పాత రోగే వైద్యుడు!.. కడప ప్రభుత్వ ఆసుపత్రిలో వింత వైఖరి

సీఎం జగన్‌ సొంత ఇలాకా వైయస్‌ఆర్‌ జిల్లా కేంద్రమైన కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పాత రోగే ఇతర రోగులకు వైద్యం చేస్తున్నారు.

Updated : 15 Feb 2024 07:34 IST

కడప (సర్వజన ఆసుపత్రి), న్యూస్‌టుడే: సీఎం జగన్‌ సొంత ఇలాకా వైయస్‌ఆర్‌ జిల్లా కేంద్రమైన కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పాత రోగే ఇతర రోగులకు వైద్యం చేస్తున్నారు. అతడికి వైద్యం తెలుసని, రోగులకు ఇబ్బంది ఉండదని ఆసుపత్రి నర్సింగ్‌ సిబ్బంది చెబుతున్నారు. మంగళవారం రాత్రి ఎంఎస్‌-1 వార్డులో ఉండాల్సిన నర్సులు వార్డులో ఉన్న ఓ రోగికి బాధ్యతలు అప్పగించి మందులు, సూదులు బీరువాలో ఉన్నాయని, ఏదైనా అవసరమైతే రోగులకు ఇవ్వాలని ఆదేశించినట్లు తాము విన్నామని రోగులు, వారి బంధువులు వాపోయారు. దాంతో.. ఆ రోగి రాత్రి నుంచి ఉదయం వరకు రోగులకు సెలైన్‌ పెట్టడం, తొలగించడం చేశారు. బుధవారం ఉదయం 6.30కు తనకు తానే బీరువాలోని ఓ ఇంజెక్షన్‌ చేసుకున్నాడని, పది నిమిషాలకు కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమైందని ఇతర రోగులు చెప్పారు. వెంటనే వైద్యులు అతడి తలకు కట్టు కట్టి వైద్యం చేశారు. వారం రోజులుగా ఆ రోగే మిగిలినవారికి వైద్యం చేస్తున్నట్లు చెప్పారు. ఇదేంటని ప్రశ్నిస్తే తనకు చదువు రాదని, వైద్యమంతా తెలుసని, అందుకే తనకు నర్సులు బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నట్లు రోగులు వాపోయారు. దీనిపై ఓ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ స్పందిస్తూ ఆ వ్యక్తి ఆసుపత్రి ఏర్పాటవ్వక ముందునుంచి ఇక్కడే ఉన్నాడన్నారు. అతడికి వైద్యమంతా తెలుసని చెప్పారు. వైద్యులు డిశ్ఛార్జి చేసినా మరో వార్డులో చేరిపోతాడని తెలిపారు. అతడికి వైద్యులు, నర్సులు బాగా తెలుసని, అందుకే వైద్యం చేసి ఉండవచ్చునని అన్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమాదేవి మాట్లాడుతూ.. వార్డులో ఏం జరిగిందో తెలుసుకుంటామన్నారు. ఓ రోగి ఇతర రోగులకు వైద్యం చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తెలిపారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు