Adani Wilmar: విల్మర్‌తో జాయింట్‌ వెంచర్‌కు అదానీ గుడ్‌బై?

Adani Wilmar: ఇకపై కేవలం కీలక రంగాల వ్యాపారాలపై మాత్రమే దృష్టి పెట్టాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విల్మర్‌తో ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ నుంచి వైదొలిగేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

Published : 06 Nov 2023 14:57 IST

దిల్లీ: సింగపూర్‌కు చెందిన ‘విల్మర్ ఇంటర్నేషనల్‌’ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ (Adani Wilmar Ltd) నుంచి నిష్క్రమించే యోచనలో అదానీ గ్రూప్‌ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు తమ వాటాను విక్రయించేందుకు పలు అంతర్జాతీయ స్థాయి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలతో అదానీ గ్రూప్‌ (Adani Group) చర్చలు జరుపుతున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది.

సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న విల్మర్‌ ఇంటర్నేషనల్‌తో కలిసి అదానీ గ్రూప్‌ (Adani Group).. ‘అదానీ విల్మర్‌ లిమిటెడ్‌ (Adani Wilmar Ltd)’ పేరిట జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంట్లో ఇరు సంస్థలకు 43.97 శాతం వాటాలు ఉన్నాయి. తమ వాటాల విక్రయం వల్ల 2.5-3 బిలియన్‌ డాలర్లు సమీకరించాలని అదానీ గ్రూప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకు ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు.

పోర్టుల నుంచి ఇంధనం వరకు వివిధ రంగాల్లోకి అదానీ గ్రూప్‌ (Adani Group) విస్తరించి ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఎఫ్‌ఎంసీజీ నుంచి వైదొలగి కేవలం ఇన్‌ఫ్రా వంటి కీలక రంగాలపై దృష్టి కేంద్రీకరించే యోచనలో అదానీ గ్రూప్‌ ఉన్నట్లు సమాచారం. అదానీ విల్మర్‌ (Adani Wilmar Ltd) నుంచి నిష్క్రమించడం వల్ల వచ్చే నిధులను ఈ గ్రూప్‌ ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. భారత వంట నూనెల మార్కెట్‌లో అదానీ విల్మర్‌కు గణనీయ వాటా ఉన్న విషయం తెలిసిందే. ఫార్చూన్‌ బ్రాండ్‌ పేరిట వంట నూనెలు సహా ప్యాకేజ్డ్‌ వంట సరకులను ఈ కంపెనీ విక్రయిస్తోంది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.55,262 కోట్ల ఆదాయంపై రూ.607 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. అదానీ విల్మర్‌ షేరు విలువ సోమవారం మధ్యాహ్నం 2:40 గంటల సమయంలో 0.98 శాతం నష్టపోయి రూ.314.30 దగ్గర కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని