శివ మహిమ స్తోత్రం 

కాలం ఈశ్వర స్వరూపం. ఆ ఈశ్వరుడికి ఎన్నో రూపాలు, ఎన్నో విలాసాలు, ఎన్నో విన్యాసాలు. మన జీవితంలో ప్రతి అంశం, ప్రతి అందం, ప్రతి ఆనందం, ప్రతి అనుభవం, ప్రతి స్వప్నం, ప్రతి సత్యం- అన్నీ పరమేశ్వరుడి నామాలుగా, రూపాలుగా మనల్ని స్పర్శిస్తున్నాయి. భారతీయ భక్తి వాఙ్మయంలో శివ స్తోత్రాలకు విశిష్టస్థానం ఉంది. వాటిలో అగ్రగణ్యమైనది...

Published : 22 Nov 2018 00:46 IST

శివ మహిమ స్తోత్రం 

కాలం ఈశ్వర స్వరూపం. ఆ ఈశ్వరుడికి ఎన్నో రూపాలు, ఎన్నో విలాసాలు, ఎన్నో విన్యాసాలు. మన జీవితంలో ప్రతి అంశం, ప్రతి అందం, ప్రతి ఆనందం, ప్రతి అనుభవం, ప్రతి స్వప్నం, ప్రతి సత్యం- అన్నీ పరమేశ్వరుడి నామాలుగా, రూపాలుగా మనల్ని స్పర్శిస్తున్నాయి. భారతీయ భక్తి వాఙ్మయంలో శివ స్తోత్రాలకు విశిష్టస్థానం ఉంది. వాటిలో అగ్రగణ్యమైనది ‘శివమహిమ్నః స్తోత్రం!’

‘పరమేశ్వరా! పండితులు నిన్ను సూర్యుడివి, చంద్రుడివి, వాయువ్వి, అగ్నివి, నీరువి, ఆకాశానివి, భూమివి, ప్రత్యగాత్మవి అని చెబుతూ ఈ చరాచర సృష్టిలో నువ్వేది కాదో తెలుసుకోలేకపోతున్నారు’ అంటోంది శివమహిమ్నః స్తోత్రం. ఈ శివస్తవకర్త పుష్పదంతుడు. పుష్పదంతుణ్ని పురాణ పురుషుడిగా పెక్కుమంది పండితులు భావిస్తున్నారు. పద్మ పురాణంలో ఇతడి ప్రసక్తి ఉంది. ‘సకల గంధర్వులకు ప్రభువైన పుష్పదంతుడు దేవతలకు కూడా దైవమైన పరమేశ్వరుడి సేవకుడు. ఆ శివుడి ఆగ్రహానికి గురై, తన మహిమను కోల్పోయి, ఈ విధంగా శివుణ్ని స్తుతిస్తున్నాడు’ అని ఈ స్తోత్రంలోని ఒక శ్లోకంలో స్తోత్ర రచనకుగల పూర్వ రంగాన్ని పుష్పదంతుడు పేర్కొన్నాడు.

గంధర్వుడైన పుష్పదంతుడు శివభక్తుడు. ఆకాశయానం, ఎవరికీ కనబడకుండా సంచరించడం వంటి దివ్యశక్తులు గలవాడు. ఇతడికి గల సంగీత వైదుష్యం వల్ల ఇంద్రుడు తన కొలువులో సంగీత విద్వాంసుడిగా నియమించాడు. పుష్పదంతుడు ఆకాశంలో అదృశ్యంగా సంచరిస్తూ ఒకనాడు చిత్రరథుడనే రాజు పాలిస్తున్న నగరాన్ని సందర్శించాడు. ఆ రాజు కూడా గొప్ప శివభక్తుడు. శివార్చన కోసం ఒక పెద్ద పూలతోట పెంచుతుంటాడు. రమణీయమైన ఆ ఉద్యానాన్ని తిలకించిన పుష్పదంతుడు దాని సౌందర్యానికి ఆకర్షితుడై ఆ తోటలోకి ప్రవేశించి పూలు కోస్తుంటాడు. అతడెవరికీ కనిపించకపోవటం వల్ల పుష్పాలు ఎలా మాయమవుతున్నాయో ఎవరికీ అంతుపట్టడంలేదు. ఇలా రెండు రోజులు జరిగింది. తాము రేయింబవళ్లూ వెయ్యి కళ్లతో సంరక్షిస్తున్నప్పటికీ పూలు ఎలా అదృశ్యమవుతున్నాయో తెలియడంలేదని రక్షక భటులు రాజుకు విన్నవించుకున్నారు. రాజు ఆలోచించి చెట్ల కింద మారేడు దళాల్ని విస్తృతంగా వెదజల్లమన్నాడు. మారేడు శివుడికి ప్రీతికరమైనవి. ఆ పత్రాల్ని కాలితో తొక్కితే పరమేశ్వరుడికి ఆగ్రహం కలుగుతుందని చిత్రరథుడు భావించాడు.

పుష్పదంతుడు యథాప్రకారం తోటలోకి ప్రవేశించి పూలు కోస్తాడు. చిత్రరథుడు భావించినట్లుగానే తెలియకుండా మారేడు ఆకుల్ని తొక్కాడు. ఆ క్షణంలో పరమేశ్వరుడి ధ్యానం చెదిరింది. గంధర్వుడైన పుష్పదంతుడు చౌర్యానికి పాల్పడటం, బిల్వ పత్రాల్ని తొక్కడం దోషంగా భావించి అతడి దివ్యశక్తుల్ని నశింపజేస్తాడు. ఆ కారణంగా పుష్పదంతుడు కావలివారి కంటపడి కారాగారబద్ధుడవుతాడు. తన అపచారానికి పశ్చాత్తాపంతో పరమ శివుడి అనుగ్రహం కోరుతూ ఈ స్తోత్రం రచిస్తాడు. శివుడు ఆ స్తుతికి సంతోషించి పుష్పదంతుడికి తిరిగి దివ్యశక్తుల్ని అనుగ్రహిస్తాడు. చిత్రరథుడు అతణ్ని క్షమించి విడిచిపెడతాడు. తరతరాలుగా ప్రచారంలో ఉన్న గాథ ఇది.

కొన్ని ప్రతుల్లో 39 శ్లోకాలు, కొన్ని ప్రతుల్లో 46 శ్లోకాలు ఈ స్తోత్రంలో కనిపిస్తున్నాయి. మధుసూదన సరస్వతి దీనికి వ్యాఖ్య రచించడంవల్ల దీని ప్రశస్తి వెల్లడి అవుతున్నది. అనంతర కాలంలో వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి వంటి విద్వాంసులు ఈ స్తోత్రానికి రమణీయ వ్యాఖ్యలు రచించారు. ఆదిశంకరుల ‘శివానందలహరి’తో సమానస్థాయి గల స్తోత్రరాజం ఇది. మధ్యప్రదేశ్‌లో ఓంకార క్షేత్రంలోని అమరేశ్వరాలయంలో మాంధాతృ మండపం గోడపై ఈ స్తోత్రం లిఖితమై ఉంటుంది. సోమనాథ్‌, ఉజ్జయినీ, కేదారనాథ్‌ మొదలైన జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శివుడికి ఈ స్తోత్రంతోనే అభిషేకాలు చేస్తారు. రామకృష్ణ పరమహంస నిత్యం ఈ స్తోత్రం పారాయణం చేసేవారు.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని