మహాపాదయాత్ర 2.0

అమరావతి రైతులు మరో మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. గత ఏడాది న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట రాజధాని నుంచి తిరుపతి వరకు మొదటి విడతగా పాదయాత్ర

Published : 13 Aug 2022 03:39 IST

త్వరలో రూట్‌మ్యాప్‌ ప్రకటించనున్న అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస

ఈనాడు, అమరావతి: అమరావతి రైతులు మరో మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. గత ఏడాది న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట రాజధాని నుంచి తిరుపతి వరకు మొదటి విడతగా పాదయాత్ర చేసిన విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా రెండో విడతగా అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా సూర్యభగవానుడు కొలువైన అరసవల్లి వరకు ఈ పాదయాత్ర సాగనుంది. అమరావతి ఉద్యమం ప్రారంభమై సెప్టెంబరు 12వ తేదీకి వెయ్యి రోజులు పూర్తి అవుతుంది. అదే రోజు మహాపాదయాత్ర 2.0 మొదలు కానుంది. 1,000వ రోజు రాజధానిలో కూడా భారీ బహిరంగ నిర్వహించనున్నారు. ఉద్యమం, భవిష్యత్తు కార్యాచరణపై అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస ఆధ్వర్యంలో శుక్రవారం వెలగపూడిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండో విడత మహాపాదయాత్ర ప్రతిపాదనను అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శివారెడ్డి, కార్యదర్శి తిరుపతిరావులు ఈ సమావేశం ముందు ఉంచారు. దీనిపై రైతు, మహిళా, దళిత ఐకాస నేతలు సానుకూలంగా స్పందించారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపట్టక కాలయాపన చేస్తోందని పలువురు పేర్కొన్నారు. రాజధానికి ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి ప్రజలకు వివరించేందుకు ఈ పాదయాత్ర చేపట్టాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టమైన రూట్‌మ్యాప్‌, కార్యాచరణ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

65 నుంచి 70 రోజుల పాటు
సెప్టెంబరు 12న కరకట్ట దిగువన వెంకటపాలెం వద్ద ఉన్న వెంకన్న ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ఈ యాత్ర మొదలవుతుంది. ఇది ఉమ్మడి కృష్ణా, పశ్చిమ, తూర్పు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా సాగనుంది. దాదాపు 650 కి.మీ మేర సాగే ఈ యాత్ర 65 నుంచి 70 రోజుల వరకు జరిగే అవకాశం ఉంది. నవంబరు 13 లేదా 14న అరసవల్లిలో ముగింపు సభ నిర్వహించనున్నారు. ఈ సభకు కేంద్ర మంత్రి ఒకరు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు భాజపా నేతలు ఐకాస నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

1,000వ రోజు వెంకటపాలెంలో బహిరంగ సభ
వెంకటపాలెంలో తితిదే నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో 1,000వ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చారు. అన్ని పార్టీల అధినేతలను ఆహ్వానించనున్నారు. వచ్చేందుకు ఇప్పటికే పలు పార్టీల నాయకులు ఆమోదం తెలిపారు. ఆ రోజు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస నేతలు నిర్ణయించారు. ఆయా కార్యక్రమాల వివరాలను రెండు రోజుల్లో ఖరారు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని