మళ్ళీ మళ్ళీ నవ్వుదాం...

సుదీర్ఘమైన జీవితం కేవలం సుఖాలతోనో, కేవలం కష్టాలతోనో నడవదు, ముగియదు. ఒక విత్తనం మొలకెత్తి పెరిగి, ఫలించి, పండి పడిపోయేందుకు కేవలం పండ్లు కాసి ముగిసిపోతే చాలదు, వీలూ కాదు.

Published : 11 Mar 2023 01:05 IST

సుదీర్ఘమైన జీవితం కేవలం సుఖాలతోనో, కేవలం కష్టాలతోనో నడవదు, ముగియదు. ఒక విత్తనం మొలకెత్తి పెరిగి, ఫలించి, పండి పడిపోయేందుకు కేవలం పండ్లు కాసి ముగిసిపోతే చాలదు, వీలూ కాదు. చిగుళ్లు, ఆకులు, రెమ్మలు, కొమ్మలు, పూలు, పండ్లు... ఎంత పరిణామ క్రమం! మళ్ళీ లోపల విత్తు. అది అసలు ససిని నిలుపుకొంటూ ఉంటుంది. పునర్జన్మను, పునరుత్పత్తిని మేలుకొల్పుకొంటూనే ఉంటుంది. అదే ప్రకృతి. అదే పరిణామం. పాత మీద విరక్తి కలగకుండా, అంతరించిపోకుండా భగవంతుడు ఏర్పాటు చేసిన నిత్య నూతన పరిణామ క్రమం. ఈ ప్రక్రియ చెట్లు, పక్షులు, జంతువులకే కాదు- మనిషికీ వర్తిస్తుంది. వెల్లవేసిన, రంగులు పూసిన భవంతిలా లోకం యావత్తూ ఎప్పుడూ నవనవలాడుతూ రంగులమయంగా ఉంటుంది. కష్టాలు, కన్నీళ్లు, ప్రకృతి విపత్తులు... ఇవీ భగవంతుడి సృష్టే. నడక నేర్చుకుంటూ పసివాడు కిందపడతాడు. సైకిల్‌ నేర్చుకుంటూ పిల్లవాడు గాయాలు తగిలించుకుంటాడు. దానికి భయపడి పిల్లలు తమ సరదా మానుకోరు. లేచి దులుపుకొని మళ్ళీ పరిగెడతారు. జీవితంలోని ఒడుదొడుకులూ అంతే. కష్టాలు, కన్నీళ్లు కూడా అంతే. కేవలం సుఖమే ఆనందాన్నివ్వదు. దాన్ని సంపాదించే క్రమంలో దెబ్బలు తగలాలి. ఇబ్బందులు కలగాలి. అప్పుడే ఆ ఆనందానికి పూర్ణత్వం సిద్ధిస్తుంది. మనిషి ప్రకృతిని చూస్తే పరవశించి పోతాడు. అమృతం తాగిన అనుభూతితో ఆనందపడిపోతాడు. ప్రకృతి ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉంటుంది. మళ్ళీ వర్షాలతో, జలపాతాలతో, పూలతో, పచ్చదనాలతో, పక్షుల కలకూజితాలతో, పులకింతలతో పరవశించిపోతుంది. అవును. జీవితం అంటే అదే. మనిషికైనా అంతే.

జీవితం దాని సహజత్వాన్ని అది అనుసరించనీ. అనుభవించనీ. కాలం దాని సహజ వేగంతో అది సాగనీ. మనం అతి తెలివితో దాన్ని ఆపవద్దు. ఆగవద్దు. సహజత్వాన్ని ఆహ్వానిద్దాం... ఆస్వాదిద్దాం. మామిడి... పిందెలో ఒక రుచి. కాయలో అదో రుచి. దోర మామిడిలో మరో రుచి.  పండులో అసలైన రుచి. మార్పులోని అందాన్ని, ఆనందాన్ని నేర్పిస్తోంది ప్రకృతి.

నిజమే. కష్టం ఉంటుంది. నష్టమూ ఉంటుంది. దానిలోని చెడును, చేదును తీసివేసి అసలు మంచిని ఆస్వాదిద్దాం. అనాదిగా మన పూర్వులు చేసింది అదే. కష్టం కేవలం కష్టమే కాదు. అందులో ఇష్టం కూడా ఉంది. అందుకే నవ్వుదాం. నవ్వి నవ్వి కన్నీళ్లొస్తాయి. తుడుచుకోవాలి కదా? అందుకు కొంచెం సమయం కావాలి కదా? ఇవ్వాలి కదా? కష్టం అలాంటిది. కన్నీళ్లు అలాంటివి. కన్నీళ్లు తుడుచుకుందాం. మళ్ళీ నవ్వుదాం. మళ్ళీ మళ్ళీ నవ్వుదాం!

చక్కిలం విజయలక్ష్మి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని