Gold Plus Glass Industry IPO: ఐపీఓకి గోల్డ్‌ ప్లస్‌ గ్లాస్‌ ఇండస్ట్రీ.. సెబీకి దరఖాస్తు

Gold Plus Glass Industry IPO: రూ.500 కోట్లు విలువ చేసే కొత్త వాటాలతో పాటు 1.56 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద గోల్డ్‌ ప్లస్‌ గ్లాస్‌ ఇండస్ట్రీ ఐపీఓలో ఉంచనుంది.

Published : 11 Feb 2024 13:58 IST

Gold Plus Glass Industry IPO | దిల్లీ: ఫ్లోట్‌ గ్లాస్‌ తయారీ కంపెనీ ‘గోల్డ్‌ ప్లస్‌ గ్లాస్‌ ఇండస్ట్రీ లిమిటెడ్‌’ ఐపీఓకి (Gold Plus Glass Industry IPO) సిద్ధమవుతోంది. ఈ మేరకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి కోరుతూ ప్రాథమిక పత్రాలను సమర్పించింది. రూ.500 కోట్లు విలువ చేసే కొత్త షేర్లతో పాటు 1.56 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఐపీఓలో (IPO) అందుబాటులో ఉంచనుంది.

ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.100 కోట్లు సమీకరించాలని గోల్డ్‌ ప్లస్‌ గ్లాస్‌ ఇండస్ట్రీ (Gold Plus Glass Industry IPO) యోచిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఆ మేరకు ఐపీఓ పరిమాణాన్ని కుదిస్తారు. సమీకరించిన నిధులను రుణ చెల్లింపులతో పాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నారు. భారత్‌లో ఫ్లోట్‌ గ్లాస్‌ తయారు చేస్తున్న ప్రధాన కంపెనీల్లో ఇది కూడా ఒకటి. 2023 సెప్టెంబర్‌ నాటికి దేశీయ తయారీలో 22 శాతం వాటా ఈ కంపెనీదే. దీని ఉత్పత్తులను వాహన, నిర్మాణం రంగాలు సహా వివిధ పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. దీని తయారీ కేంద్రం బెళగావిలో ఉంది. క్లియర్‌ గ్లాస్‌, 28 రకాల వాల్యూ-యాడెడ్‌ గ్లాస్‌లు, 11 రకాల ప్రాసెస్డ్‌ గ్లాస్‌ ఉత్పత్తులను తయారు చేస్తోంది.

2022లోనూ గోల్డ్‌ ప్లస్‌ గ్లాస్‌ ఇండస్ట్రీ ఐపీఓకి (Gold Plus Glass Industry IPO) దరఖాస్తు చేసుకుంది. సెబీ అనుమతి కూడా లభించింది. కానీ, వివిధ కారణాల వల్ల పబ్లిక్‌ ఇష్యూను మాత్రం ప్రారంభించలేదు. తాజా ఐపీఓకి ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని