Innova Captab IPO: 21న ఇన్నోవా క్యాప్‌ట్యాబ్‌ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.426-448

Innova Captab IPO: రూ.570 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇన్నోవా క్యాప్‌ట్యాబ్‌ ఐపీఓకి వస్తోంది.

Published : 18 Dec 2023 17:21 IST

దిల్లీ: ఇంటిగ్రేటెడ్‌ ఫార్మా కంపెనీ ఇన్నోవా క్యాప్‌ట్యాబ్‌ ఈ నెల 21న ఐపీఓకి (Innova Captab IPO) రానుంది. 26వ తేదీ వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ధరల శ్రేణిని రూ.426-448గా నిర్ణయించారు. ఈ ఐపీఓలో (IPO) గరిష్ఠ ధర వద్ద రూ.570 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇన్నోవా క్యాప్‌ట్యాబ్‌ ఐపీఓలో (Innova Captab IPO) రూ.320 కోట్లు విలువ చేసే కొత్త షేర్లను జారీ చేస్తున్నారు. మరో 55.80 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమకూరిన నిధుల్లో రూ.144.40 కోట్లను రుణ చెల్లింపులకు, రూ.23.60 కోట్లు అనుబంధ సంస్థ యూఎంఎల్‌లో పెట్టుబడులకు, రూ.72 కోట్లు నిర్వహణ మూలధన అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. కొంత మొత్తాన్ని సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కూడా వాడుకోనున్నట్లు పేర్కొంది.

ఐపీఓలో (Innova Captab IPO) అందుబాటులో ఉన్న షేర్లలో సగం వరకు అర్హతగల సంస్థాగత మదుపర్లకు కేటాయించారు. మరో 35 శాతం రిటైల్‌ మదుపర్లకు, 15 శాతం సంస్థాగతేతర కొనుగోలుదారులకు రిజర్వ్‌ చేశారు. మదుపర్లు గరిష్ఠంగా 33 ఈక్విటీ షేర్లకు (ఒక లాట్‌) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే షేరు గరిష్ఠ ధర వద్ద కనీసం రూ.14,784 పెట్టుబడిగా పెట్టాలి.

ఫార్మా ఉత్పత్తుల పరిశోధన- అభివృద్ధి నుంచి తయారీ, పంపిణీ, మార్కెటింగ్‌, ఎగుమతుల వరకు అన్ని కార్యక్రలాపాలను ఇన్నోవా క్యాప్‌ట్యాబ్‌ నిర్వహిస్తుంటుంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకీకృత ఆదాయం వార్షిక ప్రాతిపదికన 15.72 శాతం పెరిగి రూ.926.38 కోట్లకు చేరింది. పన్నుల తర్వాత లాభం 6.26 శాతం పుంజుకొని రూ.67.95 కోట్లకు పెరిగింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, జేఎం ఫైనాన్షియల్‌ ఈ ఐపీఓకి (Innova Captab IPO) బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్లు లిస్ట్‌ కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని