Demat: 10.4 కోట్లకు డీమ్యాట్‌ ఖాతాలు.. తగ్గుతున్న కొత్త అకౌంట్లు!

Demat: డీమ్యాట్‌ కొత్త ఖాతాల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. అయితే వార్షిక ప్రాతిపదికన అక్టోబరులో ఖాతాల సంఖ్య 41 శాతం పెరిగాయి.

Published : 20 Nov 2022 11:56 IST

దిల్లీ: అక్టోబరులో డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 41 శాతం పెరిగి 10.4 కోట్లకు చేరాయి. ఈక్విటీ మార్కెట్లలో ఆకర్షణీయ లాభాల నేపథ్యంలోనే ఖాతాల సంఖ్య పెరుగుతోందని మోతీలాల్‌ ఓస్వల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తెలిపింది. అయితే, కొత్త ఖాతాల పెరుగుదల రేటు మాత్రం కొన్ని నెలల క్రితంలో పోలిస్తే తగ్గినట్లు పేర్కొంది.

ఆగస్టు నుంచి కొత్త ఖాతాల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోందని ఓస్వల్‌ నివేదిక వెల్లడించింది. ఆగస్టులో 26 లక్షల ఖాతాలు తెరవగా.. సెప్టెంబరులో 20 లక్షలు, అక్టోబరు నాటికి 18 లక్షలకు తగ్గాయని తెలిపింది. గత ఏడాది అక్టోబరులో కొత్త ఖాతాల సంఖ్య 36 లక్షలుగా ఉండడం గమనార్హం. 2022 ఆరంభం నుంచి మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో చలిస్తున్న విషయాన్ని నివేదిక గుర్తుచేసింది. ఈ కారణంగానే కొత్త డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోందని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఐపీఓకి వస్తున్న కంపెనీల సంఖ్య తగ్గడం కూడా ఓ కారణమని మోతీలాల్‌ ఓస్వల్‌ సీనియర్‌ గ్రూప్‌ ఉపాధ్యక్షుడు నితిన్‌ అగర్వాల్‌ తెలిపారు.

ప్రపంచవ్యాప్తగా ద్రవ్యోల్బణం, రేట్ల పెంపు, ఆర్థికమాంద్యం వంటి అనిశ్చితి పరిస్థితులు కూడా మదుపర్లలో ఆందోళనకు కారణమయ్యాయని అగర్వాల్‌ తెలిపారు. క్రితం నెలతో పోల్చినా ఈ అక్టోబరులో కొత్త డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య తగ్గడానికి పండగ సీజన్‌ కూడా ఓ కారణమై ఉంటుందని పేర్కొన్నారు. గత నెలలో కేవలం 18 పనిదినాలు మాత్రమే ఉన్నాయని గుర్తుచేశారు. ఈక్విటీ మార్కెట్లు తిరిగి బలం పుంజుకుంటే కచ్చితంగా కొత్త ఖాతాల సంఖ్య మళ్లీ పెరుగుతుందని అగర్వాల్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని