DoT: అలాంటి ఫోన్‌ కాల్స్‌ మీకు వస్తున్నాయా..? డాట్‌ కీలక సూచన

యూజర్ల వ్యక్తిగత వివరాలు సేకరించేందుకు సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. దీనిపై యూజర్లకు టెలికామ్‌ విభాగం కీలక సూచన చేసింది. 

Published : 12 Nov 2023 12:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ యూజర్ల వ్యక్తిగత వివరాలు సేకరించేందుకు సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. కొద్ది రోజులుగా కొందరు సైబర్‌ మోసగాళ్లు వినియోగదారులకు ఫోన్‌ చేసి.. మరో రెండు గంటల్లో టెలికామ్‌ విభాగం (DoT) మీ సిమ్‌ కార్డ్‌  సర్వీస్‌ను నిలిపివేస్తుందని.. అలా జరగకూడదంటే.. తాము కోరిన వివరాలు చెప్పాలని మోసాలకు పాల్పడుతున్నారు. వారి మాటలు నమ్మిన కొందరు అమాయక యూజర్లు.. వ్యక్తిగత వివరాలు చెప్పడంతో.. వాటితో సైబర్‌ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని డాట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు మొబైల్‌ యూజర్లకు కీలక సూచన చేసింది. 

‘‘డాట్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని.. రెండు గంటల్లో సిమ్‌ కార్డ్‌ సర్వీస్‌ ఆగిపోతుందని వచ్చే ఫోన్‌ కాల్స్‌ను యూజర్లు నమ్మొద్దు. సిమ్‌ కార్డ్‌ సర్వీస్‌లను డాట్ నిలిపివేయదు. వాటికి సంబంధించి యూజర్లకు ఎలాంటి ఫోన్లు చేయదు. ఒకవేళ ఎవరైనా సిమ్‌ కార్డ్‌ సేవలు ఆగిపోతాయని మీకు ఫోన్‌ చేస్తే.. వెంటనే మీ నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ను సంప్రదించండి. అలాగే, యూజర్ల వ్యక్తిగత వివరాలు డాట్ సేకరించదు. సిమ్‌ కార్డ్‌ సర్వీస్‌లకు సంబంధించి వచ్చే మోసపూరిత ఫోన్‌ కాల్స్‌ పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలి’’ అని డాట్ తెలిపింది. మోసపూరిత ఫోన్‌కాల్స్‌ గురించి నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (NCCRP)కి ఫిర్యాదు చేయాలని డాట్ సూచించింది. ఇలాంటి ఫోన్‌కాల్స్‌ను అరికట్టేందుకు దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని