World Cup: వరల్డ్‌ కప్‌ టికెట్లపై వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు!

World Cup: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగబోతోంది. ఈ మ్యాచ్‌ టికెట్లకు ఎంత డిమాండ్‌ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరుణంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఎక్స్‌లో చేసిన పోస్ట్‌ చర్చనీయాంశమైంది.

Updated : 19 Nov 2023 10:35 IST

దిల్లీ: దేశమంతా వరల్డ్‌ కప్‌ (World Cup 2023) మేనియా నడుస్తోంది. భారత్‌- ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తుది పోరు కోసం యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రత్యక్షంగా లక్షకుపైగా.. టీవీల ముందు కోట్లాది మంది వీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి మ్యాచ్‌ టికెట్లకు ఎంత డిమాండ్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) ‘ఎక్స్‌’లో చేసిన ఓ పోస్ట్‌ చర్చనీయాంశమైంది. ఓ వర్గం నుంచి విమర్శలూ ఎదురవుతున్నాయి.

సాధారణంగా ఇలాంటి మ్యాచ్‌లకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను నిర్వాహకులే స్వయంగా ఆహ్వానిస్తుంటారు. వారికి ఉచితంగా పాస్‌లు అందజేస్తుంటారు. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు పాస్‌లు పొందారు. దీనిపైనే తాజాగా గోయెంకా ఓ విమర్శనాత్మక పోస్ట్‌ చేశారు. వ్యాపారావేత్తల్లోని తమ స్నేహితులెవరూ టికెట్లు కొనలేదన్నారు. ఏదోలా ఉచిత పాస్‌లు పొందారని తెలిపారు. ఇక్కడే అసలు విషయం దాగుందని.. ధనవంతులే డబ్బులు చెల్లించడానికి ఇష్టపడరని ‘ఎక్స్‌’లో ఆయన పోస్ట్‌ చేశారు.

గోయెంకా పోస్ట్‌పై ఓ యూజర్‌ స్పందిస్తూ.. ‘‘అసలు మీరు టికెట్‌ కొని వెళ్తున్నారా? లేక పాస్‌ తీసుకున్నారా?’’ అని ఆరా తీశారు. దీనికి ఆయన ప్రతిస్పందిస్తూ.. రెండూ తీసుకోలేదని చెప్పారు. అయితే, కొన్ని వర్గాల నుంచి గోయెంకా పోస్ట్‌పై విమర్శలూ వస్తున్నాయి.

ఒక్క టికెట్ రూ.1.87 లక్షలు..

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌ ఒక్కో టికెట్‌ ధర దాదాపు రూ.రెండు లక్షల వరకు పలుకుతోంది. ఓ టికెట్‌ రీ-సెల్లింగ్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. టైర్ 4 టికెట్ ధర ఏకంగా రూ.1,87,407గా ఉంది. దీనికి పక్కనే ఉండే టైర్ టికెట్ ధర రూ.1,57,421గా ఉంది. ఈ వెబ్‌సైట్‌లో అతి తక్కువగా ఉన్న టికెట్ ధర రూ.32,000. ఈ ధరలను చూసి అభిమానులు షాక్‌ అవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని