లాభాలు వస్తున్నాయా?

స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో వృద్ధి కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం దీర్ఘకాలిక లక్ష్యాలతో పెట్టుబడులు ప్రారంభించిన వారికి మంచి లాభాలే కనిపిస్తున్నాయి.

Published : 05 Jan 2024 00:02 IST

స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో వృద్ధి కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం దీర్ఘకాలిక లక్ష్యాలతో పెట్టుబడులు ప్రారంభించిన వారికి మంచి లాభాలే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, మారుతున్న పరిస్థితుల  నేపథ్యంలో ఒకసారి మీ పెట్టుబడులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వచ్చిన రాబడిని కాపాడుకోవచ్చు.

పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యంగా ఉండాలి. నష్టభయం తక్కువగా ఉంటూ, అధిక లాభాలను సాధించాలంటే ఈ వైవిధ్యం తప్పనిసరి. స్టాక్‌ మార్కెట్‌, ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆధారంగా మన ఆర్థిక లక్ష్యాల సాధనకు అనువైన పథకాలను ఎంచుకోవాలి.

లక్ష్యాలను అర్థం చేసుకోవాలి: ముందుగా సాధించాలని అనుకున్న లక్ష్యాలను అర్థం చేసుకోండి. వాటిని ఎంత కాలంలో చేరుకోవాలి, నష్టభయం ఏ మేరకు భరించగలరు అనేది తెలుసు కోవాలి. ఇద్దరి ఆర్థిక ప్రణాళికలు ఒకేలా ఉండవు. కానీ, అవసరాలు మాత్రం దాదాపుగా అవే ఉంటాయి. కాబట్టి, ఆదాయాలను బట్టి, వ్యూహాలను మార్చుకుంటూ ఉండాలి.  

వైవిధ్యంగా: కొన్ని పెట్టుబడుల్లో నష్టభయం అధికంగా ఉంటుంది. కానీ, అధిక రాబడులను అందిస్తాయి. మరికొన్ని సురక్షితంగా ఉంటూ తక్కువ రాబడిని ఇస్తాయి. పెట్టుబడుల జాబితాను ఒకసారి నిశితంగా పరిశీలించండి. మీ వయసు, ఆదాయం, ఉన్న వ్యవధిని బట్టి పథకాల ఎంపిక ఉండాలి.

ఎంత వరకూ: ఈక్విటీల్లో ఎంత మేరకు పెట్టుబడులు ఉండాలి అనేదానికి నిర్ణీత సూత్రం ఏదీ లేకపోయినా.. 100 నుంచి మీ వయసును తీసేస్తే వచ్చే జవాబు.. మీ ఈక్విటీ పెట్టుబడుల శాతంగా ఉండాలి. ఉదాహరణకు మీ వయసు 30 అయితే.. మొత్తం పెట్టుబడుల్లో 70 శాతం వరకూ ఈక్విటీ పెట్టుబడులకు కేటాయించాలి.

ఎంతకాలం: దీర్ఘకాలిక పెట్టుబడులను కనీసం ఆరు నెలలు లేదా ఏడాదికోసారి ఒకసారి నిశితంగా పరిశీలించాలి. మార్కెట్లో ఎప్పుడూ ఏదో ఒక సంఘటన కనిపిస్తూనే ఉంటుంది. మీ పెట్టుబడులు స్టాక్‌ మార్కెట్‌ ఆధారిత పథకాల్లో ఉంటే.. సూచీల హెచ్చుతగ్గులకు స్వల్ప కాలంలో ప్రభావితం అవుతుంటాయి. దీర్ఘకాలంలో సగటు ప్రయోజనం లభిస్తుంది. కాబట్టి, మీరు అనుకున్న లక్ష్యం సాధించే వరకూ వాటిని కొనసాగించాలి.  

ఏం చూడాలి: జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు పెట్టుబడుల స్వరూపాన్ని మారుస్తుంటాయి. వివాహం, పిల్లలు, ఉద్యోగంలో మార్పు, అనుకోని ప్రమాదాల్లాంటివి మన ఆర్థిక లక్ష్యాలను మారుస్తూ ఉంటాయి. అందుకు అనుగుణంగా మన పెట్టుబడులు ఉన్నాయా చూసుకోవాలి. పదవీ విరమణ నాటికి రూ.కోటి నిధి ఉండాలంటే.. పెట్టుబడులు సురక్షిత పథకాల్లోనే ఉంటే దాన్ని సాధించడం కష్టం. కాస్త నష్టభయం ఉన్న పథకాల్లోకి వాటిని మార్చాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న రాబడి, భవిష్యత్‌లో వచ్చే ఆదాయం ఇవన్నీ కలిపి చూసుకొని, పెట్టుబడి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తక్కువ రాబడి పథకాల్లో పెట్టుబడులు ఉంటే, వాటిని మార్చేందుకు ప్రయత్నించాలి.

రాబడి మాటేమిటి?: మార్కెట్‌ పనితీరు బాగున్నప్పుడు మీ పెట్టుబడి పథకాలపై అందుతున్న రాబడీ అందుకు అనుగుణంగా ఉండాలి. అందుకు భిన్నంగా ఉందనుకోండి.. ఆ పథకాలపై కాస్త దృష్టి సారించాల్సిందే. లేకపోతే అవి మరింత దిగజారి, మనకు నష్టాలను మిగులుస్తాయి. మార్కెట్‌లో ఇప్పటికే రెండు మూడు దశలు దాటిన పెట్టుబడుల నుంచి సానుకూల ప్రతిఫలాన్నే ఆశించాలి.

అన్ని రకాలుగా: ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్లు, సురక్షిత పథకాలు, బంగారం, స్థిరాస్తి ఇలా విభిన్న పెట్టుబడి తరగతులను ఎంచుకోవాలి. ఒక నిష్పత్తిని అనుకొని, దానికి అనుగుణంగా వాటిని ఎప్పటికప్పుడు సమతౌల్యం చేస్తూ ఉండాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని