Diesel ATM: డాటమ్‌.. ఈ ఏటీఎమ్‌ నుంచి డీజిల్‌ విత్‌డ్రా చేయొచ్చు!

ఇప్పటిదాకా.. ఏటీమ్‌ల నుంచి నగదు విత్‌డ్రా చేయడం గురించి విన్నాం. తర్వాత కొన్నిచోట్లు ఫుడ్‌ ఏటీమ్‌లు కూడా వచ్చాయి. తాజాగా పుణెకు చెందిన ఓ సంస్థ డీజిల్‌ ఏటీమ్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా లాజిస్టిక్ సంస్థల్లో డీజిల్‌ నిర్వహణ సులభతరం అవుతుందని చెబుతోంది. 

Updated : 07 Jun 2023 18:10 IST

పుణె: భారత దేశ స్థూల జాతీయోత్పత్తిలో లాజిస్టిక్‌ రంగం వాటా సుమారు 14.4 శాతం ఉంటుందని అంచనా. ఈ రంగంలో సరుకు రవాణా కోసం ఉపయోగించే వాటిలో డీజిల్ వాహనాలే (Diesel Vehicles) అధికం. పెద్ద లాజిస్టిక్ సంస్థలతో పోలిస్తే చిన్న, మధ్యతరహా సంస్థలే ఎక్కువగా డీజిల్‌ను వినియోగిస్తున్నట్లు అంచనా. దీంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న కొంత మంది వ్యక్తులు డీజిల్‌ కొనుగోలు, నిర్వహణలో మోసాలకు పాల్పడుతూ..   సంస్థల ఆదాయానికి గండికొడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డీజిల్‌  మోసాలకు చెక్‌ పెట్టేందుకు పుణెకు చెందిన రెపోస్‌ ఎనర్జీ (Repos Energy) సంస్థ ఒక సరికొత్త ఆవిష్కరణను పరిచయం చేసింది. డాటమ్‌ (DATUM) స్మార్ట్‌ డీజిల్‌ స్టోరేజ్‌ పేరుతో డీజిల్‌ ఏటీఎమ్‌ (Diesel ATM)లను రెపోస్‌ ఎనర్జీ తీసుకొచ్చింది. 

ఈ డీజిల్‌ ఏటీఎమ్‌లతో స్వతంత్ర రవాణా వ్యవస్థలను నిర్వహించే సంస్థలు డీజిల్‌ నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించవచ్చని రెపోస్‌ ఎనర్జీ చెబుతోంది. ‘‘డీజిల్‌ ఏటీఎమ్‌ల ఏర్పాటుతో సంస్థలు డీజిల్‌పై ఖర్చు చేసే మొత్తంలో ఏటా 10 శాతం ఆదా అవుతుంది. వీటిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకొని 24X7 డీజిల్‌ను పొందొచ్చు. ఇప్పటి వరకు వేర్వేరు రాష్ట్రాల్లో 300 డాటమ్‌లను ఇన్‌స్టాల్ చేశాం. ఒక్కో డాటమ్‌కు 4.8 మిలియన్‌ లీటర్ల డీజిల్‌ నిల్వ సామర్థ్యం ఉంటుంది. వీటి ద్వారా నెలకు ఆరు వేలకు పైగా వాహనాలకు డీజిల్‌ను అందించవచ్చు. డీజిల్‌ కోసం వాహనాలు వేర్వేరు ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల ఏటా నాలుగు లక్షల లీటర్ల డీజిల్‌ ఆదా అవడంతోపాటు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది’’ అని రెపోస్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు చేతన్‌ వలుంజ్‌ తెలిపారు. 

లాజిస్టిక్‌ సంస్థలకు డీజిల్‌ కొనుగోలును సులభతరం చేయడంతోపాటు, వృధాను అడ్డుకోవడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో వీటిని ఆవిష్కరించినట్లు చేతన్‌ వెల్లడించారు. డాటన్‌ స్మార్ట్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత, సంస్థలు రెసోస్‌ ఎనర్జీ యాప్‌ ద్వారా డీజిల్‌ ఆర్దర్‌ చేయొచ్చు. ఈ ఏటీఎమ్‌ నుంచి సంస్థలోని ఉద్యోగులు స్మార్ట్‌కార్డ్‌ల ద్వారా డీజిల్‌ను తమ వాహనాల్లో నింపుకోవచ్చని రెపోస్‌ ఎనర్జీ తెలిపింది. లాజిస్ట్‌ అవసరాల కోసం బ్రిక్స్‌ దేశాలు ఖర్చు చేస్తున్న మొత్తంలో భారత్‌ వాటా 13-14 శాతం ఉంటుందని అంచనా. అయితే, జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీలో భాగంగా 2027-28 ఆర్థిక సంవత్సరానికి ఈ మొత్తాన్ని13-14 శాతం నుంచి 7.5-8 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటువంటి లక్ష్యాలను చేరుకునేందుకు డాటమ్‌ స్మార్ట్‌ డీజిల్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌లు కీలక భూమిక పోషిస్తాయని సంస్థ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని