Russia oil: రష్యా క్రూడ్‌.. 80 శాతం భారత్, చైనాకే!

భారత్‌లోకి రష్యా చమురు వరద కొనసాగుతోంది. ఏప్రిల్‌ నెలతో పోలిస్తే మే నెలలో ఇది 14 శాతం పెరిగింది. మరోవైపు చైనా.. రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచుకుంటోంది.

Published : 16 Jun 2023 13:31 IST

దిల్లీ: రష్యా నుంచి చౌకగా లభిస్తున్న క్రూడాయిల్‌ (Russia oil) కొనుగోలు విషయంలో భారత్‌, చైనా (India, China) పోటీ పడుతున్నాయి.  అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకునే ఈ రెండు దేశాలు.. రోజురోజుకూ రష్యా నుంచి చమురు దిగుమతుల్ని పెంచుకుంటున్నాయి. మే నెలలో ఇది మరింత పెరిగిందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. మాస్కో ఎగుమతి చేస్తున్న ముడిచమురులో 80 శాతం ఈ రెండు దేశాలే దిగుమతి చేసుకుంటున్నాయని తెలపింది.

ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు రష్యా చమురు ఎగుమతులు ప్రధానంగా యూరోపియన్‌ దేశాలకే ఉండేది. ఆసియా దేశాలకు కేవలం 34 శాతం మాత్రమే ఎగుమతి అయ్యేది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడం.. పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో ఇప్పుడు రష్యా చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఆసియా దేశాలకే ఎగుమతి అవుతోంది. ఆసియాలో మరికొన్ని దేశాలు సైతం ఈ చౌక చమురు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి.

మే నెలలో రష్యా రోజుకు సగటున 3.87 మిలియన్‌ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసింది. ఇందులో దాదాపు 2 మిలియన్‌ బ్యారెళ్లను భారత్‌ దిగుమతి చేసుకుంది. అదే చైనా అయితే ఏకంగా 2.2 మిలియన్‌ బ్యారెళ్లను దిగుమతి చేసుకుంది. మే నెలలో భారత్‌ చమురు అవసరాలను 45 శాతం మేర రష్యానే తీర్చడం గమనార్హం. ఏప్రిల్‌ నెలతో పోలిస్తే చమురు దిగుమతి 14 శాతం పెరిగింది. అదే చైనా మొత్తం చమురు అవసరాల్లో రష్యా వాటా తాజాగా 20 శాతానికి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని