HDFC Merger: హెచ్‌డీఎఫ్‌సీ విలీనం.. మోర్గాన్‌ స్టాన్లీని దాటేసి..!

HDFC Merger: హెచ్‌డీఎఫ్‌సీ విలీనం తర్వాత విలువపరంగా అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది. ప్రపంచ ప్రఖ్యాత బ్యాంకుల సరసన చేరనుంది.

Published : 30 Jun 2023 14:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశీయ ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ విలీనం (HDFC merger) తర్వాత అరుదైన ఘనత సాధించనుంది. మార్టగేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) విలీనం అనంతరం విలువ పరంగా దేశంలోనే అత్యంత విలువైన బ్యాంకుగా నిలవనుంది. అమెరికా, చైనాకు చెందిన దిగ్గజ బ్యాంకుల సరసన చేరనుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ జులై 1 నుంచి విలీనం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విలీనం అనంతరం ఏర్పడే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC bank) మార్కెట్‌ విలువ 172 బిలియన్‌ డాలర్లుగా ఉండనుంది. జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ అండ్‌ కో, ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా లిమిటెడ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా తర్వాత స్థానానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చేరనుంది.

విలీనం అనంతరం ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌’ 12 కోట్ల కస్టమర్లతో అతిపెద్ద బ్యాంక్‌గా నిలుస్తుంది. ఈ సంఖ్య జర్మనీ జనాభా కంటే అధికం. బ్యాంకుశాఖల సంఖ్య 8,300కు.. ఉద్యోగుల సంఖ్య 1.77 లక్షలకు చేరనుంది. దేశీయంగా అతిపెద్ద బ్యాంకులుగా పేరొందిన ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ మార్కెట్‌ విలువ 62 బిలియన్‌ డాలర్లు కాగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ 79 బిలియన్‌ డాలర్లుగా ఉంది. విలీనం అనంతరం మార్కెట్‌ విలువ పరంగా వీటికి అందనంత ఎత్తులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిలవనుంది.

ప్రస్తుతం విలువ పరంగా హెచ్‌డీఎఫ్‌సీ నాలుగో స్థానంలో ఉండగా.. అగ్రికల్చర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, చైనా కన్‌స్ట్రక్షన్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ, వెల్స్‌ఫార్గో, బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, మోర్గాన్‌ స్టాన్లీ వంటి బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తర్వాతి స్థానాల్లో ఉండనున్నాయి. ఇప్పటి వరకు మార్టగేజ్‌ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన వారిలో 70 శాతం మందికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఖాతాల్లేవు. వారందరూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతాలు తెరిస్తే డిపాజిట్లు మరింత పెరుగుతాయి. సేవలు విస్తృతం కావడంతో గృహరుణాల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని