Adani Colombo port: అదానీ ప్రాజెక్టులోకి అమెరికా నిధులు.. కొలంబో పోర్టుకు 533 మి.డాలర్లు

Adani Colombo port: కోలంబో పోర్టును అదానీ గ్రూప్‌ సహా మరో రెండు భాగస్వామ్య సంస్థల కన్సార్టియం అభివృద్ధి చేస్తోంది. దీనికి నిధులు అందజేసేందుకు అమెరికాకు చెందిన డీఎఫ్‌సీ ముందుకు వచ్చింది.

Updated : 08 Nov 2023 14:14 IST

దిల్లీ: శ్రీలంక రాజధాని కొలంబోలో అదానీ గ్రూప్‌ (Adani Group) అభివృద్ధి చేస్తోన్న నౌకాశ్రయానికి రుణం అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది. అగ్రరాజ్యానికి చెందిన ఆర్థికాభివృద్ధి సంస్థ ‘ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (DFC)’ 533 మిలియన్‌ డాలర్లు ఇవ్వనుంది. భారత్‌లో అతిపెద్ద పోర్టుల నిర్వహణ సంస్థ ‘అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ (APSEZ)’, శ్రీలంకకు చెందిన జాన్‌ కీల్స్‌ హోల్డింగ్స్‌, శ్రీలంక పోర్ట్స్‌ అథారిటీ కలిసి ‘కొలంబో వెస్ట్‌ ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (CWIT)’ అనే కన్సార్షాయాన్ని ఏర్పాటు చేశాయి. సీడబ్ల్యూఐటీయే పోర్టు అభివృద్ధిని చేపడుతోంది. తాజాగా అమెరికా డీఎఫ్‌సీ ఈ సంస్థకే నిధులు అందజేయనుంది. ఇలా అదానీ గ్రూప్‌ చేపట్టిన ఓ ప్రాజెక్టుకు అమెరికా నిధులు అందజేయడం ఇదే తొలిసారి. దక్షిణాసియాలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడం కోసమే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు విశ్లేషిస్తుండడం గమనార్హం.

కొలంబో పోర్టు (Colombo Port)లోని డీప్‌వాటర్‌ షిప్పింగ్‌ కంటైనర్‌ టెర్మినల్‌ అభివృద్ధికి అమెరికా నిధులు అందజేస్తోందని ‘ఏపీసెజ్‌’ ప్రకటించింది. శ్రీలంకలో ప్రైవేట్‌ రంగ వృద్ధికి ఈ నిధులు దోహదం చేస్తాయని పేర్కొంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు కావాల్సిన విదేశీ మారక నిల్వలూ సమకూరుతాయని తెలిపింది. స్మార్ట్‌, గ్రీన్‌ పోర్టుల వంటి సుస్థిర మౌలిక వసతుల అభివృద్ధిలో అమెరికా, శ్రీలంక, భారత్‌ల సమన్వయం దీనితో మరింత ముందుకు సాగుతుందని అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో కీలక ప్రాజెక్టులకు డీఎఫ్‌సీ (DFC) ఆర్థిక పరిష్కారాలను అందజేస్తుంటుంది. ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, మౌలిక వసతులు, వ్యవసాయం, చిరు వ్యాపారాలు, ఆర్థిక సేవల రంగానికి కావాల్సిన ఆర్థిక సాయం చేస్తుంటుంది.

ఈ మూడు ఏమారుస్తాయ్‌.. మీ ఆన్‌లైన్‌ కొనుగోళ్ల ఖర్చును పెంచేస్తాయ్‌!

హిందూ మహాసముద్రంలో కొలంబో పోర్టు అతిపెద్ద, అత్యంత రద్దీ నౌకాశ్రయం. 2021 నుంచి ఈ పోర్టు సామర్థ్యంలో 90 శాతం వినియోగంలో ఉంది. తాజా ప్రాజెక్టు పూర్తయితే.. 1,400 మీటర్ల పొడవు, 20 మీటర్ల లోతు రేవు అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా 24,000 TEUల భారీ కంటైనర్‌ వెసెల్స్‌ సైతం ఆగేందుకు సదుపాయాలు ఉంటాయి. డీఎఫ్‌సీ నిధులను ఏపీసెజ్‌ సీఈఓ కరణ్‌ అదానీ స్వాగతించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీలంక వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో గణనీయ మార్పు వస్తుందని తెలిపారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తద్వారా శ్రీలంక వాణిజ్య, వ్యాపార అవకాశాలు ఊపందుకుంటాయని పేర్కొన్నారు. మరోవైపు డీఎఫ్‌సీ సీఈఓ స్కాట్‌ నాథన్‌ స్పందిస్తూ.. శ్రీలంక ప్రపంచ రవాణా మార్గాల్లో కీలక స్థానంలో ఉందని తెలిపారు. సగానికి పైగా కంటైనర్‌ నౌకలు ఈ దేశ జలాల ద్వారానే వెళుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము అందించబోయే నిధులు పోర్టు సామర్థ్యం విస్తరణకు దోహదం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తద్వారా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సైతం దన్నుగా ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని