ఆర్థిక స్వేచ్ఛ సాధించేద్దాం

భారతీయ మహిళలు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తూ.. మెరుగైన భవిష్యత్తును సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ప్రజల జీవితాలపైనా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు.

Updated : 08 Mar 2024 01:03 IST

భారతీయ మహిళలు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తూ.. మెరుగైన భవిష్యత్తును సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా, ప్రజల జీవితాలపైనా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. అదే సమయంలో వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛను సాధించేందుకు గతంలో ఉన్న అడ్డంకులూ అధిగమిస్తున్నారు. మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలతో ‘సిరి’ అందిస్తున్న ప్రత్యేక కథనం...


సొంత ప్రణాళికలతో...

టా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తమ ఆర్థిక వ్యవహారాలపై పట్టు సాధించాలనే సూచనలు ఎన్నో వింటుంటాం. అంటే.. మహిళలకు డబ్బును సమర్థంగా నిర్వహించడం తెలియదనా? ఇది ఎంతమాత్రం నిజం కాదు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో మహిళలు సొంత ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవడం చాలా కీలకం. వీటిని సాధించే దిశగా కొన్ని ప్రయత్నాలు సాగాలి.

  • మహిళలు తమ సొంత ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకోవాలి. తమ అవసరాలు, ప్రాధాన్యతలు తమ కంటే ఎవరూ మెరుగ్గా అర్థం చేసుకోలేరనే విషయాన్ని గమనించాలి. ఆర్థిక విషయాలను నిర్వహించే సామర్థ్యం లేదు అనే భావన నుంచి బయటకు రావాలి. వ్యూహాత్మక ఆర్థిక ప్రణాళికలను రచించుకోవాలి. ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారంలో ఉన్నా, గృహిణులుగా ఉన్నా తమ సొంత జీవిత లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఈ ప్రణాళిక తోడ్పడాలి. దీనికోసం కొంచెం సమయం కేటాయించాలి. మీ ఆర్థిక వనరులను సొంతంగా పెట్టుబడి పెట్టేందుకు అవసరమైన అవగాహన పెంచుకోవాలి.
  • ఆర్థిక స్వేచ్ఛ ఉన్నప్పటికీ 59 శాతం మంది మహిళలు సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కుటుంబ శ్రేయస్సు కోసం వారు రాజీ పడుతుంటారు. డబ్బును తెలివిగా,
  • సమర్థంగా నిర్వహించడం ద్వారా మీ ఆర్థిక విలువను కాపాడుకోవాలి.
  • మహిళలు కుటుంబ నిర్వహణ కోసం ఎన్నో ఖర్చులను నిర్వహించే బాధ్యత తీసుకుంటారు. ఇదే విధానాన్ని మీ పెట్టుబడులకూ వర్తింపజేయండి. నగదు, బంగారం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు మించి ఆలోచించండి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలు ఇప్పుడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోండి. మ్యూచువల్‌ ఫండ్ల నుంచి షేర్ల వరకూ మీ పెట్టుబడులు విస్తరించాలి.
  • కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో చురుకైన పాత్ర పోషించండి. ఆర్థిక లక్ష్యాలను సాధించేలా పెట్టుబడులను ఎంచుకోవడంలాంటివి మీరు ఎంతో సమర్థంగా చేయగలరు. ఆర్థిక విశ్వాసం పెరగడం వల్ల జీవితంపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. వ్యక్తిగత సాధికారతకు దోహదం చేస్తుంది.
  • ఆర్థిక విషయాల్లో పట్టు సాధించేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలున్నాయి. వాటిపై కాస్త దృష్టి పెడితే చాలు. మీ ఆదాయాన్ని, అవసరాలను విశ్లేషించుకోండి. అవసరమైతే నిపుణుల సహాయాన్ని తీసుకోండి. ఆర్థిక స్వేచ్ఛను మనమే సాధించుకోవాలి.

విశాఖ ఆర్‌ఎం, ఎండీ-సీఈఓ, ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌


ఈ పాలసీలుండాలి..

హిళలు తమ ఆర్థిక రక్షణ కోసం కొన్ని రకాల సాధారణ బీమా పాలసీలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిలో ముఖ్యంగా...

ఆరోగ్య బీమా: కుటుంబం అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. కొన్ని బీమా పాలసీలు ప్రసూతి ఖర్చులను చెల్లిస్తాయి. కొత్తగా వివాహం అయిన వారు ఇలాంటి పాలసీలను పరిశీలించాలి. డెలివరీకి 90 రోజుల ముందు నుంచీ, ఆ తర్వాత 90 రోజుల వరకూ ఏదైనా చికిత్స తీసుకుంటే ఆ ఖర్చులను పాలసీలు చెల్లిస్తాయి.

తీవ్ర వ్యాధులకు: కొన్ని జీవన శైలి, తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు ఆర్థిక రక్షణ కల్పించేలా పాలసీలు తీసుకోవాలి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌ లాంటివి మహిళలకు మాత్రమే వస్తాయి. ఇలాంటి వ్యాధులను గుర్తించినప్పుడు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలు ఒకేసారి 100 శాతం పాలసీ విలువను చెల్లిస్తాయి. అనారోగ్యం వల్ల ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో 3 నెలల జీతాన్ని అందించే ఏర్పాటూ ఇందులో ఉంటుంది. పిల్లల చదువులకూ అవసరమైన ఆర్థిక సహాయాన్నిచ్చేలా ‘చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌ బోనస్‌’లాంటివి తోడుంటాయి.

సైబర్‌ బీమా: డిజిటల్‌ ప్రపంచంలో సైబర్‌ నేరాలు పెరిగిపోయాయి. వీటి బారినపడి, ఆర్థికంగా నష్టపోయినప్పుడు రక్షణ కల్పించేలా సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తప్పనిసరి. ముఖ్యంగా మహిళలు ఈ పాలసీని తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయొద్దు.

వాహన బీమా: మీకు వాహనం ఉంటే.. దానికి కచ్చితంగా వాహన బీమా ఉండేలా చూసుకోండి. కనీసం థర్డ్‌ పార్టీ బీమా పాలసీ లేకుండా వాహనాన్ని నడపకూడదు. పూర్తి స్థాయి వాహన బీమా తీసుకోవడం ఎప్పుడూ మంచిది.

వ్యక్తిగత ప్రమాద పాలసీ: ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఈ నేపథ్యంలో వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ఒక తప్పనిసరి అవసరం. ఉద్యోగం చేసే వారు దీన్ని మర్చిపోవద్దు. చాలా తక్కువ ప్రీమియంతో ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది.

టీఏ రామలింగం, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌


జీవిత బీమాతో..

హిళలకు సంబంధించిన ఆర్థిక విషయాల్లో తండ్రి, జీవిత భాగస్వామి పాత్ర అధికంగా ఉండటం చూస్తుంటాం. దీని నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. జీవిత బీమా పాలసీలు పురుషులకే అనే అపోహ చాలామందిలో ఉంటుంది. ఆర్జించే వ్యక్తులందరికీ బీమా పాలసీ ఉండాల్సిందే. మహిళలు తీసుకునే బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియంలో రాయితీలూ ఉంటాయి. జీవిత భాగస్వామి తీసుకున్న పాలసీల్లో మీ పేరు నామినీగా ఉండేలా చూసుకోండి. గృహిణిగా ఉన్నా.. కుటుంబంలో ఆర్జించే వ్యక్తి బీమా పాలసీలను నిర్లక్ష్యం చేయకుండా మీరు బాధ్యత తీసుకోవాలి. ఒంటరి మహిళలు తమపై ఆధారపడిన వారున్నప్పుడు తప్పనిసరిగా బీమా పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

శ్రీనిధి షమా రావు, చీఫ్‌ స్ట్రాటెజీ ఆఫీసర్‌, ఏగాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌


ఇలా సిద్ధం అవ్వండి..

ప్పుడు ఎలాంటి సందర్భం వచ్చినా మహిళలు ఆర్థికంగా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.. మరి, అందుకోసం ఏం చేయాలంటే..

  • చిన్న చిన్న విషయాలతో ఆర్థిక ప్రణాళికలను ప్రారంభించాలి. ముందుగా కనీసం 3-6 నెలల ఖర్చులకు సరిపడా మొత్తం ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
  • మీరు ఉద్యోగం చేస్తుంటే.. మీ వేతన ఖాతా ఉన్న బ్యాంకు నుంచి క్రెడిట్‌ కార్డు తీసుకోండి. ఏదైనా కొనుగోలు చేసినప్పుడు రుణంతో కొనుగోలు చేయండి. వీటిని క్రమశిక్షణతో చెల్లించాలి. అప్పుడు మీకు క్రెడిట్‌ స్కోరు పెరుగుతుంది.
  • సొంతంగా తామూ ఒక ఇల్లు కొనాలనే ఆలోచన మహిళల్లో పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇంటి కోసం ముందుగా 30-50 శాతం వరకూ పెట్టుబడిని సమకూర్చుకోండి. మిగతాది రుణం తీసుకోవచ్చు.
  • పిల్లల చదువులకు అవసరమైన మొత్తాన్ని జమ చేసేందుకు వీలైనంత తొందరగా పెట్టుబడులు పెట్టండి. మ్యూచువల్‌ ఫండ్లు, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌లాంటి వాటిని ఎంచుకోండి. సూచీ ఫండ్లలో నెలకు రూ.5,000 మదుపు చేసేందుకు ప్రయత్నించండి. 18 ఏళ్లలో 12 శాతం వార్షిక రాబడితో రూ.38లక్షల వరకూ జమ అవుతాయి. అదే ఏటా 10 శాతం పెంచితే.. రూ.72 లక్షలు చేతికి వస్తాయి.
  • పదవీ విరమణ ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వండి. పదవీ విరమణ నాటికి మీ వార్షికాదాయానికి 25 రెట్ల వరకూ మీ చేతిలో ఉండాలి.

అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని