దానశీలి

‘ఈ శరీరం ఉన్నది పరోపకారార్థమే’ అని భావించే కొద్దిమంది మహానుభావుల వల్లనే ఇప్పటికీ ఈ ప్రపంచంలో మానవత్వం నిలిచి ఉన్నదని విజ్ఞులు చెబుతుంటారు. మన ఇతిహాసాలన్నింటిలోనూ పరోపకార పరాయణులైనవారి చరిత్రలే ప్రధానంగా కనిపిస్తాయి. లోకాలను రక్కసుల బారినుంచి

Published : 16 Sep 2022 00:46 IST

‘ఈ శరీరం ఉన్నది పరోపకారార్థమే’ అని భావించే కొద్దిమంది మహానుభావుల వల్లనే ఇప్పటికీ ఈ ప్రపంచంలో మానవత్వం నిలిచి ఉన్నదని విజ్ఞులు చెబుతుంటారు. మన ఇతిహాసాలన్నింటిలోనూ పరోపకార పరాయణులైనవారి చరిత్రలే ప్రధానంగా కనిపిస్తాయి. లోకాలను రక్కసుల బారినుంచి కాపాడటానికి తన వెన్నెముకనే ఆయుధంగా ఇంద్రుడికి ఇచ్చిన దధీచి చిరస్మరణీయుడు. వాజిశ్రవుడు తన గోసంపదను మొత్తాన్ని సంఘసేవకులైన ఉత్తమ పురుషులకు దానం చేశాడు. చివరికి తన కుమారుడైన నచికేతుణ్ని సైతం యముడికి దానం చేశాడు. ఇతరులకు ఉపకారం చేయడమే ఉత్తమమైన తపస్సు అని ఒకనాటి విశ్వాసం!

ఒక శిష్యుడు గురువు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వింటున్నాడు. ‘అయిదు సంవత్సరాలు కీర్తిప్రతిష్ఠలకు దూరంగా ఉంటూ ఎవరు సమాజసేవ చేస్తారో వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది!’- అని గురువు బోధించాడు. శిష్యుడు రోజులు లెక్కపెట్టుకుంటూ అయిదు సంవత్సరాలు దానధర్మాలు చేస్తూ గడిపాడు. కానీ అతడికి సమాజంలో ఆశించిన గౌరవం లభించలేదు. ‘గురువుగారూ, మీరు చెప్పినట్లు చేసినా నాకు గౌరవం పెరగలేదు!’ అని ఒకరోజు ఆయనకు చెప్పి వాపోయాడు. ‘నాయనా, నువ్వు దానధర్మాలు చేసిన మాట నిజమే! నీ దృష్టి ఎప్పుడూ అయిదు సంవత్సరాల కాలాన్ని లెక్కపెట్టుకోవడంపైనే ఉంది. నీ మనసులో ప్రజల అవసరాలేమిటో, వాళ్ల కష్టాలేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు! నువ్వు పేరు ప్రతిష్ఠల కోసం, కీర్తి కోసం ఒక నాటకంలో పాత్రధారిలాగా దానధర్మాలు చేశావు!’ అని గురువు అతడికి బుద్ధి చెప్పాడు. సంకుచిత మనస్కులకు తిరస్కారం తప్పదు. ఉదార మనస్కులపై లోకం ఔదార్యమే చూపుతుంది. ప్రకృతి ధర్మమూ ఇదే. ఎవ్వరికీ ఏమీ ఇవ్వకపోతే మనం ధనవంతులమవుతామని అనుకోవడం వెర్రితనం. దానివల్ల కుళ్ళిపోవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. అనేక చిన్న నదుల నుంచి కూడా నీటిని సముద్రం తీసుకుంటుంది. ఎన్ని నదుల నీళ్లు తాగినా సముద్రం నీరు ఉప్పగానే ఉంటుంది. నదికి నీరు ఇవ్వడమే తెలుసు. సముద్రానికి తీసుకోవడమే తెలుసు. వాటి నీటి రుచిలో తేడాకు అదే కారణం!

మహాకవి మాఘుడు గొప్ప సంపన్న కుటుంబంలో జన్మించాడు. తండ్రి తాతల ఆస్తి భారీగా మాఘ మహాకవికి సంక్రమించింది. ఆయనది దయార్ద్ర హృదయం. ఆయన ఇల్లాలు కూడా భర్తకు తగినదే! ఇద్దరివీ పెద్ద చేతులు కావడం వల్ల ఆస్తి తరిగిపోయింది. ఒకసారి దేశంలో కరవు వచ్చింది. మాఘుడు తన పాత రచనలు అమ్మి ఆ వచ్చిన ధనాన్ని పేదలకు పంచి ఇచ్చాడు. రోజురోజుకీ పేదల హాహాకారాలు ఎక్కువ అవుతున్నాయి. ఆ దశలో తాను రచిస్తున్న కొత్త కావ్యాన్నీ అమ్మడానికి సిద్ధమయ్యాడు. దాన్ని కొనగల ధనవంతుడు ఎవరు? భోజుడు తప్ప! కానీ ఆ రాజు వద్దకు వెళ్ళడం మహాకవికి ఇష్టం లేదు. ఎందుకంటే తాను రాజుగారి వద్దకు వెళితే ఆయన కావ్యానికి ఎక్కువ వెలకట్టి ధనం ఇస్తాడు. తనకు అది ఇష్టం ఉండదు. ఎంత విలువో అంతే ఇవ్వాలి! అందువల్ల తాను వెళ్ళకుండా తనభార్యను పంపించాడు. భోజుడు ఆ కావ్యాన్ని చదివి, అది మాఘమహాకవి రచన అని గుర్తించాడు. గొప్ప సంపదను ఇచ్చి పంపాడు. దారిలోనే ఆ ధనాన్ని పేదలకు దానం చేస్తూ, శూన్యహస్తాలతో దంపతులిద్దరూ ఇంటికి చేరుకున్నారు.  మనకు శిశుపాలవధ అనే అజరామర కావ్యాన్ని ఇచ్చి పోయిన ఆ మహాకవి జీవితమే ఒక మహా కావ్యం!

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని