ఊరొక్కటే- దారులెన్నో....

ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది.

Published : 16 Mar 2024 01:27 IST

ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. అప్పుడు నిశ్చింతగా, నిర్భయంగా ప్రయాణం చేస్తారు. గ్రామం ఒక్కటే అయినా ఎన్నో మార్గాలున్నట్లే దైవం ఒక్కటే అయినా ఆయన కరుణ పొందడానికి, ఆయన సాన్నిధ్యం చేరుకోవడానికి, ఆయనలో లీనం కావడానికి అనేక మార్గాలున్నాయి, రీతులున్నాయి, సాధనాలున్నాయి. దేన్నీ తోసి రాజనలేం. భక్తుల మనోభావాలు విభిన్నంగా ఉంటాయి. ఎవరి విశ్వాసం వారిది. ఎవరి పంథా వారిది. ఎవరి మతం వారిది. ఎవరికైనా లక్ష్యం ఒక్కటే.  దైవకృప కావాలి. స్వామి వాత్సల్యం కావాలి. సద్గతులు కలగాలి. కోరుకున్న కోర్కెలు నెరవేరాలి. నమ్ముకున్న దైవం సాక్షాత్కరించాలి. లేదా కనీసం మనోనేత్రాలతోస్వామిని దర్శించుకోవాలి.

నదులు ఎటు, ఎన్ని మార్గాల్లో ప్రవహించినా, చివరికి సాగరంలో కలుస్తాయి. రామభక్తి, కృష్ణభక్తి, శివభక్తి, జ్ఞానమార్గం, కర్మమార్గం, యోగమార్గం, ఆత్మ విచారమార్గం... ఇవన్నీ పరమాత్మకు అనుసంధితమై ఉన్నవే. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, మధ్వం, సగుణోపాసన, నిర్గుణోపాసన... ఇవన్నీ పరబ్రహ్మను చేరుకోదగిన విధానాలే! ‘మనసును ఈశ్వరపాద పంకజాలపై నిలపాలి. అలా చేస్తే భక్తి సార్థకమవుతుంది’ అంటారు ఆదిశంకరులు. తల్లికోతి ఎగురుతున్నంతసేపు దాని పిల్ల తల్లి పొట్టను గట్టిగా కరచుకుని, పట్టుకుని సురక్షితంగా ఉంటుంది. దీన్నే మర్కటకిశోర న్యాయమంటారు. అలా మనం దైవాన్ని పట్టుకోవాలి. దైవధ్యానాన్ని పట్టుకోవాలి. అప్పుడు మన రక్షణ అంతా ఆయనే చూసుకుంటాడు. ఆయన అనంత నామధేయుడు. ఆయన లేని చోటు లేనేలేదని ప్రహ్లాదుడు నిరూపించలేదా? మన మానసిక బలహీనత, శంక, భయం, అస్థిరత, అవిశ్వాసం, నాస్తికత... ఆయన్ని కలవనీయకుండా చేస్తున్నాయి. అరిషడ్వర్గాలు అవరోధాలు కల్పిస్తున్నాయి. అత్యాశ, ప్రలోభం, అసహనం, ఇంద్రియనిగ్రహ రాహిత్యం, అజ్ఞానం, అలక్ష్యం, అలసత్వం- ఇవన్నీ పరంధాముణ్ని స్మరించనీయడంలేదు. ఈ దుర్లక్షణాలను దూరం చేసుకోగలిగితే గమ్యం సుస్పష్టంగా గోచరిస్తుంది.

‘మానవసేవే మాధవసేవ’ అని కొందరి విశ్వాసం. ఇది ఏమాత్రం సత్యదూరం కాదు. ఈ సూత్రంతో తరించిన మహనీయులెందరో ఉన్నారని అనేక పౌరాణిక ఉపాఖ్యానాలు చెబుతున్నాయి. తీర్థయాత్రలు, పురాణశ్రవణం, నోములు, వ్రతాలు, పూజలు, దీపారాధనలు, దేవాలయ సందర్శనలు, ధ్యానం, యోగం, శ్రవణం, కీర్తనం, చింతనం... ఇవి- వివిధ భక్తిమార్గాలు, నారద భక్తిసూత్రాలు. అన్నీ ఈశ్వర శరణాగతికి సంబంధించినవే! వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, గీత, రామాయణ, భారత, భాగవతాలు- ఏవైనా ప్రబోధించేది ఇదే! అన్నమయ్య ‘బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే’ అన్నాడు. ‘తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు’ అని రామదాసు అన్నా... ‘బ్రోచేవారెవరురా, నిను వినా రఘువరా!’ అని త్యాగయ్య కీర్తించినా... ‘మీ రాకే ప్రభు గిరిధర్‌ నాగర్‌’ అని మీరా గాన సమీరం వీచినా... అరుణాచలం మౌనగానం వినిపించినా... బుద్ధుడు, పరమహంస, అరవిందుడు, వివేకానందుడు మొదలైనవారు దివ్యజ్ఞాన ప్రబోధాలు చేసినా... సర్వత్రా సర్వాంతర్యామిని విస్మరించరాదన్న సందేశమే ప్రతిధ్వనిస్తుంటుంది. అసలైన మోక్షానికి ఆధ్యాత్మిక నిబద్ధతే గట్టి పునాది! ఇది మరిస్తే తప్పదు అనర్థం!

చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని