన్నెన్నో కారణాలుంటాయి- ఒంటరితనానికి. ప్రేమైనా, గౌరవమైనా, వాత్సల్యమైనా ముందు నిస్సంకోచంగా ఒకళ్లకివ్వడం నేర్చుకోవాలి. చదువొక్కటే కాదు- దాంతోపాటు సభ్యత, సంస్కారం, సదభ్యాసం, వాక్శుద్ధి, మంచి నడతా- ఇవే మనిషిని మనిషిగా చేస్తాయి. అటువంటి మనిషి ఏ సత్ఫలితం కోసమో నిరీక్షించవలసిన అవసరమే ఉండదు. విజయ ఫలాలు ఆయా సమయాల్లో ముందుకొచ్చి వాలతాయి.

కొందరికి అందరూ తోడు ఉండవచ్చు, కొందరికి ఎవరి తోడూ ఉండకపోవచ్చు. ఎవరి పలకరింపూ ఉండకపోవచ్చు. అయినా నిరాశ పడవలసిన పని లేదు.

అనాథ కూడా ఈ లోకంలో ఒంటరివాడు కాడు. ఆత్మవిశ్వాసమనే వజ్రాయుధం ఒంటరితనమనే ఎంతటి రాక్షసినైనా సంహరించేస్తుంది. అలాంటి సాహసిని ఏ ఓటమీ భయపెట్టలేదు. పరాజయాలు పాఠాలు నేర్పుతాయి. అనుభవాలు గుణపాఠాలు నేర్పుతాయి. అతడికి చిత్తశుద్ధి తోడుంటుంది. నిబద్ధత నీడనిస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుంది. జ్ఞానం జాగృతం చేస్తుంది. అంతర్వీక్షణ అంతర్యామి దర్శనం చేయిస్తుంది. ఇవన్నీ ఇన్ని విధాలుగా అతడికి అండగా ఉండగా అతడెన్నటికీ ఒంటరి కాడు, కాలేడు. పిరికితనం, భావోద్వేగం, తొందరపాటు నిర్ణయాలు, అరిషడ్వర్గాలు మనిషిని నిస్సహాయుణ్ని చేస్తాయి. కుంగదీస్తాయి.

పూర్వం యోగులు, సిద్ధులు, మునులు ఒంటరిగా ఉన్నా ఏకాకులుగా భావించలేదు. విశ్వకల్యాణం కోసం తపస్సు చేశారు. జాతికి జ్ఞానం ప్రసాదించారు.

వస్తువులపై విపరీత వాంఛలను వదలగలిగిన ఒంటరివాడు లోకంలో అత్యధిక సంపన్నుడు, శక్తిమంతుడు. యోగా, ధ్యానం, తపస్సు అంతర్విశ్లేషణకు ఒంటరితనం కారణభూతమై మనిషికి మహామనీషిగా అఖండ కీర్తిని ఆపాదిస్తుంది. నేనెప్పుడూ ఒంటరిని కాను అన్న ఆలోచన ఒక్కటి చాలు, మనిషిని బోధివృక్షచ్ఛాయలో కూర్చోబెట్టడానికి!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని