సత్యభాషణ వ్రతం

ఈ ప్రపంచం అంతా సత్యం మీదే ఆధారపడి ఉంది. సూర్యోదయం సత్యం. సూర్యాస్తమయం సత్యం. చంద్రుడు సత్యం. చుక్కలు సత్యం. గాలి వీచడం సత్యం. అగ్ని మండటం సత్యం. నీరు ప్రవహించడం సత్యం. మనిషి జీవనం సత్యం. ఇన్ని సత్యాలు లోకాన్ని రక్షిస్తూ ఉంటే మనిషి మాత్రం సత్యం పట్ల జాగరూకత ప్రకటించడం లేదు.

Published : 03 Feb 2024 00:56 IST

ఈ ప్రపంచం అంతా సత్యం మీదే ఆధారపడి ఉంది. సూర్యోదయం సత్యం. సూర్యాస్తమయం సత్యం. చంద్రుడు సత్యం. చుక్కలు సత్యం. గాలి వీచడం సత్యం. అగ్ని మండటం సత్యం. నీరు ప్రవహించడం సత్యం. మనిషి జీవనం సత్యం. ఇన్ని సత్యాలు లోకాన్ని రక్షిస్తూ ఉంటే మనిషి మాత్రం సత్యం పట్ల జాగరూకత ప్రకటించడం లేదు. అసత్యానికి దాసుడై సత్యానికి మసిపూస్తున్నాడు. లేనిదాన్ని ఉన్నదిగా నమ్మించడానికి ఎత్తులు వేస్తున్నాడు. ఆడిన మాటను మరచి, అసత్యాన్ని ఆశ్రయిస్తున్నాడు.

మనిషి ఎదుటివారిని మోసగించగలడే కానీ, మనసును మోసగించలేడు. అంతరాత్మను పెడదారి పట్టించలేడు. పాడుపని చేస్తున్నప్పుడల్లా అంతరాత్మ మనిషిని హెచ్చరిస్తుంది. స్వార్థానికి, దురాశకు లోనయిన మనిషి ఈ హెచ్చరికలను లెక్కచేయడం లేదు. పాపానికి వెరవడం లేదు.

మనిషిలోని ఈ కృతక ప్రవృత్తిని సత్యనారాయణ వ్రతం స్పష్టంగా ప్రతిబింబించింది. ఈ వ్రతం అంతా సత్యభాషణ మహిమను, అసత్యభాషణ దోషాన్ని విశదంగా చెప్పింది. కష్టాల్లో ఉన్నప్పుడు వాటిని గట్టెక్కడానికి దేవతలను ప్రార్థించడం, వాగ్దానాలు చేయడం, కష్టాలు దూరం కాగానే ఆడిన మాటను మరచి సత్యవిరుద్ధంగా ప్రవర్తించడం... ఈ వ్రతంలోని కథల్లో మనిషి దౌర్బల్యం కనబడుతుంది. సత్యభాషణను విస్మరించి, మోసం చేసే మనిషిని కాలమే శిక్షిస్తుంది. విషపు మొక్కను నాటి, అమృత తరువు మొలవాలంటే మొలవదు కదా? మనిషి ఏ భావనతో పనిచేస్తే, అలాంటి భావనకు తగిన ఫలితమే వస్తుంది.

మోసం, వంచన మనసులో దృఢంగా గూడుకట్టుకొని ఉన్నప్పుడు మనిషి మాయమాటలే చెబుతాడు. తన వాక్చాతుర్యంతో ఇతరులను నమ్మించి, మోసం చేస్తాడు. సత్యం కోసం ప్రాణాలనే తృణప్రాయంగా అర్పించిన మహనీయులెందరో చరిత్రలో కనిపిస్తారు. వారి జీవితాలు ఆదర్శపాత్రాలై, లోకానికి స్ఫూర్తినిస్తాయి. మనిషికి సత్యభాషణ ఒక వ్రతంలా సాగాలి. ఇచ్చిన మాట మీద నిలబడే దృఢత్వం కావాలి. ఎన్ని కష్టాలెదురైనా మాట తప్పరాదు.

సూర్యకాంతిని కప్పివేసేందుకు దట్టంగా మబ్బులు కమ్ముకుంటాయి. కానీ అవి ఎక్కువకాలం నిలువలేవు. సత్యం అనే సూర్యుడి తేజస్సుకు, అసత్యాల మబ్బులు కరిగిపోవలసిందే. సత్యం ఒక్కటే నిరంతరం వెలిగే సూర్యబింబం. ఎన్నటికైనా సత్యమే జయిస్తుంది. సత్యాన్ని ఎక్కువకాలం ఎవరూ మోసగించలేరు. సత్య సూర్యబింబాన్ని అరచేతులతో అడ్డుపెడితే చేతులు కాలిపోతాయి. గుట్టలకొద్దీ అసత్యాలను ఒక్క సత్యవాక్కు కూల్చివేస్తుంది. సత్యం ప్రమోదాలకు నెలవు. ప్రశాంతతకు కొలువు. నిర్భయత్వానికి ఆలవాలం. సకల విజయాలకు సత్యమే మూలం.
మనిషి సత్యాన్ని నిత్యజీవన లక్ష్యంగా నిలుపుకోవాలి. మేలిమి బంగారంలా ఎన్నటికీ విలువ తరిగిపోనిది సత్యం. దుష్టులపాలిటి వజ్రాయుధం- సత్యం.

అసత్యాల విషవాయువులు మానవాళికి ముప్పు కలిగిస్తున్నప్పుడు, సత్యం అమృతవాయువై కాపాడుతుంది. ప్రాణవాయువు బతుకును నిలుపుతుంది. స్వేచ్ఛావాయువై ఆనందాన్ని అందిస్తుంది. మలయమారుతమై చల్లదనాన్ని పంచుతుంది.

డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని