Maruti Suzuki: మారుతీ లాభం 42% వృద్ధి.. ఒక్కో షేరుపై 90 డివిడెండ్‌

Maruti Suzuki Q4 results: మార్చితో ముగిసిన త్రైమాసికంలో మారుతీ సుజుకీ రూ.2,671 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 42 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Published : 26 Apr 2023 16:37 IST

దిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఆకర్షణీయమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (Q4 results) స్టాండలోన్‌ పద్ధతిన రూ.2,671 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,876 కోట్లతో పోలిస్తే లాభం 42 శాతం వృద్ధి చెందింది. కార్యకలాపాల ఆదాయం సైతం రూ.26,749 కోట్ల నుంచి 20 శాతం వృద్ధి చెంది రూ.32,060 కోట్లుగా నమోదైంది.

2022-23 మొత్తం ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.8,211 కోట్ల నికర లాభాన్ని మారుతీ ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.3,879 కోట్లుగా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.88,330 కోట్ల విలువైన వాహనాలను మారుతీ విక్రయించగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,17,571 కోట్ల విలువైన వాహనాలను మారుతీ విక్రయించింది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్‌ చెల్లింపులకూ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో షేరుకు రూ.90 చొప్పున చెల్లించేందుకు నిర్ణయించింది. అలాగే వాహన ఉత్పత్తి సామర్థ్యాన్ని    పెంచేందుకూ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మనేసర్‌, గురుగ్రామ్‌ ప్లాంట్లలో వార్షిక సామర్థ్యం 13 లక్షలు ఉండగా.. మరో 10 లక్షల మేర ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఫలితాల నేపథ్యంలో మంగళవారం నాడు బీఎస్‌ఈలో మారుతీ షేరు రూ.8,503.15 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని