హరికథకు.. వెలుగులద్దిన ఉమామహేశ్వరి

ఉమామహేశ్వరికి హరికథ అంటే ప్రాణం. చిన్నతనంలో సరదాగా వినేందుకు వెళ్లి.. తానూ నేర్చుకుని.. అంచెలంచెలుగా ఎదిగి.. జాతీయస్థాయి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Updated : 26 Jan 2024 13:37 IST

దేశవిదేశాల్లో ప్రదర్శనలతో ప్రత్యేక గుర్తింపు

ఈనాడు, అమరావతి-న్యూస్‌టుడే, గొడుగుపేట (మచిలీపట్నం): ఉమామహేశ్వరికి హరికథ అంటే ప్రాణం. చిన్నతనంలో సరదాగా వినేందుకు వెళ్లి.. తానూ నేర్చుకుని.. అంచెలంచెలుగా ఎదిగి.. జాతీయస్థాయి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ కళకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చి.. దేశవిదేశాల్లో ఎన్నో అవార్డుల్ని అందుకున్నారు. తాజాగా ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన ఉమామహేశ్వరి తెలంగాణలోని వేములవాడలో పెరిగారు. తండ్రి లాలాజీరావు నాదస్వర విద్వాంసుడు. ఆయన వేములవాడ రాజరాజేశ్వరిస్వామి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా మూడు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఉమామహేశ్వరి పదో తరగతి వరకూ చదువుకున్నారు. చిన్నతనం నుంచి సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. సెలవులకు మచిలీపట్నం వచ్చినప్పుడు హరికథలను ఎంతో ఇష్టంగా వినేవారు. తండ్రి సూచనతో తానూ హరికథా కళాకారిణి కావాలని బలంగా నిర్ణయించుకున్నారు.

ప్రముఖ గురువుల శిక్షణతో...

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో ఉన్న శ్రీసర్వారాయ హరికథా గురుకులంలో 14 ఏళ్ల వయసులో ఉమామహేశ్వరి చేరారు. వడ్లమాని నర్సింహదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు, కృష్ణమాచార్యులు, లక్ష్మీపతిరావు, విశ్వనాథ భాగవతులు లాంటి ప్రముఖ గురువుల వద్ద శిక్షణ పొందారు. విజయనగరం సంస్కృత కళాశాలలో ‘రుక్మిణి కల్యాణం హరికథా గానం’ తొలి ప్రదర్శనను ఇచ్చారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఇప్పటిదాకా వేల ప్రదర్శనలు ఇచ్చారు. దేశంలోని విశ్వవిద్యాలయాలన్నీ ఆమె ప్రదర్శనల్ని ఏర్పాటు చేశాయి. తెలుగుతోపాటు సంస్కృతంలోనూ హరికథా గానం చేయడంలో ఉమామహేశ్వరి దిట్ట. 2019కి సంబంధించి సంగీత నాటక అకాడమీ అవార్డును గత ఏడాది అందుకున్నారు. ఉమామహేశ్వరి భర్త కళాకృష్ణ ఆంధ్ర నాట్యంలో నిష్ణాతులు. వీరు అఖిల, సాయిమణిదీప్‌ అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచి పెద్దచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ బేగంపేటలో కుటుంబంతో కలిసి ఉమామహేశ్వరి నివసిస్తున్నారు. తనకు పద్మశ్రీ రావడంతో చాలా ఆనందంగా ఉందనీ, ఇది హరికథకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ‘ఈనాడు’కు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని