GPT Healthcare IPO: 22న జీపీటీ హెల్త్‌కేర్‌ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.177-186

GPT Healthcare IPO: రూ.502 కోట్ల సమీకరణ లక్ష్యంతో జీపీటీ హెల్త్‌కేర్‌ ఐపీఓకి రాబోతోంది.

Updated : 19 Feb 2024 13:27 IST

GPT Healthcare IPO | దిల్లీ: ఐఎల్‌ఎస్‌ హాస్పిటల్స్‌ బ్రాండ్‌తో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్వహిస్తున్న జీపీటీ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ ఐపీఓ (GPT Healthcare IPO) ఫిబ్రవరి 22-26 మధ్య జరగనుంది. షేరు ధరల శ్రేణిని రూ.177-186 మధ్య నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.502 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఫిబ్రవరి 21న బిడ్డింగ్‌ ప్రారంభమవుతుంది.

ఈ ఐపీఓ (IPO)లో రూ.40 కోట్ల విలువ చేసే కొత్త షేర్లతో పాటు 2.6 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తున్నారు. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమకూరిన నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది. జీపీటీ హెల్త్‌కేర్‌ను కోల్‌కతాలో 2000 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రస్తుతం 561 పడకల సామర్థ్యం ఉన్న నాలుగు పూర్తిస్థాయి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్వహిస్తోంది. గ్లోబల్‌ హెల్త్‌, కిమ్స్‌, జుపిటర్‌ లైఫ్ లైన్‌ వంటి నమోదిత సంస్థలతో ఇది పోటీ పడుతోంది.

మదుపర్లు రూ.14,880తో కనీసం 80 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.337.41 కోట్లుగా నమోదైన సంస్థ ఆదాయం 2023 నాటికి 7.3 శాతం పెరిగి రూ.361.03 కోట్లకు చేరింది. జేఎం ఫైనాన్షియల్‌ ఈ ఐపీఓకి బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్లు లిస్ట్‌ కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని