Jio Financial Services: జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌.. లిస్టింగ్‌ తేదీ ఫిక్స్‌

Jio Financial Services: జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ మార్కెట్ లిస్టింగ్‌కు తేదీ ఫిక్స్‌ అయ్యింది. వచ్చే వారం నుంచి ఈ కంపెనీ షేర్లు ట్రేడింగ్‌ కానున్నాయి.

Published : 18 Aug 2023 15:37 IST

ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIL) నుంచి విభజించిన ఆర్థిక సేవల విభాగం జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (Jio Financial Services Limited) స్టాక్‌ మార్కెట్ల (Stock Market)లో ఎంట్రీకి సిద్ధమైంది. ఆగస్టు 21న ఈ కంపెనీ మార్కెట్లలో లిస్ట్‌ (Listing) అవనుంది. ఈ మేరకు శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌ సందర్భంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది.

ఆర్‌ఐఎల్‌ (RIL) ఇటీవల తన వ్యాపార ఆర్థిక సేవల విభాగమైన రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను (జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌) విభజించిన విషయం తెలిసిందే. గతవారమే అర్హులైన ఆర్‌ఐఎల్‌ వాటాదారుల డిమ్యాట్‌ ఖాతాల్లోకి జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (JFSL) షేర్లను జమ చేశారు. విభజన పథకం ప్రకారం.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదార్లు తమ వద్ద ఉన్న ప్రతి షేరుకు.. ఒక జేఎఫ్‌ఎస్‌ఎల్‌ షేరును పొందారు.

ఫిక్స్‌డ్‌ వడ్డీరేట్లకు మారే అవకాశమివ్వండి.. బ్యాంకులకు RBI సూచన

ఈ నేపథ్యంలో గత నెల 20న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ప్రత్యేక ప్రీ-ఓపెన్‌ సెషన్‌ను నిర్వహించి జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరు స్థిర విలువను రూ.261.85గా నిర్ధారించారు. అలా లెక్కించగా.. దీని మార్కెట్‌ విలువ రూ.1,66,000 కోట్లుగా తేలింది. ఈ విలువ ప్రకారం.. దేశంలోనే రెండో అతిపెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ ఇది. అన్ని రంగాల్లో చూస్తే.. దేశంలోనే అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన జాబితాలో 32వ స్థానంలో ఉంది. టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ కంటే జేఎఫ్‌ఎస్‌ఎల్‌ మార్కెట్‌ విలువే ఎక్కువగా ఉంది.

కాగా.. జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ను అన్ని ఎఫ్‌టీఎస్‌ఈ ప్రపంచ సూచీల నుంచి తొలగిస్తున్నట్లు ఎఫ్‌టీఎస్‌ఈ రస్సెల్‌ గురువారం ప్రకటించింది. ఆగస్టు 22 నుంచి ఈ షేర్లను తొలగించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే దేశీయ స్టాక్‌ మార్కెట్లలో జియో లిస్టింగ్‌పై రిలయన్స్‌ ప్రకటన చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని