Income tax: సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అందుబాటులో ఉన్న ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

ఆదాయపు పన్ను చట్టం.. సీనియర్ సిటిజన్లకు అనేక పన్ను ప్రయోజనాలను అందిస్తోంది.

Updated : 26 Jul 2022 15:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయపు పన్ను చట్టం.. సీనియర్ సిటిజన్లకు అనేక పన్ను ప్రయోజనాలను అందిస్తోంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పోలిస్తే, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అధిక మిన‌హాయింపు ప‌రిమితి ల‌భించ‌డంతో పాటు, నిర్దిష్ట ష‌ర‌తుల‌కు లోబ‌డి వారు రిట‌ర్నుల దాఖ‌లు నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు. అలాగే, సీనియర్ సిటిజన్లు ముందస్తు ప‌న్ను (అడ్వాన్స్ ట్యాక్స్) నుంచి ఉపశమనం పొందవచ్చు. సీనియ‌ర్ సిటిజ‌న్ల ఆదాయ‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను ఇప్పుడు చూద్దాం. 

ప్రాథ‌మిక మిన‌హాయింపు ప‌రిధి: సాధారణ లేదా నాన్-సీనియ‌ర్ పన్ను చెల్లింపుదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు, సూప‌ర్‌/వెరీ సీనియర్ సిటిజన్లకు అధిక పన్ను మినహాయింపు పరిమితి ఉంటుంది. 60 ఏళ్లలోపు వ‌య‌సు ఉన్న వారు వార్షిక ఆదాయం రూ.2.50 ల‌క్ష‌లకు మించి ఉంటే ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను ఫైల్ చేయాలి. అయితే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఈ మిన‌హాయింపు ప‌రిమితి రూ.3 ల‌క్ష‌లు, సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంది. ఇది పాత ప‌న్ను విధానం ఎంచుకున్న వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. కొత్త ప‌న్ను విధానం ఎంచుకుంటే అంద‌రికీ ఒకే ర‌క‌మైన స్లాబులు వ‌ర్తిస్తాయి.

పాత‌ ప‌న్ను విధానం ప్ర‌కారం వ‌ర్తించే స్లాబులు.. రేట్లు

 

కొత్త ప‌న్ను విధానం ప్ర‌కారం వ‌ర్తించే స్లాబులు..రేట్లు..

రిట‌ర్నుల దాఖ‌లు నుంచి ఉప‌శ‌మ‌నం: 75 సంవ‌త్స‌రాలు, అంత‌కంటే ఎక్కువ వ‌య‌సున్న వ్య‌క్తుల ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు. పింఛను పొందే అదే బ్యాంకులో డిపాజిట్ల నుంచి వ‌డ్డీ ఆదాయాన్ని పొందుతున్న‌ప్పుడు ఆ వ్య‌క్తి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేయాల్సిన అవ‌సరం లేదు. అయితే ఇక్క‌డ ఆ వ్య‌క్తికి ఇత‌ర ఆదాయ వ‌న‌రులు ఉండ‌కూడ‌దు. సీనియ‌ర్ సిటిజ‌న్లు ఛాప్ట‌ర్ VI A కింద‌ త‌గ్గింపుల‌ను, సెక్ష‌న్ 87A కింద లభించే రాయితీని ప్రకటిస్తూ ఫారం 12BBAని బ్యాంక్‌కు సమర్పించాలి.

వ‌డ్డీ ఆదాయంపై టీడీఎస్ విధించకుండా: పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్స్, ప్రావిడెండ్ ఫండ్ విత్‌డ్రా, ఎల్‌ఐసీ మెచ్యూరిటీ మొత్తం మొదలైన వాటి నుంచి వ‌చ్చే ఆదాయంపై మూలం వ‌ద్ద ప‌న్ను (టీడీఎస్‌) తీసి వేయకుండా సీనియ‌ర్ సిటిజ‌న్లు ఫారం 15Hలో ప‌న్ను మిన‌హాయింపుదారుల‌కు డిక్లరేష‌న్ స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

వ‌డ్డీ ఆదాయంపై రూ.50 వేల మిన‌హాయింపు: 60 ఏళ్లు, అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న సీనియ‌ర్ సిటిజ‌న్లు సెక్ష‌న్ 80TTB కింద బ్యాంకు, పోస్టాఫీసు పొదుపు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ట‌ర్మ్ డిపాజిట్ల నుంచి వ‌చ్చే వ‌డ్డీ ఆదాయంపై రూ. 50 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అంత‌కు మించి వచ్చిన వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను చెల్లింపుదారులు వారికి వ‌ర్తించే స్లాబు ప్ర‌కారం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. సీనియ‌ర్ సిజిటన్లకు ఈ మార్గాల ద్వారా వ‌చ్చే వ‌డ్డీ ఆదాయంపై 80TTA కింద రూ. 10 వేల వ‌ర‌కు మాత్ర‌మే మిన‌హాయింపు ల‌భిస్తుంది.

ఆరోగ్య బీమా ప్రీమియంలు, వైద్య ఖ‌ర్చులు: సీనియ‌ర్ సిటిజ‌న్లు కాని వారు ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు, ముందుస్తు వైద్య ప‌రీక్ష‌ల‌కు అయ్యే ఖ‌ర్చుపై సెక్ష‌న్ 80డి కింద రూ.25వేల వ‌ర‌కు మాత్ర‌మే మిన‌హాయింపు ల‌భిస్తుంది. కానీ సీనియ‌ర్ సిటిజన్లకు రూ.50వేల వ‌ర‌కు మిన‌హాయింపు ల‌భిస్తుంది. సీనియ‌ర్ సిటిజ‌న్లు త‌మ కోసం గానీ, కుటుంబం కోసం గానీ వైద్య చికిత్స‌ల‌కు అయ్యే ఖ‌ర్చుల‌ను సెక్ష‌న్ 80డి కింద నిబంధ‌న‌ల‌కు లోబ‌డి క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

నిర్దిష్ట అనారోగ్యాల‌కు: నిర్దిష్ట వ్యాధుల వైద్య చికిత్సల‌కు అయ్యే ఖర్చులపై సెక్ష‌న్ 80DDB అద‌నపు మిన‌హాయింపును పొంద‌వ‌చ్చు. క్యాన్సర్, నాడీ సంబంధిత వ్యాధులు మొదలైన అనారోగ్యాలు/వ్యాధుల వైద్య చికిత్స ఖర్చులలో రూ.1 లక్ష‌ వరకు త‌గ్గింపును అనుమతిస్తారు. 

రివ‌ర్స్ మోర్ట‌గేజ్‌: సీనియ‌ర్ సిటిజ‌న్లు రివ‌ర్స్ మోర్ట‌గేజ్ స్కీమ్ ద్వారా త‌మ ఇంటిని త‌న‌ఖా పెట్ట‌డం ద్వారా జీవితాంతం నెల‌వారీ క్ర‌మ‌మైన చెల్లింపులు పొంద‌వ‌చ్చు. అయితే, ఆస్తి సీనియ‌ర్ సిటిజన్ వ‌ద్దే ఉంటుంది. రుణ గ్ర‌హీత మ‌ర‌ణించిన త‌ర్వాత, రుణ‌దాత ఆస్తిని విక్ర‌యించి, వ‌చ్చిన మొత్తం నుంచి వ‌డ్డీతో స‌హా మొత్తం రుణాన్ని జ‌మ చేసుకుంటారు. మిగిలిన మొత్తాన్ని రుణ‌గ్ర‌హీత చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వార‌సుల‌కు అప్ప‌గిస్తారు. ఈ స్కీమ్ కింద సీనియ‌ర్ సిటిజ‌న్లకు వారి జీవిత కాలంలో చెల్లించిన వాయిదాల‌కు పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. 

అడ్వాన్స్ ట్యాక్స్‌: సెక్షన్ 207 ప్రకారం, ఒక సీనియర్ సిటిజన్, వ్యాపారం లేదా వృత్తి నుంచి ఎటువంటి ఆదాయాన్ని కలిగి ఉండకపోతే, ముందస్తు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. సీనియర్ కాని పౌరుల విషయంలో, సంవత్సరానికి అంచనా వేసిన పన్ను బాధ్యత రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని