Entero Healthcare IPO: 9న ఎంటెరో హెల్త్‌కేర్‌ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.1,195-1,258

Entero Healthcare IPO: రూ.1,600 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఎంటెరో హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ ఐపీఓకి వస్తోంది.

Published : 06 Feb 2024 14:40 IST

Entero Healthcare IPO | హరియాణా కేంద్రంగా పనిస్తున్న ఎంటెరో హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ ఐపీఓ (Entero Healthcare IPO) ఫిబ్రవరి 9-13 మధ్య రానుంది. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.1,195-1,258గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.1,600 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.1,000 కోట్ల కొత్త షేర్లతో పాటు రూ.600 కోట్లు విలువ చేసే షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద జారీ చేయనుంది.

రూ.8 కోట్లు విలువ చేసే షేర్లను ఎంటెరో హెల్త్‌కేర్‌ ప్రత్యేకంగా తమ ఉద్యోగుల కోసం రిజర్వ్‌ చేసింది. వారికి ఒక్కో షేరుపై రూ.119 రాయితీ ఇవ్వనుంది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల (QIBs)కు 75 శాతం, సంస్థాగతేతర మదుపర్ల (NIIs)కు 15 శాతం, రిటైల్‌ మదుపర్లకు 10 శాతం షేర్లను కేటాయించారు. రూ.13,838తో కనీసం 11 షేర్లకు (ఒక లాట్‌) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐపీఓలో (IPO) సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, దీర్ఘకాల మూలధన అవసరాలు, ఇతర కంపెనీల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది.

ఎంటెరో హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ను 2018లో స్థాపించారు. ఈ కంపెనీ భారత్‌లో ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను పంపిణీ చేస్తుంది. ఫార్మసీలు, ఆస్పత్రులు, క్లినిక్‌లు ఈ కంపెనీ కస్టమర్ల జాబితాలో ఉన్నాయి. 2023లో 81,400 రిటైల్‌ కస్టమర్లు, 3,400 ఆసుపత్రులకు సేవలందించింది. దేశవ్యాప్తంగా 37 నగరాల్లో 73 పంపిణీ కేంద్రాలున్నాయి. 2023 మార్చి 31 నాటికి కంపెనీలో 3,014 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని