Jio Payments: ఫోన్‌పే, పేటీఎంలకు పోటీగా జియో పేమెంట్స్‌ సౌండ్‌ బాక్స్‌!

Jio Payments: ఫిన్‌టెక్‌ సంస్థలు ఫోన్‌పే, పేటీఎంకు పోటీగా జియో పేమెంట్స్‌ సౌండ్ బాక్స్‌ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. 

Published : 13 Mar 2024 00:27 IST

Jio Payments | ఇంటర్నెట్‌డెస్క్‌: రానున్న రోజుల్లో సౌండ్‌ బాక్స్‌ (Soundbox) విభాగంలో గట్టి పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. పేటీఎం (Paytm)పై ఆంక్షలు విధించిన నేపథ్యంలో స్మార్ట్‌ స్పీకర్‌ను తీసుకురానున్నట్లు గూగుల్‌పే (Google Pay) ఇప్పటికే ప్రకటించింది. తాజాగా రిలయన్స్‌కు చెందిన జియో పేమెంట్స్‌ (Jio Payments) కూడా ఇదే విభాగంలో తన సత్తా చాటుకొనేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంటే త్వరలోనే జియో పేమెంట్స్‌ నుంచి సౌండ్‌ బాక్స్‌లు రానున్నాయన్నమాట.

ఇప్పటికే జియో పేమెంట్స్‌ జియో పే యాప్‌ను నిర్వహిస్తోంది. సౌండ్‌ బాక్స్ టెక్నాలజీతో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని చూస్తోంది. మొదట జైపుర్‌, ఇందౌర్‌, లఖ్‌నవూ వంటి టైర్‌-2 నగరాలు రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన రిటైల్ స్టోర్లలో పరీక్షించనున్నారు. తర్వాత అన్ని రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లలో వీటిని పరీక్షించనున్నారు. రెండు దశల్లో జియో పేమెంట్స్‌ నిర్వహించనున్న పైలట్‌ ప్రాజెక్ట్‌లు విజయవంతమైతే పూర్తిస్థాయిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!

ప్రస్తుతం సౌండ్ బాక్స్‌ విభాగంలో ఉన్న ఫోన్‌పే, పేటీఎంలు తమ హవా కొనసాగిస్తున్నాయి. భారత్‌పే ఇప్పటికే సౌండ్‌బాక్స్ విభాగంలోకి ప్రవేశించింది. ఇటీవల గూగుల్‌ పే కూడా ఈ విభాగంలో ప్రవేశించనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జియో కూడా ఈ విభాగంలో ఎంట్రీకి సిద్ధమవుతోంది. పేటీఎంపై ఆంక్షల నేపథ్యంలో వ్యూహాత్మకంగా జియో   ఈ నిర్ణయం తీసుకుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. సౌండ్‌ బాక్స్‌ను తొలుత తక్కువ ఛార్జీకే తీసుకురానుందని తెలుస్తోంది. దీంతో ఈ విభాగంలోని ఇతర సంస్థలకు జియో పేమెంట్స్‌ గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతం పేటీఎం ఈ సౌండ్‌ బాక్స్‌ను రూ.1కే అందిస్తోంది. నెలవారీ రూ.125 ఛార్జి వసూలు చేస్తోంది. ఫోన్‌ పే నెలకు రూ.49 అద్దెగా వసూలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని