సివిల్స్‌లో తెలుగు తేజాలు

దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష-2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు.

Updated : 17 Apr 2024 06:12 IST

మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ యువతి అనన్యరెడ్డి
విజేతల్లో 60 మంది తెలుగు అభ్యర్థులు
నలుగురికి 100లోపు ర్యాంకులు
టాపర్‌గా లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ
ఒడిశాకు చెందిన అనిమేష్‌ ప్రధాన్‌కు రెండో ర్యాంకు

ఈనాడు, హైదరాబాద్‌, దిల్లీ, కొచ్చి - న్యూస్‌టుడే, భువనేశ్వర్‌: దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష-2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ అభ్యర్థులు వరుసగా రెండో సంవత్సరం జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం విశేషం. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు వందలోపు ర్యాంకులు, 11 మంది 200లోపు ర్యాంకులు పొందారు. రెండు రాష్ట్రాల నుంచి విజేతలుగా నిలిచినవారిలో మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ పరీక్షలో తొలి స్థానంలో నిలిచారు. ఐఐటీ కాన్పుర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేసిన ఆయన.. అదే సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకుని విజయం సాధించారు.

ఒడిశాలోని అనుగుల్‌ జిల్లా తాల్చేరు వాసి అనిమేష్‌ ప్రధాన్‌ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఎన్‌ఐటీ రవుర్కెలా నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చేశారు. పి.కె.సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌, రుహానీలు వరుసగా నాలుగు, అయిదు స్థానాలు దక్కించుకున్నారు. తొలి 5 స్థానాలు సాధించిన వారిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. సివిల్స్‌-2023 ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) మంగళవారం విడుదల చేసింది. మొత్తం 1,016 మంది విజయం సాధించగా వారిలో 664 మంది పురుషులు, 352మంది మహిళలు ఉన్నారు. వీరిలో 30మంది దివ్యాంగులు ఉండడం విశేషం. జనరల్‌ విభాగంలో 347 మంది, ఈడబ్ల్యూఎస్‌లో 115, ఓబీసీ 303, ఎస్సీ 165, ఎస్టీ విభాగంలో 86 మంది ఉద్యోగాలు సాధించారు. సివిల్స్‌-2023 ప్రాథమిక పరీక్షకు 10,16,850 నమోదుచేసుకోగా 5,92,141 మంది హాజరయ్యారు. వారిలో 14,624 మంది మెయిన్స్‌కు, 2,855 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. చివరగా 1,016 మంది అత్యున్నత కొలువులు సాధించారు.

అప్పుడు ఉమాహారతి... ఇప్పుడు అనన్యరెడ్డి

గత ఏడాది సివిల్‌ సర్వీసెస్‌-2022లో సూర్యాపేట జిల్లాకు చెందిన ఉమాహారతి 3వ ర్యాంకు సాధించారు. ఆమె అయిదో ప్రయత్నంలో విజేతగా నిలిచారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు అప్పట్లో నారాయణపేట ఎస్పీగా ఉన్నారు. ఈసారి మహబూబ్‌నగర్‌ చెందిన అడ్డాకుల మండలం పొన్నకల్‌కు చెందిన అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలో 3వ స్థానంలో నిలవడం గమనార్హం. దిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల మిరాండ హౌస్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఐచ్ఛిక సబ్జెక్టు ఆంత్రోపాలజీలో మాత్రం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నారు.     ఆమె తండ్రి మహబూబ్‌నగర్‌లో స్థిరాస్తి వ్యాపారి.

కలల కొలువు కోసం కార్పొరేట్‌ ఉద్యోగం వదిలి..

తొలి ర్యాంకు సాధించిన లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ ఐఏఎస్‌ సాధించాలనే లక్ష్యంతో రూ.లక్షల్లో జీతం లభించే కార్పొరేట్‌ కొలువును విడిచిపెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ గోల్డ్‌మన్‌ శాక్స్‌లో 15 నెలలు పనిచేసిన ఆయన అనంతరం రాజీనామా చేశారు. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ దశను కూడా దాటలేకపోయారు. అయినా నిరాశ చెందలేదు. తప్పులు సరిదిద్దుకుని మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగించారు. 2022లో 236వ ర్యాంక్‌ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఐఏఎస్‌ కావాలన్న పట్టుదలతో మూడోసారి 2023లో మళ్లీ సివిల్స్‌ రాసి జాతీయస్థాయిలో తొలి స్థానం సాధించారు. పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించి.. పరీక్ష సిలబస్‌ను అంచనా వేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని శ్రీవాస్తవ చెప్పారు. హార్డ్‌వర్క్‌, స్మార్ట్‌వర్క్‌ మధ్య తేడా గుర్తించి వ్యూహాత్మకంగా ముందుకెళ్లడమే తన విజయ రహస్యమని వివరించారు.

ఇంటర్వ్యూ సమయంలో అమ్మను కోల్పోయా:  అనిమేష్‌ ప్రధాన్‌, రెండో ర్యాంకర్‌

‘‘2022లో సివిల్స్‌ సన్నద్ధత ప్రారంభించా. సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నా. రోజుకు 5-6 గంటల పాటు చదివా. ఎలాంటి శిక్షణ తీసుకోలేదు’’ అని రెండో ర్యాంకర్‌ అనిమేష్‌ ప్రధాన్‌ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ‘‘సివిల్స్‌ ఫలితం విషయంలో నా కల నెరవేరింది.  గత నెలలో సివిల్స్‌ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మా అమ్మను కోల్పోయాను. 2015లోనే నాన్న మృతి చెందారు. అప్పుడు నేను 11వ తరగతి చదువుతున్నా. వారు లేని లోటు పూడ్చలేనిది’’ అని పేర్కొన్నారు.

గత ఏడాది కన్నా అధికం

కొన్నేళ్లుగా సివిల్స్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి 45-50 మంది మాత్రమే ఎంపికవుతున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈసారి ఆ సంఖ్య 60 వరకు చేరుకుంది. మరికొందరు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. గత ఏడాది 46 మందికిపైగా విజేతలుగా నిలిచారు. సివిల్స్‌పై అవగాహన పెరగడం వల్ల పలువురు డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారని.. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధిస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన సివిల్స్‌ శిక్షణ నిపుణుడు విష్ణు విశ్లేషించారు.

ఐపీఎస్‌ శిక్షణ పొందుతూనే..

తొలి అయిదు స్థానాల్లో నిలిచిన ఆదిత్య శ్రీవాస్తవ (1), పి.కె.సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌ (4), రుహానీ (5).. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ శిక్షణలో ఉన్నారు. సివిల్స్‌ ఫలితాల్లో ఓ ఐపీఎస్‌ ట్రైనీకి తొలి ర్యాంకు రావడం.. గత దశాబ్దానికిపైగా కాలంలో ఇదే తొలిసారి.

 సివిల్స్‌ ఫలితాల్లో విజయం సాధించిన వారికి ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలియజేశారు. వారి కృషి రాబోయే రోజుల్లో మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని