BLS E-Services IPO: బీఎల్‌ఎస్‌ ఈ-సర్వీసెస్‌ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే!

BLS E-Services IPO: రూ.310.91 కోట్ల సమీకరణ లక్ష్యంతో బీఎల్‌ఎస్‌ ఈ-సర్వీసెస్‌ ఐపీఓ ప్రారంభమైంది.

Updated : 30 Jan 2024 11:54 IST

BLS E-Services IPO | ముంబయి: డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ బీఎల్‌ఎస్‌ ఈ-సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఐపీఓ (BLS E-Services IPO) మంగళవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 1 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.129-135గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.310.91 కోట్లు సమీకరించనుంది. మొత్తం 2.30 కోట్ల కొత్త షేర్లను ఐపీఓ (IPO)లో జారీ చేస్తోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఎలాంటి షేర్లను విక్రయించడం లేదు. మదుపర్లు రూ.14,580తో కనీసం 108 షేర్లకు (ఒక లాట్‌) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఐపీఓ (BLS E-Services IPO) ద్వారా సమీకరించిన నిధులతో తమ సాంకేతిక వ్యవస్థల బలోపేతం, కొత్త ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న వాటి అనుసంధానం వంటి కార్యకలాపాలు చేపడతామని బీఎల్‌ఎస్‌ ఈ-సర్వీసెస్‌ తెలిపింది. బీఎల్‌ఎస్‌ స్టోర్ల ఏర్పాటు, ఇతర వ్యాపారాల కొనుగోళ్లు, కార్పొరేట్‌ అవసరాలకూ కొన్ని నిధులు వాడతామని పేర్కొంది. ఇప్పటికే యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.126 కోట్లు సమీకరించింది. ఒక్కో షేరు రూ.135 చొప్పున 93.27 లక్షల షేర్లను 10 ఫండ్లకు కేటాయించింది.

బీఎల్‌ఎస్‌ ఈ-సర్వీసెస్‌ను 2016లో స్థాపించారు. ఈ కంపెనీ వీసా, పాస్‌పోర్ట్‌, కాన్సులర్‌ సహా ఇతర పౌర సేవలను అందిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భారత్‌లో కొన్ని ప్రధాన బ్యాంకులకు బిజినెస్‌ కరెస్పాండెన్స్‌ సర్వీసులను అందిస్తోంది. 2022-23లో కంపెనీ ఆదాయం రూ.243 కోట్లు, లాభం రూ.20.33 కోట్లు, ఆస్తుల విలువ రూ.179.47 కోట్లుగా నమోదైంది.

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • ఐపీఓ తేదీలు: జనవరి 30- ఫిబ్రవరి 01
  • ధరల శ్రేణి: రూ.129-135
  • షేరు ముఖ విలువ: రూ.10
  • కనీసం కొనాల్సిన షేర్ల సంఖ్య: 108 (ఒక లాట్‌)
  • కనీస పెట్టుబడి: రూ.14,580
  • అలాట్‌మెంట్ తేదీ: ఫిబ్రవరి 02
  • రిఫండ్‌ తేదీ: ఫిబ్రవరి 05
  • డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ: ఫిబ్రవరి 05
  • లిస్టింగ్‌ తేదీ: ఫిబ్రవరి 06

(గమనిక: ఐపీఓలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. పై వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. ఐపీఓలో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని