Online Shopping: ఈ మూడు ఏమారుస్తాయ్‌.. మీ ఆన్‌లైన్‌ కొనుగోళ్ల ఖర్చును పెంచేస్తాయ్‌!

Online Shopping: ఆన్‌లైన్‌ కొనుగోళ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే, ఖర్చు అదుపులో ఉంచుకొని కొనుగోలు చేయడం చాలా ముఖ్యం. కంపెనీలు మనకు తెలియకుండానే బిల్లు పెంచేందుకు కొన్ని టెక్నిక్‌లను వాడుతుంటాయి. వాటి బారిన పడకుండా జాగ్రత్తపడాలి.

Updated : 08 Nov 2023 12:26 IST

Online Shopping | ఏదైనా ఆన్‌లైన్‌లో కొనేయడం ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. సౌకర్యంగా ఉండటంతో పాటు కొంత వరకు డబ్బులు కూడా ఆదా అవుతుండడం వల్ల చాలా మంది ఆన్‌లైన్‌ కొనుగోళ్లకే (Online Shopping) మొగ్గుచూపుతున్నారు. అయితే, ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లో కొనసాగుతున్న నేపథ్యంలో బడ్జెట్‌కు కట్టుబడి కొనుగోళ్లు చేయడం చాలా ముఖ్యం. ఆన్‌లైన్‌లో సులువుగా ఆర్డర్‌ చేసే అవకాశం ఉంది కదా అని కొంటూ పోవడం సరికాదు. ఇ-కామర్స్‌ సంస్థలు అనేక రకాల ఆఫర్లు, వివిధ రకాల టెక్నిక్‌లతో కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే, వాటి వలలో పడకుండా బాధ్యతతో ఖర్చు చేయడం ఎలాగో చూద్దాం..

బాస్కెట్‌ స్నీకింగ్‌..

దొంగచాటుగా బుట్టలో వేయడాన్నే బాస్కెట్‌ స్నీకింగ్‌ (Basket Sneaking) అంటారు. అంటే మనకు తెలియకుండానే మనం కొనుగోలు చేసిన వస్తువుల జాబితాలో కొన్ని అదనపు ఖర్చులను ఆన్‌లైన్‌ సంస్థలు యాడ్‌ చేస్తుంటాయి. మనం సరిగ్గా చూసుకోకపోతే.. వాటికి కూడా మనం డబ్బులు చెల్లించేస్తుంటాం. ఒకసారి లావాదేవీ జరిగిన తర్వాత వాటిని తిరిగి తీసుకోవడం అంత సులభం కాదు. ఉదాహరణకు ఆన్‌లైన్‌లో విమాన టికెట్‌ బుక్‌ చేసుకున్నప్పుడు మన అనుమతి లేకుండానే ఇన్సూరెన్స్‌ను యాడ్‌ చేస్తుంటారు. అలాగే కొన్ని రకాల వస్తువులు కొన్నప్పుడు మనకు తెలియకుండానే వివిధ రకాల విరాళాల పేరిట మన బిల్లులో అదనపు సొమ్మును చేర్చుతారు. అలాగే ప్రత్యేక సర్వీసు, వారెంటీ.. ఇలా మనం కోరుకోకున్నా వాటిని మన కొనుగోళ్లకు జత చేసి బిల్లును పెంచేస్తుంటారు. వీటిని మనం ముందు గమనించగలిగితేనే తొలగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

సబ్‌స్క్రిప్షన్‌తో వల..

ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు (Online Shopping) చేసేటప్పుడు ఇ-కామర్స్‌ సంస్థలు కొన్ని సబ్‌స్క్రిప్షన్లను ఆఫర్‌ చేస్తుంటాయి. వాటిని తీసుకోవడం వల్ల ఆకర్షణీయమైన ఆఫర్లు ఉంటాయని.. ప్రత్యేక సేవలు అందుతాయని చెబుతుంటాయి. పైగా సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియనూ చాలా సులభం చేసేస్తాయి. దీంతో చాలా మంది ఈ వలలో పడి సభ్యత్వం తీసేసుకుంటారు. ఇక ఎలాగూ సబ్‌స్క్రిప్షన్‌ ఉంది కదా అని.. మనకు తెలియకుండానే తరచూ ఏదో ఒకటి కొనుగోలు చేసేస్తుంటాం. పైగా ఆఫర్లు, డిస్కౌంట్లంటూ నోటిఫికేషన్లు పంపుతూ మనల్ని బుట్టలో వేసేస్తుంటాయి. అలాగే కనీసం ఇంత కొనుగోలు చేస్తే సబ్‌స్క్రిప్షన్‌ రెన్యువల్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా కొనుగోళ్లకు ఉసిగొల్పుతాయి. ఇదంతా గమనించి బయటకు రావాలంటే మాత్రం అంత సులభం కాదు. అన్‌సబ్‌స్క్రైబ్‌ ప్రక్రియను చాలా కఠినంగా ఉంచుతాయి. దీంతో చాలా మంది మధ్యలోనే ప్రక్రియను ఆపేస్తారు. ఫలితంగా సబ్‌స్క్రిప్షన్‌, కొనుగోళ్లు అలా కొనసాగుతూనే ఉంటాయి.

అదనపు ఛార్జీలు..

కొన్నిసార్లు ఒక వస్తువు వాస్తవ ధరను కంపెనీలు చూపించవు. తీరా దాన్ని మనం కొనుగోలు చేయబోయేటప్పుడు చూస్తే మరికొన్ని అదనపు ఛార్జీలు జత చేస్తారు. అది గమనించకపోతే మనకు తెలియకుండానే ఎక్కువ మొత్తం చెల్లించేస్తాం. సర్‌ఛార్జీలనీ, డెలివరీ ఛార్జీలనీ, కన్వీనియెన్స్‌ కాస్ట్‌ అనీ, హ్యాండ్లింగ్‌ ఛార్జీలనీ.. ఇలా రకరకాలుగా మన బిల్లును పెంచేస్తాయి. ఒక్కోసారి క్రెడిట్‌ కార్డు, ఆన్‌లైన్‌ చెల్లింపులపై కూడా అదనపు రుసుమును వసూలు చేస్తుంటాయి.

ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. ఎలాంటి వలలో పడకుండా.. కొనాలనుకున్నది.. మీకు అందుబాటు ధరలో కొనేసి వెంటనే బయటపడాలి. అలాగే ఏ వస్తువైనా కొనేటప్పుడు ఫైనల్‌ ధరను ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని