సంక్షిప్త వార్తలు (3)

ఐడీబీఐ బ్యాంక్‌ నేతృత్వంలోని బ్యాంకుల బృందం నుంచి తీసుకున్న రూ.4,760 కోట్ల రుణంలో అధిక భాగాన్ని దారి మళ్లించారనే ఆరోపణలపై టెలికాం మౌలిక వసతుల సేవల కంపెనీ జీటీఎల్‌ లిమిటెడ్‌ మీద సీబీఐ కేసు నమోదు చేసింది.

Updated : 27 Jan 2023 05:40 IST

రూ.4,760 కోట్ల మోసంలో జీటీఎల్‌ డైరెక్టర్లపై సీబీఐ కేసు

దిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ నేతృత్వంలోని బ్యాంకుల బృందం నుంచి తీసుకున్న రూ.4,760 కోట్ల రుణంలో అధిక భాగాన్ని దారి మళ్లించారనే ఆరోపణలపై టెలికాం మౌలిక వసతుల సేవల కంపెనీ జీటీఎల్‌ లిమిటెడ్‌ మీద సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం కంపెనీకి చెందిన డైరెక్టర్లు, కొందరు గుర్తు తెలియని ప్రభుత్వ అధికారులు, విక్రయదార్లపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. 24 బ్యాంకుల బృందం నుంచి రూ.4,760 కోట్ల రుణాలను తీసుకున్న జీటీఎల్‌, అందులో అధిక మొత్తం నిధులను డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించింది.  ఈ మోసపూరిత వ్యవహారాన్ని జరిపేందుకు, జీటీఎల్‌కు అనుకూలంగా వివిధ విక్రయ సంస్థలను సృష్టించారని పేర్కొంది. 2011లో జీటీఎల్‌ లిమిటెడ్‌పై ప్రత్యేక ఆడిట్‌ను నిర్వహించిన ఐడీబీఐ బ్యాంక్‌.. ఆ సంస్థ విక్రయదార్లతో నిర్వహించిన లావాదేవీలపై సందేహాలను లేవనెత్తింది. జీటీఎల్‌ లిమిటెడ్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.650 కోట్లు; బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.467 కోట్లు, కెనరా బ్యాంక్‌ రూ.412 కోట్ల మేర రుణాలిచ్చాయి.


టయోటా సీఈఓగా వైదొలగనున్న అకియో టయోడా

టోక్యో: జపాన్‌కు చెందిన వాహన దిగ్గజ సంస్థ, టయోటా మోటార్‌ కార్పొరేషన్‌ సీఈఓ, అధ్యక్షుడు అకియో టయోడా ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ఇకపై ఆయన కంపెనీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం కంపెనీ చీఫ్‌ బ్రాండింగ్‌ అధికారిగా ఉన్న కోజి సాటో (53), సీఈఓగా వ్యవహరించనున్నారు. విద్యుత్‌, ఫాస్ట్‌ కార్లపై టయోడా, సాటోల ప్రేమను చూపిస్తూ ప్రచార వీడియోను మాత్రం సిద్ధం చేసింది. టయోటా గ్రూప్‌నకు చెందిన లెక్సస్‌ బ్రాండ్‌ కార్యకలాపాలు, మోటార్‌ రేసింగ్‌ బాధ్యతలను సాటో నిర్వహిస్తున్నారు. టయోటా వ్యవస్థాపకుడు కిచిరో టయోడా మనవడు అయిన అకియో 2009లో టయోటా సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న తకెషి ఉచియమడా స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారు.


నేటి బోర్డు సమావేశాలు

బజాజ్‌ ఫైనాన్స్‌, వేదాంతా, గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌, రామ్‌కో ఇండస్ట్రీస్‌, తాజ్‌ జీవీకే, విమ్టా ల్యాబ్స్‌, ఆర్తి డ్రగ్స్‌

మార్కెట్లు పనిచేయలేదు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయలేదు.. బులియన్‌, ఫారెక్స్‌, కమొడిటీ మార్కెట్లకూ సెలవే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని