Adani Group: అంబుజాకు పునరుత్పాదక ఇంధనం.. అదానీ గ్రూప్‌ రూ.6 వేల కోట్ల వ్యయం!

Adani Group: అంబుజా సిమెంట్‌ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని క్రమంగా విస్తరించుకుంటోంది. అందుకు కావాల్సిన ఇంధన వనరుల్లో 60 శాతం హరిత మార్గాల్లో సమకూర్చుకోవాలని యోచిస్తోంది. 

Published : 18 Dec 2023 16:44 IST

Adani Group | దిల్లీ: అదానీ గ్రూప్‌ యాజమాన్యంలోని అంబుజా సిమెంట్స్‌ లిమిటెడ్‌ (Ambuja Cements Ltd) పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో రూ.6,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. 2025- 26 నాటికి ఈ మొత్తాన్ని వెచ్చించి 1,000 మెగావాట్ల సామర్థ్యాన్ని నెలకొల్పుతామని తెలిపింది.

గుజరాత్‌లో 600 మెగావాట్ల సౌర ఇంధనం, 150 మెగావాట్ల పవన విద్యుత్‌; రాజస్థాన్‌లో 250 మెగావాట్ల సౌర ఇంధన ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు అంబుజా సిమెంట్స్‌ (Ambuja Cements Ltd) తెలిపింది. ఈ కంపెనీ క్రమంగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకుంటోంది. ఏటా 140 మిలియన్‌ టన్నుల ఉత్పత్తిని అందుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, తమ ఇంధన అవసరాల్లో 60 శాతం హరిత మార్గంలో సమకూర్చుకోవాలని యోచిస్తోంది. అందులో భాగంగానే తాజా పెట్టుబడులను ప్రకటించింది.

వచ్చే దశాబ్ద కాలంలో హరిత ఇంధన ప్రాజెక్టుల్లో 100 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తామని అదానీ గ్రూప్‌ (Adani Group) గతంలో ప్రకటించింది. 2050 నాటికి గ్రూపులోని ఐదు కంపెనీలు తటస్థ కర్బన ఉద్గార స్థాయిని అందుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. వీటిలో అంబుజా సిమెంట్స్‌ సహా అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, ఏసీసీ ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని