Air India: 6 రోజులకో కొత్త విమానం: ఎయిరిండియా CEO

Air India CEO: ఎయిరిండియా ఆర్డర్‌ పెట్టిన కొత్త విమానాలు సగటున ఆరు రోజులకొకటి చొప్పున అందుబాటులోకి రానుందని సీఈఓ తెలిపారు. ఇతర కంపెనీలతో పోటీ పడగలమని విశ్వాసం వ్యక్తంచేశారు. 

Published : 10 Nov 2023 20:36 IST

Air India | ఇంటర్నెట్ డెస్క్‌: టాటా గ్రూప్‌ నేతృత్వంలోని ఎయిరిండియా (Air India) భారీ ఎత్తున ఆర్డర్‌ పెట్టిన కొత్త విమానాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రాబోయే 18 నెలల్లో సగటున 6 రోజులకో కొత్త విమానం సేవలందించడానికి సిద్ధం కానుందని కంపెనీ సీఈఓ, ఎండీ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ పేర్కొన్నారు. ఎయిరిండియా కోసం టాటా గ్రూప్‌ 470 కొత్త విమానాలను ఈ ఏడాది మొదట్లో ఆర్డర్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసోసియేషన్‌ ఆఫ్‌ ఆసియా పసిఫిక్‌ ఎయిర్‌లైన్స్‌ అధ్యక్షుల సమావేశంలో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ మాట్లాడారు.

కొత్త విమానాలు అందుబాటులోకి రానున్నాయని, ఇప్పటికే చాలా మందిని రిక్రూట్‌ చేసుకుని వారికి శిక్షణ కూడా ఇస్తున్నామని విల్సన్‌ పేర్కొన్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పారు. ఎయిరిండియా నుంచి కస్టమర్లు ప్రధానంగా కోరుకునేది నమ్మకం, సమయపాలన అని, ఆ విషయాల్లో వారిని సంతృప్తి పరచడం సవాలుతో కూడుకున్నదేనని చెప్పారు. ఇప్పటికే గ్రౌండ్‌ అయిన విమానాలను చాలా వరకు పునరుద్ధరించామని, కొత్తగా రానున్న విమానాలను అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. ఇతర విమాన సర్వీసులతో పోటీపడగలమని, ఎయిరిండియా ట్రాఫిక్‌ను పెంచగలమన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.

ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్‌.. అకౌంట్లోకి PF వడ్డీ

కస్టమర్ల కోసం AIరిండియా

మరోవైపు కస్టమర్‌ సర్వీసుల కోసం ‘మహరాజా’ పేరిట జనరేటివ్‌ ఏఐ వర్చువల్‌ ఏజెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోనే తొలిసారి జనరేటివ్‌ ఏఐని తీసుకొచ్చిన విమానయాన సంస్థ తమదేనని పేర్కొంది. ప్రస్తుతం ఈ వర్చువల్‌ అసిస్టెంట్ రోజుకు సగటున 6 వేల మంది కస్టమర్ల సందేహాలను నివృత్తి చేస్తోందని, భవిష్యత్‌లో మరిన్ని ఫీచర్లు దీనికి జోడించనున్నట్లు పేర్కొంది. పైలట్‌ లాంచ్‌లో భాగంగా 2023 మార్చి నుంచి ఇప్పటి వరకు ఐదు లక్షల మంది కస్టమర్ల అవసరాలను తీర్చిందని, హిందీ, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌ భాషల్లో ఈ ఏజెంట్‌ సంభాషిస్తుందని తెలిపింది. ఫ్లైట్‌ స్టేటస్‌, బ్యాగేజీ అలవెన్సులు, ప్యాకేజీ నిబంధనలు, చెక్‌-ఇన్‌, ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ వంటి 1300 అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కోంటోందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని