ITR Filing: పన్ను రిటర్నులు.. ఈ పొరపాట్లు చేయొద్దు

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు చివరి తేదీ జులై 31. గడువు తేదీ సమీపిస్తున్నందున వీలైనంత తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేయడం మేలు. ఐటీఆర్‌ను పూర్తి చేసేటప్పుడు అసెసీలు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇవి దొర్లకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా.

Updated : 16 Jul 2022 09:53 IST

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు (ITR Filing) చేసేందుకు చివరి తేదీ జులై 31. గడువు తేదీ సమీపిస్తున్నందున వీలైనంత తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేయడం మేలు. ఐటీఆర్‌ (ITR)ను పూర్తి చేసేటప్పుడు అసెసీలు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇవి దొర్లకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా.

చాలామంది తాము ఆదాయపు పన్ను రిటర్నులు సరిగ్గానే పూర్తి చేశామనే భావనలో ఉంటారు. ఐటీ విభాగం నుంచి నోటీసు రావడం లేదా రిఫండు ఆలస్యమైనప్పుడే పొరపాటు దొర్లినట్లు గుర్తిస్తారు. ఆదాయపు పన్ను సెక్షన్ల గురించి సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం.

కొన్నిసార్లు పన్ను చెల్లింపుదారులకు తాము ఆశించిన రిఫండుకన్నా తక్కువ వస్తుంది. కొన్నిసార్లు డిమాండు నోటీసు రావచ్చు. దీనికి ప్రధాన కారణం.. ఫారం 26ఏఎస్‌లో పేర్కొన్న టీడీఎస్‌లు సరిగ్గా నమోదు చేయకపోవడమే. ఇప్పుడు జమైన పన్ను రిటర్నుల ఫారంలో ముందే నింపి ఉంటుంది. అయినప్పటికీ..ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవడం మంచిది.

షేర్ల లావాదేవీలు నిర్వహించినప్పుడు.. దీర్ఘకాలిక లాభాలు, స్వల్పకాలిక లాభాల మధ్య తేడా ఉంటుంది. స్వల్పకాలిక లాభాలపై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే దీర్ఘకాలిక లాభాలు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష దాటినప్పుడు.. ఆ పైన మొత్తానికి 10 శాతం పన్ను వర్తిస్తుంది. ఈ విషయాన్ని గుర్తించకుండా.. పన్ను రిటర్ను (ITR)ల్లో ఈ ఆదాయాలను నమోదు చేయకపోతే.. ఇబ్బందులు రావచ్చు.

రిటర్నులు సరిగ్గా దాఖలు చేసినా కొన్నిసార్లు రిఫండు రాకపోయే ఆస్కారం ఉంది. దీనికి కారణం బ్యాంకు వివరాల్లో పొరపాటు ఉండటం. పాన్‌, ఆధార్‌ కార్డు అనుసంధానం అయినప్పుడే రిటర్నులను దాఖలు చేయడానికి వీలుంటుంది. ఈ వివరాలు బ్యాంకు ఖాతాలో ఉన్న వివరాలతోనూ సరిపోవాలి. అప్పుడే రిఫండు వేగంగా అందుతుంది.

సరైన ఫారాన్ని ఎంచుకోకపోతే.. రిటర్నులు దాఖలు చేసినా.. ఆదాయపు పన్ను శాఖ దాన్ని అధీకృతం చేయకపోవచ్చు. కొన్నిసార్లు ఆ రిటర్నులను తిరస్కరిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒకటికి మించి ఇళ్లు ఉన్నా, రూ.50లక్షలకు మించి ఆదాయం ఉన్నా ఐటీఆర్‌-1లో దాఖలు చేయడానికి వీలుండదు.

కొన్నిసార్లు ఫారం-16లో అన్ని మినహాయింపులూ పేర్కొనకపోవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో మీరు చేసిన పన్ను మినహాయింపు పెట్టుబడులన్నీ ఇందులో నమోదయ్యాయా చూసుకోండి. లేకపోతే ఆయా మినహాయింపులను ఐటీఆర్‌లో తెలియజేయండి. ఈ సమయంలో సరైన సెక్షన్ల కింద వాటిని పేర్కొనండి.

✍ దాదాపు అందరికీ బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉంటుంది. అందులో ఉండే సొమ్ముపై కొంత వడ్డీ వస్తుంటుంది. అయితే, చాలా మంది ఈ వడ్డీని ఐటీఆర్‌లో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఈ ఆదాయాన్ని కూడా తప్పనిసరిగా ఐటీఆర్‌లో చూపించాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80 టీటీఏ ప్రకారం.. సేవింగ్స్ ఖాతాపై లభించే వడ్డీలో రూ.10,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్స్‌కైతే సెక్షన్‌ 80టీటీబీ కింద ఈ పరిమితి రూ.50,000 వరకు ఉంటుంది.

✍ ప‌న్ను చెల్లింపుదారుల‌కు రెండు ప‌న్ను విధానాలు అందుబాటులో ఉన్నాయి. రెండింటిలో ఒకదాన్ని ఎంచుకుని ప‌న్ను దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. ఎంపిక‌లో గంద‌ర‌గోళం వద్దు. పాత విధానంలో శ్లాబ్‌ల‌ సంఖ్య త‌క్కువ‌. అయితే కొన్ని మిన‌హాయంపుల‌ను పొందే వీలుంది. కొత్త విధానంలో మిన‌హాయింపులు వ‌ర్తించ‌వు.

పాస్‌వర్డ్‌ మర్చిపోతే..

ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు www.incometax.gov.in అనే వెబ్‌సైటులో మీ పాన్‌ (యూజర్‌ఐడీ), పాస్‌వర్డ్‌ ఆధారంగా లాగిన్‌ కావాలి. ఏడాది తర్వాత లాగిన్‌ కావడంతో చాలామంది పాస్‌వర్డ్‌ను మర్చిపోయే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు సులభంగానే కొత్త పాస్‌వర్డ్‌ను సిద్ధం చేసుకోవచ్చు. లాగిన్‌పేజీలో ముందుగా పాన్‌ వివరాలు ఇచ్చిన తర్వాత, ‘ఫర్గాట్‌ పాస్‌వర్డ్‌’ను ఎంపిక చేసుకోవాలి. ఇందులో ఆధార్‌ ఓటీపీ, డిజిటల్‌ సిగ్నేచర్‌ (డీఎస్‌సీ), ఇ-ఫైలింగ్‌ ఓటీపీలలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. వీటన్నింటిలో ఆధార్‌ ఓటీపీ ద్వారా పాస్‌వర్డ్‌ను మార్చుకోవడం చాలా సులభం. రిటర్నులు దాఖలు చేసేటప్పుడు మీ వ్యక్తిగత వివరాలను ఒకసారి సరిచూసుకోండి. మొబైల్‌, ఇ-మెయిల్‌ మీకు సంబంధించనవేనా అనేది తనిఖీ చేసుకోండి. మార్పులుంటే వాటిని అప్‌డేట్‌ చేసుకోవడం మర్చిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని