అక్రమాల్లో సాగి.. అవినీతిలో ఊగి!

‘ఇసుక.. బుసక.. బూడిద.. కాదేది అక్రమార్జనకు అనర్హం..’ మీరు చదివింది కవితాపంక్తి అనుకుంటే పొరపాటే. ఫక్తుగా.. ఓ మంత్రి వాటి ద్వారా సాగిస్తున్న అరాచక దందా. అవినీతి పథంలో ఆ ‘మాంత్రి’కుడిది ప్రత్యేక పంథా.

Published : 11 Mar 2024 05:37 IST

ఇసుక, బుసక, బూడిద.. ఆయనకు వరమే!
అడ్డగోలుగా వేలాలు.. ఆ సొమ్ములోంచి వాటాలు
జగనన్న లే-అవుట్లలో చేతివాటం
పనులు చేయకుండానే నిధులు స్వాహా

‘ఇసుక.. బుసక.. బూడిద.. కాదేది అక్రమార్జనకు అనర్హం..’
మీరు చదివింది కవితాపంక్తి అనుకుంటే పొరపాటే.
ఫక్తుగా.. ఓ మంత్రి వాటి ద్వారా సాగిస్తున్న అరాచక దందా.
అవినీతి పథంలో ఆ ‘మాంత్రి’కుడిది ప్రత్యేక పంథా.
ప్రజలు.. స్వపక్షం.. విపక్షం అన్న తారతమ్యం చూపడం ఆయనకు అస్సలు గిట్టదు!
అందరినీ ఒకేగాటన కట్టి డబ్బులను దండుకోవడం.. ముడుపులు పిండుకోవడం.. అవినీతి మత్తులో ఊగడం ఆయన నైజం!

ఆయన ఓ ప్రజాప్రతినిధి.. ప్రజలకు సేవ చేయాల్సిన ఆయన అన్ని రకాల సేవలకు యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తారు. ఆ వసూళ్ల కార్యం కోసం ప్రత్యేకంగా ఓ కార్యాలయాన్నే తెరిచారు. ప్రజలు, గుత్తేదారులు, స్వపక్షీయులు.. ఎవరైనా సరే అక్కడ పనికో రేటు, ఫైలుకో రేటు మాట్లాడుకోవాల్సిందే. అందుకు ఆయన పీఏ, ఓఎస్‌డీలు కమీషన్‌ ఏజెంట్ల అవతారమెత్తారు. తన నియోజకవర్గంలోనే కాదు. పక్క నియోజకవర్గంలోనూ ఆయన ‘దుమ్ము’రేపుతారు. ఆ దూకుడు.. బెదిరింపులు.. దౌర్జన్యాలే అర్హతలుగా ఆయనకు మంత్రి పదవి దక్కింది. ఇంకేం.. ఆయన అవినీతి, అక్రమాలు, అడ్డగోలు దందాలకు అంతు, ‘హద్దు’ లేకుండా పోయింది..!!

ట్రాన్స్‌ఫార్మర్‌ వేయాలంటే కమీషన్‌.. రోడ్డు మరమ్మతు చేయాలంటే కమీషన్‌.. ప్రజలకు అవసరమైన పనుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలంటే కమీషన్‌.. పని ఏదైనా సరే ‘నాకేంటి’ అని చేయి చాచడమే అయిన ‘పని’. తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలను తరచూ మార్చే ఈ ప్రజాప్రతినిధికి ఎక్కడికి వెళితే అక్కడ జోలె పట్టడం ఆనవాయితీ. విరాళాల పేరుతో బలవంతంగా వసూలు చేయడం.. ఖర్చుల పేరుతో కమీషన్లను గుంజడం ఆయనకు ‘మట్టి’తో పెట్టిన విద్య. చేపల చెరువుల నుంచి భూకబ్జాల వరకు.. బుసక తవ్వకాల నుంచి బూడిద సరఫరా వరకు అక్రమంగా ఆర్జించడంలో ఆయనకు ఆయనే సాటి. కాదూ.. కూడదూ అంటే తట్ట మట్టి కూడా ఎవరూ ఎత్తలేరు..! దోసెడు బూడిదను కూడా ఎవరూ తాకలేరు..!!


తనివి‘తీర’ సంపాదించడం లేదంట..

తీర ప్రాంతంలో ఉన్న తన నియోజకవర్గంలో తాను సంపాదించడానికి ఏమీ లేదంటూ సహచర ప్రజాప్రతినిధుల వద్ద వాపోయే ఆయన.. ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులను పక్కనపెట్టి.. ‘ప్రైవేటు పని’ని బట్టి వసూళ్లు చేయడానికి ప్రత్యేక బలగాన్ని నియమించుకున్నారు. ఆ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం.. చేనేత, కలంకారీ, హస్తకళలకు ప్రసిద్ధి. అయితే చేనేత సహకార రంగం కుదేలైనా ఆ రంగాన్ని పట్టించుకోలేదు. నిధులను సాధించలేకపోయారు.


ప్రతి మండలం నుంచి రూ.50 లక్షలు వసూలు

మంత్రి తన పీఏ మధ్యవర్తిత్వంగా నియోజకవర్గంలో ముడుపులు స్వీకరిస్తుంటారు. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తారు.  పరులు, స్వపక్షం వారు  అన్న తేడాలేకుండా ఎవరైనా ఎకరాకు రూ.20 వేలు చెల్లిస్తే చాలు.. అధికారులతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుకోవచ్చు.  ఇసుక తవ్వకాలకు అడ్డగోలుగా వేలం నిర్వహించి ఇష్టానుసారంగా అక్రమాలకు గేట్లు తెరిచారు. అందుకు మండలానికి రూ.50 లక్షల చొప్పున వసూలు చేశారు. ఫలితంగా దళారులు పట్టపగలే విచ్చలవిడిగా టిప్పర్లతో ఇసుకను తరలించినా అడ్డుకునే వారే కరవయ్యారు. పట్టణాల్లో భవనాలు నిర్మించాలంటే ముందుగా మంత్రి కార్యాలయంలో ముడుపుల పునాది పడాల్సిందే. అవి అందితే.. నిబంధనలను ఉల్లంఘించినా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా అడిగే వారే ఉండరు. ఇలా నియోజకవర్గంలో వందల సంఖ్యలో అక్రమ భవనాలు వెలిశాయి. అక్రమంగా డబ్బు వసూలు చేయడంలో రైతులనూ వదిలిపెట్టలేదు. పట్టాదారు పాసుపుస్తకాల జారీకి రైతుల నుంచి ఎకరానికి రూ.20  వేల చొప్పున వసూలు చేశారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేతలోనూ బాధిత కుటుంబాల నుంచి మంత్రి కార్యాలయం డబ్బులను దండుకుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు కదా.. తమ నాయకుడి మాదిరిగా ఆయన అనుచరులూ అక్రమ వసూళ్లకు మరిగారు.


జగనన్న లే-అవుట్‌లో రూ.2 కోట్ల కమీషన్‌

మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఓ పట్టణంలో ‘జగనన్న లే-అవుట్‌’ కోసం ప్రభుత్వం 40 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. మార్కెట్‌ ధరను పెంచి భూములు కొనుగోలు చేయడంలో మంత్రి చక్రం తిప్పారు. ఇలా కొనుగోలు చేసిన భూముల లావాదేవీల్లో ఎకరాకు రూ.5 లక్షల నుంచి 6 లక్షల వరకు కమీషన్‌ వసూలు చేశారు. ఇలా జగనన్న లే-అవుట్‌ రైతులకు అందాల్సిన పరిహారంలోంచి రూ.2  కోట్లకు పైగా కమీషన్‌ దండుకున్నారు. మాజీ సీఎంను నిత్యం తిట్టాలంటూ ప్రోత్సహించే సీఎం జగన్‌ ఆశీస్సులతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి ఆ శాఖలోని ప్రతి అధికారి నుంచి లక్ష్యాలు పెట్టి మరీ వసూళ్లకు తెరలేపారు. లబ్ధిదారులకు యూనిట్‌ వ్యయం సరిపోక ఇప్పటికే తిప్పలు పడుతుంటే.. ఈ కమీషన్లను ఎక్కడి నుంచి తేవాలని అధికారులు గగ్గోలు పెట్టే పరిస్థితి దాపురించింది. తన నియోజకవర్గంలో కొన్ని పనులను అసలే చేయకుండా రూ.కోట్లు కొట్టేశారు. పక్క జిల్లాల్లోనూ ‘జగనన్న లేఅవుట్ల’ వ్యవహారంలో కాలు పెట్టేందుకు శతవిధాలా యత్నించారు ఈ మంత్రి. అక్కడి ప్రజాప్రతినిధులు వ్యతిరేకించడంతో తోకముడిచారు.


జల వనరుల పనుల్లో 25 శాతం..

జలవనరుల శాఖ ఇంజినీర్లపై ఇష్టమొచ్చినట్లు విరుచుకుపడేవారు. ‘మంత్రి వస్తే లేచి నిలబడే సంస్కారం లేదా.. కనీసం నమస్కారం కూడా చేయరా’ అంటూ వారిపై మండిపడేవారు. తన నియోజకవర్గంలో జల వనరుల శాఖకు సంబంధించిన దాదాపు రూ.25 కోట్ల విలువైన పనులు చేపట్టి అందులోంచి 25 శాతం కమీషన్‌ తీసుకున్నారు. మడ భూములను ఆక్రమించి చెరువులుగా మార్చేశారు. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. రూ.52 కోట్ల విలువైన ఓ రోడ్డు పనులకు 10 శాతం కమీషన్‌ తీసుకున్నారు. అయినా ఆ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఓ గ్రామంలో వంతెన నిర్మాణం అవసరమైంది. అందుకు స్వపక్షీయులే ప్రజల నుంచి రూ.40 లక్షల వరకు విరాళాలు వసూలు చేసి మంత్రి కార్యాలయానికి పంపారు. రూ.కోటి విలువైన ఆ వంతెన అంచనాలను రూ.3 కోట్లకు పెంచారు. నియోజకవర్గంలో చేపట్టిన రహదార్లు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకే భవన నిర్మాణాలకు మంత్రి భారీగా కమీషన్లు తీసుకున్నారు. ఫలితంగా గుత్తేదారులు వాటిని నాసిరకంగా నిర్మించారు. నియోజకవర్గంలో రూ.2 కోట్లతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ రహదారి నాణ్యత లోపంతో ఆరు నెలలకే కోతకు గురవుతోంది. పట్టణంలో ఓ సంస్థ రూ.85 కోట్లతో నీటి పథకం విస్తరణ పనులు చేపట్టింది. పనులు సాగాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని గుత్తేదారు సంస్థను డిమాండ్‌ చేశారు. ఉన్నతాధికారులతో మంతనాలు జరిపిన ఆ సంస్థ ఎట్టకేలకు పనులు పూర్తిచేసింది. దీన్ని మనసులో పెట్టుకున్న ఆ నేత బిల్లులు రాకుండా వేధింపులకు గురిచేశారు. పట్టణంలో రూ.35 కోట్లతో ఓ సంస్థ చేపట్టిన అంతర్గత తాగునీటి పైపులైన్ల పనులు కూడా ఆ మంత్రి కార్యాలయం ఒత్తిడితోనే నిలిచిపోయాయి.


జూదానికి ప్రోత్సాహం!

జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తన నియోజకవర్గంలోనూ జూద క్లబ్‌లను ఏర్పాటు చేసి ప్రోత్సహించారు ఆ మంత్రి. పోలీసులు అటువైపు రాకుండా ‘ఏర్పాట్లు’ చేసుకున్నారు. ఈ క్లబ్‌ల నుంచి నెలకు రూ.5 లక్షల కమీషన్‌ అందుకునేవారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తికి 5.3 ఎకరాల స్థలం ఉంది. ఆయన మృతి చెందారు. ఆస్తుల విషయంలో జడ్జి తల్లికి, జడ్జి భార్యకు మధ్య విభేదాలు వచ్చాయి. ఈ విషయంలో జోక్యం చేసుకున్న ప్రజాప్రతినిధి అందులోని 1.30 ఎకరాలను తన అనుచరుడికి కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం న్యాయస్థానానికి వెళ్లింది. జడ్జి ఆస్తికే రక్షణ లేకుండా పోయిందని అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. తీర ప్రాంతంలోని 40 ఎకరాలను బినామీ పేరిట ఆ నేత కబ్జా చేశారని, వాటికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయ్యాయని తెలిసింది.


‘ముఖ్యు’డికి తెలిసినా మౌనమే..

తన నియోజకవర్గంలో ఇసుక, బుసక తవ్వకాలు జరిపి యథేచ్ఛగా తరలించేవారు. బూడిద చెరువును కబ్జా చేసి పొక్లెయిన్ల సహాయంతో బూడిద రవాణా చేసేవారు. ఉచితంగా ఎత్తే బూడిదకు ఆయన యంత్రాల ద్వారా ఎత్తితే రూ.3 వేలు, రవాణా చేస్తే రూ.10 వేల చొప్పున వసూలు చేసేవారు. ఇలా రూ.కోట్లలో వ్యాపారం చేశారు. ఈ పంచాయితీ సీఎం వద్దకు వెళ్లినా.. ఆయన మౌనం వహించారు. దీన్ని బట్టి.. ‘ముఖ్యు’డి వద్ద ఆ నేత పరపతి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2009లో మొదటిసారిగా ఒక నియోజకవర్గం నుంచి, 2014లో మరో నియోజకవర్గం, 2019లో తిరిగి మొదటి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. ఇప్పుడు(2024లో) మరో నియోజకవర్గం నుంచి బరిలో నిలవనున్నట్లు సీఎం ప్రకటించారు. ఆ ప్రకటన ఇలా విడుదల అవగానే అలా ఆ నియోజకవర్గంలోని ఇసుకపై పడ్డారు. రోజుకు రూ.50 లక్షల వరకు ఆదాయాన్ని గడిస్తున్నారు. ఎన్నికల విరాళాలు అంటూ రియల్టర్లు, బిల్డర్లు, గుత్తేదారులు, పారిశ్రామికవేత్తల నుంచి రూ.కోట్లలో వసూలు చేస్తున్నారు. ఆ నేత ఆగడాలను చూసి ఆ నియోజకవర్గ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు.


ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని