Jio Financial: బాండ్ల జారీకి సిద్ధమవుతున్న జియో ఫైనాన్షియల్‌!

జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బాండ్ల జారీకి సిద్ధమవుతోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ మధ్యే రూ.20వేల కోట్లు సమీకరించగా.. జియో ఫిన్‌ రూ.5 వేల నుంచి రూ.10వేల కోట్ల వరకు సమీకరించనున్నట్లు తెలుస్తోంది.

Updated : 20 Nov 2023 16:53 IST

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి వేరుపడిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (Jio Financial Services) బాండ్ల జారీకి సిద్ధమవుతోంది. ఈ మేరకు మర్చంట్‌ బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. బాండ్ల జారీ ద్వారా రూ.5 వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్ల మేర సమీకరించాలని ఆ కంపెనీ ఆశిస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే బాండ్ల జారీ చేయొచ్చని తెలుస్తోంది.

ఈ ఏడాది ఆగస్టులో జియో ఫైనాన్షియల్‌ మార్కెట్లో లిస్టయిన సంగతి తెలిసిందే. దేశీయంగా బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి సంస్థలకు గట్టి పోటీనివ్వాలని ఆ సంస్థ భావిస్తోంది. హోమ్‌, పర్సనల్‌, ఆటో లోన్స్‌ ద్వారా పూర్తి స్థాయి ఫైనాన్షియల్‌ సంస్థగా అవతరించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో బాండ్లు జారీ చేసేందుకు జియో ఫైనాన్షియల్‌  సిద్ధమవుతోంది. బాండ్ల జారీకి ముందు క్రెడిట్ రేటింగ్‌తో పాటు సంబంధిత అనుమతులు పొందాల్సిన అవసరం ఉంటుంది.

Credit Cards: కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు.. వీటిపై ఓ లుక్కేయండి!

జియో ఫైనాన్షియల్‌కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి పెద్ద కంపెనీ వెన్నుదన్నుగా ఉన్న నేపథ్యంలో ‘ఏఏఏ’ రేటింగ్‌ రావడం సులభమేనని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ధర, కాలవ్యవధి వంటివి జారీ సమయంలో తెలియరానున్నాయి. ఈ మధ్యే జియో ఫైనాన్షియల్‌ మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పదేళ్ల కాలవ్యవధి కలిగిన బాండ్ల ద్వారా రూ.20వేల కోట్లను సమీకరించింది. రిలయన్స్‌ జారీ చేసిన బాండ్ల కంటే జియో ఫిన్‌ జారీ చేసే బాండ్ల కూపన్‌ రేటు కాస్త అధికంగానే ఉండొచ్చని చెబుతున్నారు. బాండ్ల జారీపై జియో ఫైనాన్షియల్‌ అధికారికంగా స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని