‘అప్పు’నంగా ఖర్చు!

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా సర్కారు లెక్కకు మిక్కిలి అప్పులు చేస్తోంది. జీఎస్‌డీపీలో పరిమిత నిష్పత్తికి మించి మరీ రుణాలు పుట్టిస్తోంది. ఎక్కడ దొరికితే అక్కడ, ఎలా కుదిరితే అలా చేయి చాస్తూనే ఉంది.

Updated : 15 Mar 2024 07:43 IST

రూ.వేల కోట్ల రుణాల్లో ఆస్తుల సృష్టి అంతంతే!
ఉపయోగం లేని వాటికే అత్యధిక వ్యయం
నిరుడు ఇది ఏకంగా 86%తో చెత్త రికార్డు
జగన్‌ సర్కారులో పట్టాలు తప్పిన ఆర్థిక నిర్వహణ

అప్పు చేసి పప్పు కూడు... అని సామెత! పాలనలో అప్పు చేయడం తప్పు కాకపోవచ్చు. కానీ ఎందుకు అప్పు చేస్తున్నాం, వచ్చిన సొమ్ములతో ఏం చేస్తున్నామనేది కీలకం! రుణం తీసుకుని విందులు, వినోదాలకు ఖర్చు చేస్తే అది గుదిబండగా మారుతుంది. అలాకాకుండా దాంతో ఇల్లు నిర్మించుకుంటే కుటుంబానికి ఆస్తిగా మారుతుంది. ప్రతి కుటుంబానికీ ఈ విషయం తెలియంది కాదు. అర్థం కానిదీ కాదు. ఒక్క సీఎం జగన్‌కు తప్ప!

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా సర్కారు లెక్కకు మిక్కిలి అప్పులు చేస్తోంది. జీఎస్‌డీపీలో పరిమిత నిష్పత్తికి మించి మరీ రుణాలు పుట్టిస్తోంది. ఎక్కడ దొరికితే అక్కడ, ఎలా కుదిరితే అలా చేయి చాస్తూనే ఉంది. ఆస్తులనూ తాకట్టు పెడుతోంది. లెక్కకు మిక్కిలి గ్యారంటీలు ఇస్తోంది. రాష్ట్ర రెవెన్యూ రాబడిలో
అంతకు ముందున్న పరిమితిని తనంతట తానే పెంచేసుకుని... అదనపు అప్పులు తీసుకుంటోంది. ఇలా తెచ్చిన అప్పులతో ఆస్తులను సృష్టించే పనులేవీ చేయడంలేదు. మూలధన ఖర్చుగా వినియోగించడం లేదు. ఎలాంటి ప్రతిఫలం ఇవ్వని రెవెన్యూ వ్యయంగా మార్చేస్తోంది.


అభివృద్ధికి ఆమడ దూరం

జగన్‌ ఐదేళ్ల ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్‌ అడుగులు అభివృద్ధి వైపు పడలేదు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం స్తంభించింది. రెండు, మూడింటి నిర్మాణాలు నామమాత్రంగా పూర్తయ్యాయి. కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిన ఉదంతాలు లేవు. పరిశ్రమల ఏర్పాటుకు అనుగుణంగా మౌలిక సౌకర్యాల
కల్పనపైనా దృష్టి సారించలేదు. రహదారుల నిర్మాణమూ లేదు. పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేల అనుసంధానం పెంచే పనులేవీ చేయలేదు. మరోవైపు సేవారంగం విస్తృతికి అవసరమైన అవకాశాలను కల్పించలేదు. జగన్‌ సర్కారు నాలుగేళ్లలో (లెక్కలు ఖరారు చేసింది నాలుగేళ్లకే) చేసిన అప్పులో కేవలం 28% మాత్రమే ఆస్తుల సృష్టికి వినియోగించారు. మిగిలిన 72 శాతాన్ని రెవెన్యూ వ్యయంగానే మళ్లించేశారు. ముఖ్యంగా... 2022-23లో రెవెన్యూ వ్యయం ఏకంగా 86.74% ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఈ పెడధోరణి కారణంగా రాష్ట్రానికి అప్పులు, వడ్డీలు గుదిబండలా మారనున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీ మున్ముందు మరింత దారుణ పరిస్థితుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంది.


ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ఏం చెబుతోంది?

బడ్జెట్‌ రూపకల్పనకు, దాని అమలుకు ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్కల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ రెస్పాన్సిబిలిటీ) చట్టం ఎంతో కీలకం. ఆ చట్టం ప్రకారం రాష్ట్రానికి వచ్చే మొత్తం రాబడులను కలిపితే రెవెన్యూ ఆదాయం అవుతుంది. రాష్ట్ర సొంత రాబడి, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలు, కేంద్రం ఇచ్చే గ్రాంట్లను కలిపితే వచ్చేది... రెవెన్యూ రాబడి. ఈ రెవెన్యూ రాబడికి, మనం చేసే రెవెన్యూ ఖర్చు సమానంగా ఉండాలి. అప్పుడే బడ్జెట్‌లో రెవెన్యూ లోటు అనేది ఉండదు. అలాంటి సందర్భంలో తీసుకునే ప్రతి రుణంలో అత్యధిక భాగాన్ని మూలధన వ్యయం కోసం వినియోగించుకునేందుకు వీలవుతుంది. అంటే అప్పులు చేసి ఆస్తులను సృష్టించుకునే అవకాశం లభిస్తుంది. కానీ, రెవెన్యూ వ్యయం కోసమే అప్పులు చేయడం అనేది ప్రమాదకరమైన పరిణామం. జగన్‌ సర్కారులో అది మరీ విశృంఖలమైంది. ఫలితంగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితులను సర్కారే స్వయంగా సృష్టిస్తోంది. జగన్‌ సర్కారు ఏ ఏడాది... ఎంతమేర అప్పులు చేసింది? అందులో మూలధన వ్యయంగా ఎంత మొత్తం ఉందో పరిశీలిస్తే ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ రుణంలో కేవలం బహిరంగ మార్కెట్‌ రుణం, విదేశీ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు, నాబార్డు, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాలే కలిపి ఉంటాయి. కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి తీసుకున్న రుణ మొత్తాలు లేవు. కార్పొరేషన్ల రుణాలను మినహాయించినా సరే... ఆర్థిక పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. వాటిని కూడా కలిపితే ఇంకెంత దారుణంగా ఉంటుందో వేరే అంచనా అక్కర్లేదు.


కేటాయింపులకు...  వాస్తవ ఖర్చులకు మధ్య ఎంతో తేడా

జగన్‌ సర్కారు అనేక అనధికారిక అప్పులతో రాష్ట్రాన్ని నడిపిస్తోంది. కార్పొరేషన్ల ద్వారా ఎంత రుణం తీసుకున్నారు... ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి ఎంత అప్పు తెచ్చారనే అంశాలను కాగ్‌ అడిగినా ప్రతినెలా ఇవ్వడమే లేదు. కేవలం బహిరంగ మార్కెట్‌ రుణాలు లేదా ఇతర రుణాలు కలిపి కాగ్‌కు ఏపీ సర్కారు తెలియజేసిన వివరాల ప్రకారం... తెచ్చిన రుణంలో చాలాకొద్ది మొత్తం మాత్రమే ఆస్తులను సృష్టించేందుకు వినియోగిస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌ అంచనాల సమయంలోనే మొత్తం ఖర్చులో మూలధన వ్యయం కేటాయింపులు 12-14 శాతం లోపు ఉంటున్నాయి. అసలు కేటాయింపులే తక్కువ... అలాంటిది ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత చేసిన వాస్తవ ఖర్చు చూస్తే మరీ విస్తుపోవాల్సిన పరిస్థితులున్నాయి. మొత్తం ఖర్చులో మూలధన వ్యయం కింద 10 శాతమైనా ఖర్చు చేయని దుస్థితి రాష్ట్రంలో ఉంది.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని