Illegal Betting: అక్రమ బెట్టింగ్‌.. ఖజానాకు ఏటా రూ.2లక్షల కోట్లు గండి!

అక్రమంగా బెట్టింగ్‌(Illegal betting), గ్యాంబ్లింగ్‌ (Gambling) కార్యకలాపాలతో ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.2లక్షల కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు తాజా నివేదిక అంచనా వేసింది.

Published : 19 Oct 2023 18:24 IST

దిల్లీ: క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ జరుగుతోన్న వేళ.. బెట్టింగ్‌ కార్యకలాపాలు (Illegal betting) ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమ మార్గాల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా అక్రమంగా బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ (Gambling) కార్యకలాపాలతో ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.2లక్షల కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు తాజా నివేదిక అంచనా వేసింది.

చట్టవిరుద్ధమైన స్పోర్ట్స్‌ బెట్టింగ్‌ (Sports Betting) మార్కెట్‌కు భారత్‌ నుంచి ఏటా రూ.8.2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని థింక్‌ ఛేంజ్‌ ఫోరమ్‌ (TCF) నివేదిక వెల్లడించింది. డిజిటల్‌ సదుపాయాలు పెరగడం, స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం, క్రీడా కార్యక్రమాలు విస్తరించడం అనేవి ఇటువంటి ప్రవాహానికి దోహదం చేశాయని పేర్కొంది. నియంత్రణ ఉన్నప్పటికీ.. భారత్‌లో అక్రమ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ మార్కెట్‌ ఊహించని రీతిలో పెరిగిందని తెలిపింది. ఇలా ఏటా రూ.8.2 లక్షల కోట్లు బెట్టింగ్‌ రూపంలో చేతులు మారుతుండటాన్ని ఆధారంగా చేసుకుంటే.. 28 శాతం జీఎస్టీ లెక్కన భారత్‌ ఏటా రూ.2.29 లక్షల కోట్లు నష్టపోతున్నట్లు టీసీఎఫ్‌ అంచనా వేసింది.

ఆన్లైన్ బెట్టింగ్‌పై కేంద్రం సీరియస్‌.. ప్రకటనలు చేయొద్దంటూ సూచన

భారత్‌ పౌరులే లక్ష్యంగా దాదాపు 75 బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ సైట్లు ఉన్నాయని.. వీటిలో చాలావాటిపై నిషేధం ఉన్నప్పటికీ అవి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని టీసీఎఫ్‌ నివేదిక వెల్లడించింది. భారత యూజర్లను ఆకర్షించేందుకు బాలీవుడ్‌ నటులు, ప్రముఖ క్రీడాకారులను ప్రచారకర్తలుగా నియమించుకుంటున్నట్లు తెలిపింది. బెట్టింగ్‌పై నిషేధం విధించడం వల్ల హవాలా, క్రిప్టోకరెన్సీతోపాటు ఇతర అక్రమ మార్గాల్లో నిధులు తరలివెళ్లిపోతున్నాయని అభిప్రాయపడింది. భారత్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ ఆధిపత్యం కొనసాగిస్తోందని.. ముఖ్యంగా ఐపీఎల్‌ వంటి సీజన్‌లో ఇది మరింత ఎక్కువగా ఉంటోందని తాజా నివేదిక తెలిపింది.  బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌లలో సుమారు 14 కోట్ల మంది పాల్గొంటున్నారని, ఐపీఎల్‌ సమయంలో ఈ సంఖ్య 37 కోట్లుగా ఉంటున్నట్లు అంచనా వేసింది.

 కాసినో కంపెనీలు ఏర్పాటు చేసే (Offshore) ఇటువంటి కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయడం, అనుమతి ఉన్న గేమింగ్‌ వేదికల నుంచి ఈ ప్రవాహాన్ని అడ్డుకునేందుకు సదరు ఆఫ్‌షోర్‌ ఆపరేటర్లను భారత్‌లోనే రిజిస్టర్‌ చేసుకునేలా ఒత్తిడి తేవాలని సూచించింది. వీటన్నింటినీ కట్టడి చేసేందుకు కొత్త జీఎస్టీ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని