Power Tariff: కొత్త విద్యుత్‌ నిబంధనలు.. పగలు రాయితీ.. రాత్రి బాదుడు..!

Power Tariifs: సోలార్‌ అవర్స్‌లో విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా గ్రిడ్‌లపై భారాన్ని తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి కొత్త విద్యుత్‌ ఛార్జీల నిబంధనలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. 

Published : 23 Jun 2023 18:14 IST

దిల్లీ: విద్యుత్‌ ఛార్జీల (Power Tariff) నియమనిబంధనల్లో కొత్తగా మార్పులు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రకటించింది. టైమ్‌ ఆఫ్‌ డే (ToD) టారిఫ్‌ సిస్టమ్ పేరుతో తీసుకొస్తున్న ఈ విధానం ద్వారా ఉదయం వేళల్లో వినియోగదారులపై విద్యుత్‌ ఛార్జీల భారం 20 శాతం మేర తగ్గనుంది. అదేవిధంగా డిమాండ్ ఎక్కువగా ఉండే రాత్రి వేళల్లో విద్యుత్‌ ఛార్జీలు సాధారణం కంటే 10 నుంచి 20 శాతం మేర పెరుగుతాయని కేంద్ర విద్యుత్‌ శాఖ (Ministry of Power) మంత్రి ఆర్‌కే సింగ్‌ (RK Singh) తెలిపారు. ఈ నిబంధన 10 కిలోవాట్‌, అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉన్న వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు ఏప్రిల్‌ 1, 2024 నుంచి అమల్లోకి రానుంది. అలాగే వ్యవసాయ వినియోగదారులకు మినహాయించి, ఇతర వినియోగదారులకు ఏప్రిల్‌ 1, 2025 నుంచి అమలుకానున్నట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ తెలిపింది. యూజర్లు ఏ సమయంలో ఎంత విద్యుత్‌ ఉపయోగించారనేది స్మార్ట్‌ మీటర్ల ఆధారంగా గుర్తిస్తామని వెల్లడించింది.

డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో వినియోగదారులు ఎక్కువ విద్యుత్‌ను వాడుకునేలా ప్రోత్సహించడం ద్వారా గ్రిడ్‌లపై భారం తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది. ‘‘ ఉదయం వేళ సోలార్‌ పవర్‌ అందుబాటులో ఉండటం వల్ల దాని ధర తక్కువగా ఉంటుంది. అందుకే ఉదయం వేళలను సోలార్‌ అవర్స్‌గా పేర్కొంటూ.. ఆ సమయంలో వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా విద్యుత్‌ ఛార్జీలు తక్కువ చేశాం. రాత్రి వేళ హైడ్రో, థర్మల్‌, బయోమాస్‌ విద్యుత్‌ వినియోగం పెరుగుతుంది. వాటి నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల రాత్రి వేళల్లో విద్యుత్‌ ఛార్జీల ధరలు పెంచాలని నిర్ణయించాం. దీనివల్ల తమ విద్యుత్‌ అవసరాలను సోలార్‌ అవర్స్‌కు మార్చుకునే వినియోగదారులకు లబ్ధి చేకూరుతుంది ’’ అని మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు.  

వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో దేశవ్యాప్తంగా విద్యుత్‌ వినియోగం పెరిగింది. రాబోయే నాలుగేళ్లలో వినియోగం రెట్టింపు అవుతుందని కేంద్రం అంచనా వేసింది. దేశవ్యాప్తంగా మార్చి 2022 నాటికి డిమాండ్ నాలుగు శాతం ఉండగా... మార్చి 2027 నాటికి ఇది సుమారు 7.2 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కొత్త విద్యుత్‌ ఛార్జీల నియమాలు అమలు చేయడం ద్వారా గ్రిడ్‌లపై భారాన్ని తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది.

దాంతోపాటు స్మార్ట్‌ మీటర్‌ నిబంధనల్లో కూడా మార్పులు చేసినట్లు విద్యుత్ శాఖ తెలిపింది. స్మార్ట్‌ మీటర్‌ బిగించిన తేదీకి ముందు వరకు వినియోగించిన విద్యుత్‌పై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని తెలిపింది. స్మార్ట్‌ మీటర్‌ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. గతంలో స్మార్ట్‌ మీటర్‌ ఇన్‌స్టాల్ చేసిన తేదీ కంటే ముందు వరకు ఉపయోగించిన విద్యుత్‌పై జరిమానా రూపంలో అదనపు ఛార్జీలు విధించేవారు. ఇకపై ఆ నిబంధనను తొలగించినట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని