‘కబ్జాల బండి’కి అక్రమాలే ఇరుసు!

విజయనగరం జిల్లాలోని ఓ కోటలాంటి ప్రాంతానికి చెందిన వైకాపా ప్రజాప్రతినిధి అక్రమార్జనలో మునిగితేలుతున్నారు. అధికారం చేపట్టింది మొదలు... అడ్డగోలు దోపిడీతో పేట్రేగిపోతున్నారు.

Updated : 22 Mar 2024 00:29 IST

ఐదేళ్లలో రూ.వందల కోట్ల ఆర్జన 
ఆయన కన్నుపడితే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల హాంఫట్‌
ముడుపులు చెల్లిస్తే ఏ పనికైనా ‘ఎస్‌’ అనేస్తారు
విజయనగరం జిల్లాలో పేట్రేగిపోతున్న వైకాపా ప్రజాప్రతినిధి

ఆయన ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి...
తన హోదాలోని తొలి రెండక్షరాలైన ప్రజలను వదిలేశారు...
చివరి రెండక్షరాలైన ‘నిధి’పైనే దృష్టి పెట్టారు...
అధికారం అండగా, అక్రమాలే ఇరుసుగా...
తన బండిని సోదర స‘మేత’ంగా పరుగులు పెట్టించారు...
సొంత మనుషులను గద్దల్లా మోహరించి...
గిరిజనుల ఆస్తుల్ని మింగేశారు...
ఉపాధి హామీలో బినామీలకు చోటిచ్చారు...
స్థలాలు, భూములు, కాంట్రాక్టులే ఆలంబనగా...
ఐదేళ్లలో కళ్లు చెదిరే ఆస్తులను పోగేశారు...

విజయనగరం జిల్లాలోని ఓ కోటలాంటి ప్రాంతానికి చెందిన వైకాపా ప్రజాప్రతినిధి అక్రమార్జనలో మునిగితేలుతున్నారు. అధికారం చేపట్టింది మొదలు... అడ్డగోలు దోపిడీతో పేట్రేగిపోతున్నారు. ఆయన కన్ను పడితే... ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తి ఏదైనా కబ్జా కావాల్సిందే. ఖాళీ జాగాలైనా, వివాదాస్పద భూములైనా ఆయన పరం అవ్వాల్సిందే. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా... ఆయనకు ముడుపు చెల్లించుకోవాల్సిందే. చివరికి గిరిజనుల ఆస్తుల్నీ వదలకుండా మింగేసిన ఈ ప్రజాప్రతినిధి అయిదేళ్లలో రూ.వందల కోట్ల విలువైన భూముల్ని కొల్లగొట్టి ‘‘కబ్జాల బండి’’గా పేరొందారు.


రికార్డులు మార్చేసి... బంధువులకు నజరానా

కొత్తవలస మండలం అర్థానపాలెం పరిధిలో ఓ రాజు పేరిట ఉన్న 14.40 ఎకరాల భూమిని ఈ నాయకుడి అత్తవారింటి తరఫు బంధువులు గతంలో ఆక్రమించుకున్నారు. తాను ఎన్నికల్లో గెలిచాక... ఈ నాయకుడు అధికారులపై ఒత్తిడి చేసి రికార్డులను తారుమారు చేయించి, ఆక్రమిత భూమికి తన అత్తవారింటి తరఫు బంధువుల పేరిట పట్టాదారు పాసు పుస్తకాలను చేయించారు. ప్రతిఫలంగా ప్రధాన రహదారి పక్కనే అత్యంత విలువైన 25 సెంట్ల స్థలాన్ని వారి నుంచి తీసుకున్నారు. దాని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించి ఓ ఇంటిని నిర్మించుకున్నారు. స్థానిక స్థిరాస్తి వ్యాపారులు కొందరు ఈ భవనాన్ని తమ సొంత ఖర్చులతో నిర్మించి ఇచ్చారు.


సెటిల్‌మెంట్లు..... దందాలు

  • కొత్తవలస మండలం గులివిందాడలో ఒక లేఅవుట్‌ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం నెలకొనగా... ఈ నాయకుడు జోక్యం చేసుకున్నారు. రూ.15 కోట్ల విలువైన మూడెకరాల భూమిని నామమాత్రపు ధరకు లాగేసుకున్నారు. చింతలపాలెంలోని ఓ లేఅవుట్‌లోనూ ఇలాగే వాటా తీసుకున్నారు.
  • చింతలపాలెంలోని 17.23 ఎకరాల ప్రభుత్వ భూమి, 18.71 ఎకరాల గెడ్డ పోరంబోకు భూమి ఓ నాయకుడి ఆధీనంలో ఉంది. ఏకంగా రూ.100 కోట్ల వరకు విలువున్న మొత్తం 35.94 ఎకరాల భూములకు ఆయన బంధువుల పేరిట పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయించారు. ప్రతిగా అతని నుంచి ఈ ప్రజాప్రతినిధి రూ.25 కోట్ల వరకు అందుకున్నారు.
  • నియోజకవర్గ పరిధిలోని అమ్మచెరువులో రూ.10 కోట్ల విలువైన 4.86 ఎకరాలను, వీరసాగరం చెరువులో రూ.3 కోట్ల విలువైన 2.90 ఎకరాలను ఆక్రమించేశారు.
  • దెందేరు గ్రామంలో పది మంది యాదవులకు సంబంధించిన రూ.3 కోట్ల విలువైన రెండెకరాల భూమిని నకిలీ 1బీతో కాజేశారు.

వివాదాన్ని పరిష్కరిస్తానంటూ 12 ఎకరాలు మాయం

  • కొత్తవలస మండలంలోని ఒక గ్రామంలో గిరిజనులు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న 108 ఎకరాల భూమి విషయంలో కొంత వివాదం ఉంది. దీన్ని పరిష్కరిస్తానంటూ అందులో 12 ఎకరాలను సదరు ప్రజాప్రతినిధి తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దాని విలువ రూ.60 కోట్ల పైమాటే. ఆ తర్వాత అదే భూమిలో స్థిరాస్తి వెంచర్‌ వేసేందుకు ప్రయత్నించగా... గిరిజనులు అడ్డుకున్నారు. దాంతో వారిని వెనకుండి నడిపించారంటూ వైకాపా ఎంపీటీసీ సభ్యురాలిపై పోలీసు కేసు పెట్టించారు.
  • అర్థానపాలెంలోని ఆరెకరాల స్థలం రెవెన్యూ దస్త్రాల్లో ఒకచోట జిరాయితీగా, మరోచోట గయాల్‌ భూమిగా నమోదై ఉంది. దీన్ని అడ్డం పెట్టుకుని రికార్డులు తారుమారు చేయించి, అందులో రూ.5 కోట్ల విలువైన ఎకరం భూమిని తన పరం చేసుకున్నారు.
  • సస్పెన్షన్‌కు గురైన ఓ తహసీల్దార్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ సాయంతో కొత్తవలస, చింతలపాలెం, సంతపాలెం, దెందేరు, గులివిందాడ, రెల్లి తదితర గ్రామాల్లో కొన్ని రెవెన్యూ రికార్డులను ట్యాంపర్‌ చేయించి భూముల్ని ఆక్రమించుకున్నారు.

ముడుపుల కింద రూ.కోట్ల విలువైన స్థలాలు

ఎవరైనా స్థిరాస్తి లేఅవుట్‌ వేయాలంటే విస్తీర్ణాన్ని బట్టి వెయ్యి నుంచి రెండు వేల గజాల స్థలాన్ని ఈ నాయకుడికి ముడుపు కింద చెల్లించుకోవాల్సిందే. గత అయిదేళ్ల వ్యవధిలో దాదాపు రూ.40 కోట్ల విలువైన స్థలాలను ఇలా తన బినామీల పేరిట రాయించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వెలిస్తే ఆయనకు కాసుల పంటే. నియోజకవర్గంలో ఎవరైనా కొత్తగా లేఅవుట్‌ వేయాలంటే తొలుత ఈ నాయకుడి సోదరుడ్ని కలిసి ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడే భూమార్పిడి సహా ఇతర అనుమతుల దస్త్రాలు ముందుకు కదులుతాయి. ఆయనకు తెలియకుండా ఏ ఒక్కటి ఆమోదించినా... బాధ్యులైన అధికారులను వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయించేస్తారు.


వివాదాస్పద భూముల వేటకు ప్రత్యేక బృందం

నియోజకవర్గంలోని ఖాళీ స్థలాలను, వివాదాస్పద భూములను గుర్తించేందుకు ఏకంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు గ్రామాల్లో తిరుగుతూ ఆయా వివరాల్ని ప్రజాప్రతినిధికి ఎప్పటికప్పుడు చేరవేస్తుంటారు. వాటి ఆధారంగా సంబంధిత భూములను కైవసం చేసుకోవడానికి ఆయన ప్రణాళికలను అమలు చేస్తుంటారు. ఈ పనులన్నీ చక్కబెట్టేందుకు కొందరు అధికారులను తన చుట్టూ పెట్టుకున్నారు. పేరుకే ప్రజాప్రతినిధి తప్ప... అయిదేళ్లుగా ఈ నాయకుడి దృష్టంతా భూముల కబ్జాపైనే.


కాసులు ముట్టజెప్పితే కోరినచోట పోస్టింగు

  • తన నియోజకవర్గం పరిధిలో పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఇంజినీరింగ్‌ శాఖల్లో కీలక పోస్టుల్లో అధికారులను నియమించడానికి బేరాలు పెట్టారు. ఎక్కువ మొత్తం చెల్లిస్తే వారు కోరిన చోట పోస్టింగులు ఇప్పించుకుంటున్నారు. ఒక ఇన్‌స్పెక్టర్‌ వద్ద రూ.5 లక్షలు తీసుకుని ఓ స్టేషన్‌లో పోస్టింగు ఇప్పించడం చర్చనీయాంశమైంది. 
  • ఈ నాయకుడు ఒక స్థిరాస్తి వ్యాపారితో కలిసి కొంత భూమిని కొన్నారు. అది వాణిజ్య భూమిగా అధికారిక దస్త్రాల్లో నమోదై ఉన్నా, వ్యవసాయ భూమిగా రాయాలంటూ అధికారులపై ఒత్తిడి చేశారు. దానికి అంగీకరించకపోవడంతో పట్టుబట్టి మరీ ఓ తహసీల్దారును బదిలీ చేయించారు.
  • ఉపాధి హామీ నిధులతో నియోజకవర్గంలో జరిగిన పనులన్నింటినీ తన సొంత మనుషులకు అప్పగించి, వారి నుంచి కమీషన్లు తీసుకున్నారు.
  • స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధికారులతో... నియోజకవర్గం పరిధిలోని స్థిరాస్తి వ్యాపారులందరికీ ఫోన్లు చేయించి, వారి ద్వారా రూ.కోటి వరకు వసూలు చేశారు.
  • అనధికారిక రీచ్‌లలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిపి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
  • స్టోన్‌ క్రషర్ల యజమానుల నుంచి పర్యావరణ అనుమతి ధ్రువపత్రాల జారీకి డబ్బులు వసూలు చేశారు.
  • స్థానికంగా ఉన్న ప్రధాన కర్మాగారాల్లో సరకు రవాణా వాహనాల కాంట్రాక్టును సంబంధిత యాజమాన్యాలను బెదిరించి మరీ తీసుకున్నారు. అప్పటికే ఈ రంగంలో ఉన్న కొందరిని బలవంతంగా పక్కకు తప్పించారు.

ఈనాడు, అమరావతి, విజయనగరం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని