పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం

ఆదర్శనీయ, ఆరాధనీయ మూర్తిమత్వ ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. వ్యక్తి ధర్మానికి, రాజ ధర్మానికి రాముడు సమున్నత ప్రతీక. సత్యసంధతకు, అవక్ర పరాక్రమానికి, సుపరిపాలనా దక్షతకు, ప్రజారంజకమైన శ్రేయోదాయక భావనా పరంపరకు రామభద్రుడు మారుపేరు.

Published : 31 Mar 2023 00:29 IST

దర్శనీయ, ఆరాధనీయ మూర్తిమత్వ ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. వ్యక్తి ధర్మానికి, రాజ ధర్మానికి రాముడు సమున్నత ప్రతీక. సత్యసంధతకు, అవక్ర పరాక్రమానికి, సుపరిపాలనా దక్షతకు, ప్రజారంజకమైన శ్రేయోదాయక భావనా పరంపరకు రామభద్రుడు మారుపేరు. ‘రాజ్యమంటే రామరాజ్యం, రాజంటే శ్రీరాముడే, రాముడి సమక్షంలో లభించే భద్రత మరెక్కడా దొరకదు’ అనే తరగని ఖ్యాతిని రాఘవుడు అందుకున్నాడు.

సర్వకాల సర్వావస్థల్లోనూ ధర్మాచరణే లక్ష్యంగా రఘువంశ తిలకుడు తన ధర్మయజ్ఞాన్ని కొనసాగించాడు. నిజాయతీ, నిబద్ధతలతో జగదానందకరంగా పాలనా బాధ్యతల్ని నిర్వహించాడు. అలాంటి సాకేత సార్వభౌముడికి సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాన్ని ప్రతి సంవ త్సరం భద్రాచల దివ్య క్షేత్రంలో చైత్రశుద్ధ దశమినాడు నిర్వ హిస్తారు. కల్యాణరాముడిగా శ్రీరామనవమినాడు దర్శనమిచ్చే రాఘవుడు, దశమినాడు పట్టాభి రాముడై పరిఢవిల్లుతాడు. రాము డికి పట్టాభిషేక వేడుక నిర్వహిం చడమంటే, ప్రజలంతా ధర్మా చరణకు నిరంతరం కట్టుబడి ఉంటామని ప్రతినబూనడం. అల నాటి రామరాజ్యం మళ్ళీ రావాలని ఆకాంక్షించడం, సౌమనస్యమైన, సౌజన్యయుతమైన పరిస్థితుల్ని ఆహ్వానించడం. అందుకే ఈ పట్టా భిషేకోత్సవ సంరంభం.

రామచంద్రుడికి తప్ప మరే ఇతర దైవ స్వరూపానికీ నిర్వహించని వేడుక- పట్టాభిషేకం! రామపట్టాభిషేక వైభవం అయిదు విధాలుగా వర్ధిల్లుతుంది. శరన్నవరాత్రుల్లో విజయదశమినాడు, శ్రీమద్రామాయణ నిత్యపారాయణను అనుసరించి ప్రతినెలా పుష్యమి నక్షత్రంనాడు పట్టాభిషేకం నిర్వహిస్తారు. శ్రీరామనవమి మరుసటి రోజు శ్రీరామ మహా పట్టాభిషేకం జరుపుతారు. ప్రతి పుష్కరానికి అంటే పన్నెండేళ్లకోసారి శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకాన్ని, అరవై సంవత్సరాలకోసారి ప్రభవనామ సంవత్సరంలో శ్రీరామ మహా సామ్రాజ్య వైభవ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు.

ఈరోజు భద్రాచల రాముడికి పుష్కర పట్టాభిషేకోత్సవం కన్నుల పండుగగా కొనసాగుతుంది. 1999 సంవత్సరంలో ప్రథమ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని, 2011 సంవత్సరంలో రెండో పుష్కర పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఈసారి వెల్లివిరిసేది- మూడో పుష్కర పట్టాభిషేకం. పన్నెండేళ్లకోసారి మాత్రమే జరిగే అపురూపమైన ఉత్సవ విశేషమిది. జనప్రియుడైన జానకిరాముడికి మళ్ళీ పాలన అప్పగించి, ఆయన చల్లటి పాలనలో ఆనందంగా జీవనయానాన్ని సాగించాలని ప్రజలు అభిలషించడానికే ఈ వేడుక!

చైత్రశుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు భద్రాద్రిలో వసంత పక్ష పుష్కరోత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవ సమాహారంలో పుష్కర పట్టాభిషేకం ‘చతుర్వేద హవన పురస్కృత, పంచేష్టి సహిత, నవాహ్నిక, ద్వాదశ కుండాత్మక శ్రీరామాయణ మహాక్రతువుగా ఆవిష్కారమవుతుంది. పన్నెండు పుష్కర నదులనుంచి, పన్నెండు పుణ్యనదుల నుంచి, నాలుగు సముద్రాల నుంచి పావన జలాల్ని మంత్రయుక్తంగా కలశాలలో తీసుకొచ్చి, సార్వభౌమ వర్చస్కంగా పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. నవాహ్నిక దీక్షతో 108 మంది రుత్విక్కులతో, శ్రీరామచంద్ర మహా ప్రభువుకు సమస్త చక్రవర్తి లాంఛనాల్ని ఆపాదిస్తూ, సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమన్వితంగా సకల దేవతాశక్తుల మంగళాశాసనాలతో వర్ధిల్లే ఈ కమనీయ వేడుక ఆసాంతం నవనవోన్మేష నేత్రోత్సవం.

డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని